హైదరాబాద్: కాలేజీలకు చెల్లించాల్సిన 10వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
పదివేల కోట్ల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17వతేదీన ఖమ్మం నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త 250 కిలోమీటర్ల మహా పాదయాత్ర శనివారం హైదరాబాద్ చేరుకుంది.ఈ సందర్భంగా రాకేష్ దత్త, ఆయన బృందాన్ని కేటీఆర్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తదితర ప్రముఖులు అభినందించారు. కేటీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం వేల కోట్లు నిధులు ఖర్చు చేసి సమ్మిట్స్,అందాల పోటీలు నిర్వహిస్తున్నది తప్ప విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మాత్రం చెల్లించడం లేదని మండిపడ్డారు.
ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, కాలేజీ యజమాన్యాలను ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తుండడం శోచనీయమన్నారు. గ్రేస్ మార్కులు కలపాలంటే యజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కోసం భూములు అమ్ముకొని ఫీజులు కడుతుంటే ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పలుమార్లు హామీ ఇచ్చిన మేరకు ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ఎంపీ వద్దిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త మాట్లాడుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్డ్ ఎక్కే విధంగా డ్రోన్లు వద్దు.. విద్యార్థులకు టాయిలెట్లు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు ఫీజులు చెల్లించలేక అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజు బకాయిల చెల్లింపునకై ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు 20 రోజులపాటు పాదయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థుల ఫీజుల బకాయిలను చెల్లించకుంటే నిరాహార దీక్షలు చేపడతామని ఎంపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పాదయాత్ర లో ఖమ్మం నుంచి రాకేష్ దత్తాతో పాటు పాల్గొన్న విద్యార్థి నాయకులు గోనె శ్రీ శ్రీ , ముదిగొండ పవన్ , వాజెడ్ల అనిల్, కల్యాణ్ నేత , పెండెం.జయంత్ యాదవ్ , విమల్ , బావని యోగేందర్, శ్రీను ,అజయ్ చౌదరి , దొంతరవేణి అరవింద్ , బద్దుల శివ , ఏ.చందు , ఏం.ఆదిత్య యాదవ్ , లావుడ్య రాహుల్ సతీష్ , సాయి యాదవ్ సతీష్ తదితరులు ఉన్నారు.