– దీనిని బీజేపీ వ్యతిరేకిస్తోంది
– మజ్లిస్ మెప్పు కోసం కాంగ్రెస్ పాట్లు
– ఇది మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చే కుట్ర
– హైదరాబాద్ ప్రజలు ఈ రాజకీయ కుట్రను తిప్పికొట్టాలి
– రైతుల భూములను పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ల్యాండ్‌గా కన్వర్ట్ చేయాలనుకోవడం అన్యాయం
– మీడియాతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, కీలక గ్రామ పంచాయతీలను జోడించి జిహెచ్ఎంసీని విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం దాదాపు 2,000 చదరపు కిలోమీటర్లకు పెరిగి, మొత్తం 300 వార్డులుగా పునర్విభజన జరుగుతుంది.
భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయాన్ని గతంలోనూ, ఇప్పటికీ స్పష్టంగా వ్యతిరేకిస్తోంది. ఈ విస్తరణ వెనుక నిజమైన ఉద్దేశం ప్రజా ప్రయోజనం కాదు-రాజకీయ స్వలాభం, మజ్లిస్ పార్టీకి ప్రత్యేక ప్రయోజనం కల్పించడం కోసమేనని తెలుస్తోంది. 69 లక్షల ఓటర్లు ఉన్న జీహెచ్ఎంసీని అకస్మాత్తుగా కోటి 69 లక్షల జనాభా స్థాయికి తీసుకువచ్చి, హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద నగరంగా మార్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తోంది.
కానీ నిజానికి-ఇప్పటికే జీహెచ్ఎంసీలోని అనేక వార్డుల్లో రోడ్లు సరిగా లేవు. సీవరేజ్ సిస్టమ్ లేదు. మౌలిక వసతులు సరిగ్గాలేవు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకముందే, విస్తరణ పేరిట మరిన్ని ప్రాంతాలను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం అన్యాయం.
ఇంతటితో ఆగకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ల్యాండ్‌గా కన్వర్ట్ చేయాలనుకోవడం మరో పెద్ద అన్యాయం. దీనిపై బిజెపి ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజల అభిప్రాయాలు వినాలని, హియరింగ్స్ నిర్వహించాలని, పబ్లిక్ డొమైన్లో పూర్తి వివరాలు ఉంచాలని డిమాండ్ చేశాం.
కొత్త జిహెచ్ఎంసీ విస్తరణలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై పన్నులు పెరుగుతాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా, విద్యుత్ వంటి అవసరమైన మౌలిక సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. అంతేకాదు.. సామాన్య రైతుల భూములు ఇండస్ట్రియల్ ల్యాండ్‌గా మారే ప్రమాదం ఉంది. హైదరాబాద్ ఒక గొప్ప నగరంగా ఎదగడం అనేది గర్వకారణంగా భావిస్తాం. కానీ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా, ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించకుండా, పబ్లిక్ డొమైన్లో వివరాలు షేర్ చేయకుండా ప్రభుత్వం ఈ జీహెచ్ఎంసీ విస్తరణ నిర్ణయం తీసుకోవడం పూర్తిగా తప్పుడు పద్ధతి.
కొత్తగా ప్రతిపాదించిన 300 వార్డుల విభజనలో స్పష్టంగా రాజకీయ ప్రయోజనం దాగి ఉంది. విస్తరణను మూడు భాగాలుగా చేస్తూ.. ప్రత్యేకంగా మజ్లిస్ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వచ్చేలా లైనప్ చేస్తూ.. రాజకీయ ప్రయోజనం కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కొత్తగా జిహెచ్ఎంసీలో చేర్చబడే ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నులతో పోలిస్తే దాదాపు రెట్టింపు మేరకు పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. రోడ్లు, నీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు సరిపోకపోయినా పన్నులు మాత్రం నగర స్థాయిలో చెల్లించే పరిస్థితికి తీసుకెళ్లడం అన్యాయం. గతంలో ముఖ్యమంత్రి డల్లాస్ కు వెళ్లి పెట్టుబుడులు తీసుకొస్తామని చెప్పారు. డల్లాస్ నుంచి పెట్టుబడులు రాలేదు కానీ.. ఇక్కడి ప్రజలను ఇబ్బందిపెడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి మున్సిపాలిటీల వరకు మొత్తం టాక్స్ స్ట్రక్చర్‌ను మార్చుతూ, ప్రజలపై భారాన్ని భారీగా పెంచడం, పారదర్శకత లేకుండా నిర్ణయాలను తీసుకోవడం- ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సందర్భంగా.. హైదరాబాద్ ప్రజలకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం..
