ఏ రఘుపతి వెంకయ్య నాయుడి దగ్గరైతే ఆఫీస్ బాయ్ గా చేశాడో…ప్రఖ్యాత నిర్మాత గా రఘుపతి వెంకయ్య నాయుడి పేరన ఇచ్చే పురస్కారం అందుకున్న ఘనత ఆయనది. 8 ఏళ్ళ వయస్సులో బయట ప్రపంచం లోకొచ్చి..ఎవరి సహాయమూ లేకుండానే 104 ఏళ్ళ సుధీర్ఘ జీవన యానం చేసిన రాఘవ గారి పేరు.. మన ఎల్.వి. ప్రసాద్ పేరు ప్రక్కనే గోల్డన్ లెటర్స్ తో చెక్కాలి.
కాకినాడ దగ్గర కోటిపల్లిలో ఇదే రోజు 1913 లో పేద రైతు కుటుంబం లో పుట్టిన రాఘవ కు చదువబ్బలేదు. స్కూల్ లో…ఇంట్లో చివాట్లు…పేదరికం భరించలేక 8 ఏళ్ళ వయస్సుకే ఓ తెగింపు వచ్చేసింది. ఓ రోజు రైల్వే స్టేషన్ కెళ్ళి ఏదో ఒక ట్రెయిన్ ఎక్కేశాడు. చేతిలో చిల్లి కాణీ కూడా లేదు. ఏ చెకింగూ లేదు లక్కీగా. కలకత్తా వెళ్ళే ట్రెయిన్ అది. కలకత్తా లో భాష రాదు. చిండబ్బు లేదు. ఆకలి.
ఒక పెద్ద విశాలమైన ఆవరణ ఉన్న బిల్డింగ్ దగ్గర నిల్చుని చూస్తుంటే…ఎవరో లోపలికి పిలిస్తే…వెళ్ళాడు. వాళ్ళ బెంగాలీ ఈ 8 ఏళ్ళ పిల్లాడికేం తెలుస్తుంది? ఆకలి అంటూ సైగ చేసి…పనిచేస్తాను అని తెలుగులో చెప్పాడు. ట్రాలీ తోసే నలుగురి లో ఒకడుగా తీసుకున్నారు. మూకీ సినిమాలు తీసే స్టూడియో అది. భోజనం పెట్టేవారు. అది 1921.
కొన్నేళ్ళ తరువాత టాకీలొచ్చేస్తున్నాయ్… మూకీలకు ఇక సెలవు…అని అనుకుంటుంటే భయపడి మళ్ళీ మద్రాస్ ట్రెయిన్ ఎక్కాడు. ఈసారీ టిక్కెట్ కొన్లేదు. విజయవాడ దగ్గర చెకింగ్ వాళ్ళు పట్టుకుని దింపేశారు. బెజవాడ రోడ్లు కొలుస్తూ పోతుంటే ఆ ఎండలో శోష వచ్చి పడిపోయాడు. అదీ పడడం పడడం….మన మద్రాస్ & ఆంధ్ర ప్రాంతాల్లో మొట్టమొదటి థియేటర్ మారుతీ థియేటర్ ఎదురుగా పడ్డాడు.
పోతిన శ్రీనివాసరావు నిర్మించారా థియేటర్ ను. మూకీలు ఆడేవి. ఆ మూకీలకు కస్తూరి శివరావు వ్యాఖ్యానం మైక్ లో చెప్పేవాడు. మూకీ నడుస్తుంటే తెరమీద. ఆయనకు.అసిస్టెంట్ గా రాఘవ చేరాడు. శివరావు బాగా చూసుకునే వాడట. ఇంట్లో చోటు కూడా ఇచ్చాడు. తనకొచ్చే 10 రూపాయల్లో 2 రూపాయలు రాఘవకిచ్చేవాడట !
* * *
రోజులు దొర్లి పోతున్నాయి.
ఎన్నాళ్ళిలా అని…
ఈ సారి టిక్కెట్ కొనుక్కొని మరీ మద్రాస్ ట్రెయిన్ ఎక్కాడు.
అక్కడ రఘుపతి వెంకయ్య నాయుడు ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా చేరాడు. అన్ని పనులూ చేసేవాడు.
కానీ చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. అందుకే వేషాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగి…
వీనస్ స్టూడియోలో ఓ సాధువు వేషం వేశాడు…సాధువుల గుంపులో.
కానీ మధ్యాహ్నం వాళ్ళు పెట్టిన భోజనం చెత్తగా ఉంది. వాంతులతో కళ్ళు బైర్లు కమ్మి పడిపోయాడు.
ఆ తరువాత ఓ గంట గడిచేప్పటికి…విచారం కలిగి డిప్రెషన్ కు లోనై…అక్కడే భావి లో దూకేశాడు…చద్దామని.
కానీ చావలేదు.
పైగా భావిలోనే కాపురముంటున్న పామొకటి కాటేసింది.
భయంకరమైన ఆ పరిస్థితిలో ఆయన్ని పైకిలాగి ట్రీట్ మెంట్ ఇప్పించి…పోలీసులకు అప్పగించారు. పోలీసులు జాలిపడి…వదిలేశారు ఆయన కథ విని.
ఇలాంటి అనుభవాలతో…
అన్ని స్టూడియోలలో ఎక్కడ పని ఉంటే…అదీ ఇదీఅని కాదు…
అన్ని రకాల పనులూ చేశాడు.
