– మధ్య ప్రదేశ్ లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు ఎలా సాధ్యమైందో రేవంత్ రెడ్డి, మంత్రులు తెలుసుకోవాలి
– తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సమయాన రాహుల్ గాంధీ అబద్ధం
– కుల గణన పూర్తిగా ఆశాస్త్రీయం
– విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు పొన్నాల, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు డాక్టర్ దాసోజు, రమణ తో కలిసి ఎంపీ వద్దిరాజు
హైదరాబాద్: బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా బహుజనుల పక్షపాత పార్టీ అని, తెలంగాణలో ఏస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలు మొత్తం జనాభాలో 90 శాతానికి పైగా ఉంటారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టడమే కాక తన పదేళ్ల పాలనలో అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేశారన్నారు.
కేసీఆర్ సుపరిపాలనలో బీసీలకు సముచిత గౌరవం దక్కిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని విధాలా అన్యాయానికి గురవుతున్నామని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య,వీ.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్,ఏల్.రమణ తదితర ప్రముఖులతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ నాయకులు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు.ఎన్నికలకు ముందు,ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత రాహూల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు రిజర్వేషన్స్ పెంపుదల పేరిట చేసిన దగా, నయవంచనను పార్లమెంట్ వేదికగా ఎండగడ్తామన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలంటూ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టినట్లు ఎంపీ వద్దిరాజు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుందని, ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్స్ పెంచకుండా కాలయాపన చేస్తూ మోసం చేస్తూనే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ విధంగా పాలకులు బీసీలను అవమానానికి గురి చేస్తున్నారని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద ధర్నా పేరుతో డ్రామా ఆడి మార్కెటింగ్ చేసుకున్నారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్ట బద్ధత లభించదని,అమలు సాధ్యం కాదని తేల్చి చెప్పిన విషయాన్ని ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు. అప్పుడే అర్ధమైంది కాంగ్రెస్ పార్టీ బీసీలను దగా చేస్తున్నదని, నయవంచనకు పాల్పడుతున్నదని అర్థమైంద న్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని జీవో తెచ్చి మరో మోసానికి తెరలేపడం శోచనీయమన్నారు.
మంత్రి పదవుల విషయంలో బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేటీఆర్, హరీష్ రావులు అనేక సార్లు డిమాండ్ చేయడంతో శ్రీహరి, అజారుద్దీన్ లను రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి తీసుకున్నారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో కలత చెందిన సాయి ఈశ్వరా చారి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఎంపీ రవిచంద్ర అన్నారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగా నాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, బీసీల విషయంలో నేడు అదే పార్టీ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగించిందని, ఆదివారం, 17వతేదీన జరిగే ఎన్నికల్లో కూడా తమ పార్టీ సర్పంచులు పెద్ద సంఖ్యలో గెల్వడం తథ్యమని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.
కుల గణన పూర్తిగా ఆశాస్త్రీయం అని,ఈ సందర్భంగా బీసీల జన సంఖ్యను సుమారు 45 లక్షలు తక్కువ చేసి చూపించారని ఆయన పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్ లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు ఎలా సాధ్యమైందో రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రభాకర్, శ్రీహరిలు తెలుసుకోవాలని ఎంపీ రవిచంద్ర సూచించారు.
తెలంగాణలో బీసీలు చాలా ఆగ్రహంతో ఉన్నారని,14,17వతేదీలలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిసిన్నప్పుడు బీసీలకు ఇచ్చిన హామీ గురించి చెప్పి పార్లమెంటులో బిల్లు ఎందుకు పెట్టించడం లేదని ఆయన నిలదీశారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సమయాన రాహుల్ గాంధీ చేత రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పించడం విచారకరమన్నారు.