కొత్తగా జిహెచ్ఎంసీలో చేర్చబడుతున్న ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరూ వారం రోజుల్లో తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ విస్తరణ-సాధారణ విస్తరణ కాదు. ఇది ప్రత్యేకంగా మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చే కుట్ర. హైదరాబాద్ ప్రజలు ఈ రాజకీయ కుట్రను తిప్పికొట్టాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మజ్లిస్ కు రాజకీయ లబ్ధి చేకూర్చే మాదిరిగానే నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు అదే దారిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. మజ్లిస్ పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తు బలపడేందుకు మాత్రమే తీసుకున్న నిర్ణయమిది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభల్లో మైబీ ముస్లిం అంటూ చేసిన వ్యాఖ్యల సంగతి అందరికీ తెలుసు. హైదరాబాద్‌ను మజ్లిస్ పార్టీ ఆధీనంలోకి నెట్టడం అన్యాయం. ఇది హిందూ–ముస్లిం సమస్య కాదు. ఇది పూర్తిగా అభివృద్ధి వర్సెస్ అవినీతి-లోపభూయిష్ట పాలన మధ్య జరిగే పోరాటం. అందుకే నగర ప్రజలందరూ అభివృద్ధిని అడ్డుకునే శక్తులకు వ్యతిరేకంగా నిలబడాలి. అందుకే దీనిపై ప్రజలందరూ తప్పనిసరిగా అభ్యంతరాలు వ్యక్తం చేయాలి.
మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్” పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ చెబుతారు.. దేశం ఎదగాలంటే, రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని. ఆ ఆలోచనతో బిజెపి నుంచి కేంద్రమంత్రులు కూడా ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5,50,000 కోట్ల పెట్టుబడులపై తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. ఇందులో కంపెనీలను పరిశీలిస్తే డొల్ల కంపెనీలు కనపడుతున్నాయి.
సర్కార్ వెల్లడించిన కంపెనీల జాబితా పరిశీలిస్తే- వాటిలో చాలా సంస్థలకు దేశవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు లేదు. కొన్ని గతంలోనే బ్లాక్‌లిస్ట్ చేయబడిన కంపెనీలు. మరికొన్ని సంస్థలు తమకు ఉన్న మూలధనాన్ని కూడా సమర్థించుకోలేని స్థితిలో ఉన్నాయి. ఇలాంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, Telangana Global Summit ను అతిశయోక్తిగా చూపించడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య తప్ప మరొకటి కాదు.
ఇంత భారీ సమ్మిట్ నిర్వహించి కూడా వాస్తవంగా ఎంత పెట్టుబడి వచ్చింది? ఏ కంపెనీ నిజంగా ఎంత ఇన్వెస్ట్ చేస్తోంది? ఆయా కంపెనీల చరిత్రను బయటపెట్టాలి. వీటిపట్ల ప్రభుత్వం నుంచి ఒక్క సరైన సమాధానం ఇవ్వడం లేదు. పారదర్శకత పూర్తిగా గల్లంతైంది.కాబట్టి, తెలంగాణ ప్రజలను మోసపర్చడానికి ప్రయత్నించవద్దు. ఎన్ని కంపెనీలతో అసలు ఒప్పందాలు జరిగాయి, వాటి విలువ ఎంత, అవి నమ్మదగిన సంస్థలేనా.. కాదా..? అనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి.
గ్లోబల్ సమ్మిట్ అని పేరు పెట్టడం కాదు.. పెట్టుబడులు రావాలి. ప్రచార కార్యక్రమాలు కాదు-ప్రజలకు ప్రయోజనం చేకూరే నిజమైన అభివృద్ధి జరగాలి. మన విద్యార్థులకు, యువతకు ఉద్యోగాలు రావాలంటే నిజమైన కంపెనీలు, నమ్మదగిన పెట్టుబడులు అవసరం. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటి? ఎక్కడో ఉన్న డొల్ల కంపెనీలతో, తనవాళ్లతో, బంధువులతో కలిసి ఒప్పందాలు కుదుర్చుకుని రూ. 5.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
భారతీయ జనతా పార్టీకి రాజకీయాలు ముఖ్యం కాదు- ప్రజల అభివృద్ధి ముఖ్యం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ పాజిటివ్ పాలిటిక్స్, ప్రగతిని తీసుకొచ్చే రాజకీయాలు మీదే నిలుస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం… కమ్యూనల్, ప్రజలను విభజించే రాజకీయాలు చేస్తూ, అభివృద్ధి నుండి దృష్టి మళ్లిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గ్లోబల్ సమ్మిట్‌లో పేర్లు చెప్పిన కంపెనీల పూర్తివివరాలు పారదర్శకంగా బయటపెట్టాలి. ఆ కంపెనీల చరిత్ర ఏమిటి? వాటి మూలధనం ఎంత? అవి బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న సంస్థలా? ప్రజల ముందు నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాం.