ప్రొడక్షన్ బాయ్ -లైటింగ్ బాయ్ -స్టంట్ అసిస్టెంట్ -డ్యాన్స్ అసిస్టెంట్ – గ్రూప్ డ్యాన్సర్ – ఎగస్ట్రా వేషగాడు…ఎన్నో….
ఏళ్ళు గడిచే కొద్దీ…పండిపోయాడాయన.
ప్రతి స్టూడియోలోనూ రాఘవంటే మంచి పేరు. ఏ పని చెప్పినా బాగా చేస్తాడని.
కానీ ఏమీ వెనకేసుకోనేలేదు. ఏ రోజుకారోజే!
అలాంటప్పుడు ఎం.జి.ఎం. వారు టార్జాన్ గోస్ టు ఇండియా అనే మూవీ తీస్తూ…మద్రాసొచ్చి….
ఎక్కువ భాషలు మాట్లాడగల వ్యక్తిని…రోం కు తీసుకెళ్ళాలని…చూస్తుంటే… రాఘవ వారినాకర్షించాడు.
అక్కడే అదృష్టం తలుపు తట్టింది.
రోం నగరం వెళ్ళాడు….ఎం.జి.ఎం వారితో.
ఆ ప్రయాణంలో రాఘవ గారు ఎన్ని చేదు అనుభవాల్ని ఎదుర్కొని ఉంటారో…
ఎంత కష్ట పడి ఉంటారో ఊహించగలం.
ఈ చిత్రం ద్వారా ఇతడు 20వేల డాలర్లు పారితోషికం పొందారు.
దాన్ని పెట్టుబడిగా మరో ఇద్దరు భాగస్వాములుగా ఫల్గుణాఫిలింస్ బ్యానర్ పై జగత్ కిలాడీలు(1969) నిర్మించి.. ఆవిజయంతోనే…జగత్ జెట్టీలు & జగత్ జెంత్రీలు తీశారు.
* * *
స్వంతంగా ప్రతాప్_ఆర్ట్_ప్రొడక్షన్స్_స్థాపించి…దాసరినారాయణరావును డైరెక్టర్ గా
పరిచయం చేస్తూ తాత మనవడు తీశారు.
చక్కటి అభిరుచి ఉండేది రాఘవ గారికి. దాసరి నారాయణ రావు కు పూర్తి స్వేఛ్ఛ నిచ్చారు. అందుకే తాత -మనవడు అంత అద్భుతంగా వచ్చింది.
ఇప్పుడంటే సలార్ పుష్పల ట్రెండ్ నడుస్తోంది గానీ. ఒకప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్… జనాల గుండెల్ని పిండేసేది.
వేయని నాటక రంగం పైనా… రాయని నాటకమాడుతున్నాము.
నాటకమే ఒక జీవితమా? జీవితమే ఒక నాటకమా?
ఈ ప్రశ్నకి బదులేదీ? ఈ సృష్టికి మొదలేదీ?
రాఘవ గారు నిర్మించిన తూర్పు -పడమర లోని ఈ గీతం ఆయన మనసుకి నచ్చిన గీతం.
అలాగే అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం కూడా.
కానివారి ముచ్చటకై.. కలవరించు మూఢునికీ
కన్నవారి కడుపుకోత.. ఎన్నడైనా తెలిసేనా
తారాజువ్వల వెలుగుల తలతిరిగిన వున్మాదికీ
చితిమంటల చిటపటలు వినిపించేనా? . . చితిమంటల చిటపటలు వినిపించేనా?
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం.
సగటు బ్రతుకుల్లో ఉన్న డొల్లతనాన్ని…బంధాలు అనుబంధాలు డబ్బు చుట్టూ ఎలా రంగుల రాట్నం లా తిరుగుతున్నాయో నగ్నంగా నిలదీసిన గీతం సినారె విరచితం.
ఆ అద్భుతాన్ని అందుకుని ఆస్వాదిస్తున్నామంటే కారణం… ఆ మూవీ నిర్మాత – దర్శకుల ఉత్తమ అభిరుచే కారణం. అఖండ విజయం తో దూసుకుపోయారు.
* * *
సంసారం -సాగరం,
తూర్పు -పడమర,
ఇంట్లో రామయ్య -వీధిలో కృష్ణయ్య,
తరంగిణి,
సూర్యచంద్రులు,
చదువు -సంస్కారం,
అంతులేని వింత కథ,
త్రివేణి సంగమం,
ఈ ప్రశ్నకు బదులేది?
యుగ కర్తలు
అంకితం…. సినిమాలు తీశారు.
కోడి రామకృష్ణను, రచయిత రాజశ్రీని, గుహనాథన్, కె.ఆదిత్య, కొమ్మినేని కృష్ణమూర్తి లను పరిచయం చేసిన ఘనత రాఘవ గారిదే.
సౌమ్యుడు గా…చక్కటి అభిరుచి కలిగిన నిర్మాతగా కె.రాఘవ గారిని చెప్పుకునేవారు అప్పట్లో.
రాఘవ పాండిచ్చేరికి చెందిన నిర్మాత ఎం. కె. రాధా చెల్లెలు హంసారాణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రశాంతి అనే కూతురు, ప్రతాప్మోహన్ అనే కుమారుడు ఉన్నారు. ఈయన 2018, జూలై 31వ తేదీ తెల్లవారు ఝామున హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 104వ యేట గుండెపోటుతో మరణించారు.
2009లో వీరిని రఘుపతి వెంకయ్య అవార్డు తో సత్కరించారు.
కె రాఘవ గారి జయంతి.(9 -12-1913.) స్మృత్యంజలి.
– డాక్టర్. కె.వి.ఎస్. ప్రసాద్