– తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్డీఏ కైవసం
– తొలి మహిళా డీజీపీ అయిన ఆర్. శ్రీలేఖ
– ఖంగుతిన్న కమ్యూనిస్టు కూటమి విజయం
తిరువనంతపురం: దాదాపు నాలుగు దశాబ్దాలుగా లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (LDF) కంచుకోటగా ఉన్న తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) గెలుచుకోవడం ఒక చారిత్రక ఘట్టం. కేరళలో బీజేపీ ఒక కార్పొరేషన్‌ను గెలవడం ఇదే మొదటిసారి.
రాష్ట్రంలో పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది. 30 ఏళ్లుగా ఒకే కూటమి పాలనలో ఉన్న కార్పొరేషన్‌పై ఈ వ్యతిరేకత ప్రభావం ఎక్కువగా ఉంది. తొలి మహిళా డీజీపీ అయిన ఆర్. శ్రీలేఖ వంటి ప్రజాదరణ ఉన్న, ప్రభావవంతమైన వ్యక్తులను అభ్యర్థులుగా నిలబెట్టింది. శ్రీలేఖ విజయం కూడా బీజేపీకి బలాన్నిచ్చింది.
బీజేపీ తమ సంస్థాగత నిర్మాణాన్ని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో, బలోపేతం చేసింది. గతంలో 6 సీట్లతో మొదలుపెట్టి, 2015/2020లో 35 సీట్లకు చేరుకుని, ఈసారి విజయం సాధించడానికి వారి నిరంతర కృషి దోహదపడింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (UDF) బలంగా లేకపోవడం బీజేపీకి బాగా కలిసి వచ్చింది. 2010లో 41 సీట్లు గెలిచిన యూడీఎఫ్, 2020లో కేవలం 10 సీట్లకే పడిపోయింది. యూడీఎఫ్ ఓట్లు చీలిపోవడం బీజేపీకి లాభించింది. ఇది ప్రధానంగా త్రిభుజాకార పోరు (LDF vs. UDF vs. NDA) లో బీజేపీకి అనుకూలించింది.
తిరువనంతపురం వంటి రాజధాని నగరంలో, అభివృద్ధి, అవినీతి లేని పాలన వంటి అంశాలపై బీజేపీ దృష్టి సారించింది. AI ఆధారిత అవినీతి రహిత పాలన వంటి అంశాలతో కూడిన మేనిఫెస్టో పట్టణ ఓటర్లను ఆకట్టుకుంది.
గత మేయర్ ఆర్య రాజేంద్రన్‌పై స్థానికంగా కొన్ని విమర్శలు ఉన్నాయి. పాలనలో ఆమె నిర్లక్ష్యం, స్థానిక సమస్యలను పట్టించుకోకపోవడం వంటి అంశాలు కూడా ఎల్డీఎఫ్కు వ్యతిరేకంగా మారాయి.
తిరువనంతపురం నుండి నేర్చుకుంటే పార్లమెంటులో ఈవీఎం కథలు వినిపించే బదులు.. గ్రౌండ్ లో పనిచేయాలి అని అర్థం అవుతుంది. బీహార్ నుండి పులివెందుల వరకు ఓటమి జీర్ణించుకోలేక ఆత్మ వంచన చేసుకుంటే ఆ పార్టీ జెండాలు డెమోక్రసీ మ్యూజియంలో భద్రపరచాల్సి వస్తుంది.