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే పెద్ద నగరమని చెబుతున్నారు… కానీ ఇటువంటి నకిలీ కంపెనీలతో ఒప్పందాలు చేస్తే హైదరాబాద్ ప్రపంచంలోనే పెద్ద మోసానికి గురైన నగరం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన గురించి మాట్లాడటం చూస్తుంటే.. ఆ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బట్టబయలవుతోంది. గతంలోనే జవహర్లాల్ నెహ్రూ గారు స్వయంగా పార్లమెంట్లో కులగణనకి వ్యతిరేకమని స్పష్టంగా చెప్పిన విషయం రికార్డుల్లో ఉంది.
1931 లో బ్రిటీష్ ప్రభుత్వం చేసిన కులగణన తర్వాత.. స్వాతంత్ర్య భారతంలో దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన కొనసాగింది. ఆకాలంలో… ఒక్కరోజు కూడా కులగణన అవసరం గురించి కాంగ్రెస్ ఆలోచించలేదు. 1980లో మండల్ కమిషన్‌ను కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. సామాజిక న్యాయం, సమానత్వం, వెనుకబడిన వర్గాల డేటా గురించి నిజంగా శ్రద్ధ ఉంటే.. అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు?
మన్మోహన్ సింగ్ కూడా సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి-చివరికి దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు పంపి ఫైల్‌ను నిలిపేశారు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేసిన సర్వే రిపోర్టును ప్రజల ముందు ఉంచలేదు. 2026 నుంచి దేశంలో కులగణన జరుగుతోంది అంటే… అందుకు ఒక్కటే కారణం ప్రధాని నరేంద్ర మోదీ గారి చిత్తశుద్ధి, సంకల్పం. కాంగ్రెస్ లాంటి పార్టీలు సమాజాన్ని విడగొట్టే రాజకీయాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే కాంగ్రెస్ మాటలను ప్రజలు వినరు.
1931 తర్వాత దేశంలో కులగణన పూర్తిగా ఆగిపోయింది. అప్పటి నుంచి దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలించింది-కానీ ఒక్కరోజైనా ఆ దిశగా అడుగు వేయలేదు. కానీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాజ్యాంగబద్ధంగా కులగణన చేస్తామని పారదర్శకంగా ప్రకటించారు. దాంతో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అనేక వివరాలు తెలుసుకునే అవకాశం వస్తుంది. ఏ వర్గానికి పథకాలు నిజంగా చేరుతున్నాయి? ఇంకా ఎవరికి మద్దతు లభించాలి? ఎంతమంది వెనుకబడిన వర్గాలకు ఇంకా సహాయం అవసరమవుతోంది? సమాజానికి నేరుగా ఉపయోగపడే, వాస్తవ పరిస్థితులు బయటపడే కులగణన ఇది.
మోదీ ప్రభుత్వం చేస్తున్న కులగణన- సామాజిక-ఆర్థిక పురోగతికోసం. కానీ కాంగ్రెస్ పార్టీ కులగణన అంటే… సామాజిక న్యాయం కాదు – పూర్తిగా రాజకీయ లాభం కోసం మాత్రమే. “గ్లోబల్ సమిట్” పేరుతో గోబెల్స్ స్టైల్లో ప్రచారం చేశారు… ఇప్పుడు మళ్లీ ఇదే గోబెల్స్ ప్రచారం కులగణన మీద చేస్తున్నారు.
జిహెచ్ఎంసీ విస్తరణపై కూడా కాంగ్రెస్ గొప్పలకు పోయి ప్రచారం చేసుకోవడం.. కేవలం పబ్లిసిటీ కోసం నిర్ణయాలేనని ప్రజలకు అర్థమవుతోంది. కాంగ్రెస్ అంటే విభజన రాజకీయాలు, కాంగ్రెస్ అంటే కమిషన్స్, కాంగ్రెస్ అంటే కాంట్రాక్ట్స్ అన్న భావన ప్రజల్లో కలిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా, ప్రజలకు నిజమైన న్యాయం జరిగేలా పాలన చేయాలి. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం తగదని హెచ్చరిస్తున్నాం.
మీడియా సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతం రావు గారు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి , బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్, తదితరులు పాల్గొన్నారు.