55 ఏళ్ళ వయస్సున్న అనసూయమ్మకు హార్ట్ ఎటాక్ వచ్చి ICU లో చేరింది. పెద్ద పేరున్న డాక్టరు గారు వచ్చి ఆపరేషన్ మొదలు పెట్టారు.. చావు దాకా వెళ్ళింది. ఈ లోగా దేవుడు కనబడ్డాడు..
టి.వి. సీరియల్లో నటిలా ఘొల్లున ఏడ్చి, “నాకు అప్పుడే నూరేళ్ళు నిండాయా స్వామీ..!” అని అడిగింది..
“కంగారు పడకు నీకింకా ఇరవై ఏళ్ళ ఆయుష్షు ఉంది” అన్నాడు..
ఆపరేషన్ సక్సెస్ అయ్యి కోలుకున్నాక, ఇంటికి వెళ్ళేముందు, అదే హాస్పిటల్లో ఉన్న కాస్మొటిక్ విభాగంలో చేరింది.. అక్కడ ఫేస్ లిఫ్ట్ (మొహం, మరియు మెడ దగ్గర ముడతలు పోయి చర్మం బిగువుగా అయ్యేలా, వయస్సు తగ్గి… యువతిలా కనిపించేలా…) చేయించుకుంది…
తరువాత “టమ్మీటక్ సర్జరీ” (పొత్తికడుపు వద్దనున్న అదనపు కొవ్వు, చర్మం తీస్తారు) చేయించుకుని ఇంటికి వెళ్తూ… మహిళా గ్యారేజ్ లో (బ్యూటీ పార్లర్) జుట్టుకు కలర్ వేయించుకుని, అనసూయమ్మ కాస్తా ‘అనసూయ’ గా మారి ఇంటికి వెళ్తూ ఉండగా లారీ గుద్ది చనిపోయింది..
అప్పుడు ఆమె భగవంతుడిని అడిగింది… “నాకు ఇంకా ఇరవై ఏళ్ళ ఆయుష్షు ఉంది అన్నావుగదా! మరి అప్పుడే చంపేసావేంటి స్వామి..!” అంది..
“నీ మేకప్ తగలెయ్యా ! నిన్ను గుర్తుపట్ట లేక పోయాను” అన్నాడు దేవుడు సంభ్రమాశ్చర్యాలతో !
-వెలిశెట్టి నారాయణరావు
విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు