– ఇది వైయస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 80 శాతం
– సంపద సృష్టి అంటే ఇదేనా ?
– మీరు సంపద సృష్టికర్త కాదు.. రుణ సృష్టికర్త
– నాడు జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గోబెల్స్ ప్రచారం
– నేడు సగటున రోజుకూ రూ.500 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు
– జగన్ అప్పు చేస్తే రాష్ట్రం దివాళా
– నేడు బాబు చేసిన అప్పుతో రాష్ట్రం స్వర్గం అవుతుందా?
– నాడు తప్పైంది, మీ హయాంలో ఒప్పైందా?
– కాకినాడ లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ: 18 నెలల్లో రూ. 2.66 లక్షల కోట్లు అప్పు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చుతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైయస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 80 శాతమని తేల్చి చెప్పిన ఆయన… సంపద సృష్టి అంటే ఇదేనా? అని నిలదీశారు. చంద్రబాబు సంపద సృష్టికర్త కాదని రుణ సృష్టికర్త అని చెప్పారు.
కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నాడు వైయస్.జగన్ పాలనలో అప్పులపై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గోబెల్స్ ప్రచారం చేశారని.. నేడు చంద్రబాబు పాలనలో సగటున రోజుకూ రూ.500 కోట్లు అప్పు చేస్తుంటే.. రాష్ట్రం దివాళా తీయడం లేదా అని నిలదీశారు. చంద్రబాబు చేసిన అప్పుతో రాష్ట్రం స్వర్గం అవుతుందా? అని ప్రశ్నించారు. ఎక్సైజ్ బాండ్లతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ద్వారా రూ.5490 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం… భవిష్యత్తు ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
నాడు వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీబీసీఎల్ ద్వారా అప్పు చేస్తే… గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు, కోర్టు కేసులు, కేంద్రానికి ఫిర్యాదులు చేశారని.. నాడు తప్పైంది, మీ హయాంలో ఎలా ఒప్పైందని ప్రశ్నించారు. రోడ్ల మీద గోతులు పూడ్చలేని అసమర్థ ప్రభుత్వం.. గ్రోత్ ఇంజన్లు, కారిడార్లు అంటూ అడ్డగోలు ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వ ప్రచార గాధలను ప్రజలు విశ్వసించే రోజులు పోయాయని తేల్చి చెప్పారు.
వైయస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం అప్పులు చేస్తే.. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంది, భవిష్యత్తు నాశనం అయిపోతుందని గగ్గోలు పెడుతూ, గోబెల్స్ తరహాలో ప్రచారం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ… ఎకనమిస్టులు పేరుతో ఎవరెవరినో తీసుకొచ్చి తన అనుకూల మీడియా ద్వారా విపరీతమై దుష్ప్రచారం చేయించారు. వైయస్.జగన్ ప్రభుత్వం లక్షలాది కోట్లు అప్పుచేసినట్లు, రాష్ట్రాన్ని ముంచేసినట్లు ప్రచారం చేశారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారంటూ పెద్ద పెద్ద ప్రకటలిచ్చేవారు.
● చంద్రబాబు అప్పులు రాష్ట్రానికి వరమా?
ఇవాళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయ్యేసరికి ఇప్పటివరకూ రూ.2,66,175 కోట్లు అప్పు చేశారు. సగటున ప్రతి రోజూ రూ.500 కోట్లు అప్పు చేశారు. ఇది ఆయన సీనియారిటీ, పరిపాలన దక్షత, గొప్పదనం. గతంలో వైయస్.జగన్ ప్రభుత్వంలో అప్పులు చేస్తే.. అప్పుడు శాపం, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న అప్పులు రాష్ట్రానికి వరం. వాళ్ల మీడియా ద్వారా బాకాలూదుకుంటున్న వైనం. వైయస్.జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్లు కోవిడ్ వల్ల తీవ్ర ఇబ్బందిపడిన పరిస్ధితులు చూశాం. ప్రపంచంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు చూశాం. అయినా కూడా పేదలకిస్తానన్న పథకాలు ఆగలేదు, వైద్యపరంగా అందించాల్సిన సేవలూ ఆగలేదు. ఇన్ని చేస్తూ కూడా డిబీటీ ద్వారా అందిస్తున్న ఏ పథకమూ ఆగలేదు. అందులో భాగంగా రాష్ట్ర ఆర్దిక పరిస్థితికి మద్ధతుగా అప్పు చేస్తే.. ఆ రోజు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా అని మాట్లాడారు.
● కూటమి నేతల అడ్డగోలు ప్రచారం…
ఇవాళ చంద్రబాబు 18 నెలల కాలంలో చేస్తున్న అప్పులతో ఏం చెప్పాలి? మీ గోబెల్స్ ప్రచారానికి ఏ పేరు పెట్టాలి. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు చూస్తే.. ఏప్రిల్ 5,2022న రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబు గారు స్టేట్ మెంట్. అదే ఏడాది ఏప్రిల్ 13న రాష్ట్రాన్ని శ్రీలంకగా ప్రకటిస్తారేమో అని మరో స్టేట్ మెంట్. మేల్కోకపోతే మనకూ శ్రీలంక గతే? అంటూ ఈనాడులో కధనాలు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉందంటూ 2022 మే 17న పవన్ కళ్యాణ్ ట్వీట్, శ్రీలంక కంటే రాష్ట్రం అప్పులు నాలుగు రెట్లు ఎక్కువ అంటూ ప్రస్తుతం ఆర్ధికమంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గతంలో ఇచ్చిన స్టేట్ మెంట్. అప్పులతో ఆంధ్రాపేరు మార్మోగిస్తున్నందుకు వైయస్.జగన్ ను అప్పురత్న అని పేరుపెట్టాలంటూ.. 2023లో పవన్ కళ్యాణ్ ట్వీట్. అక్టోబరు 25, 2023 నాడు రాష్ట్ర రుణం రూ.11 లక్షలు అంటూ అప్పటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి రాగం. మరలా ఏప్రిల్ 2024లో రూ.12 లక్షల కోట్లు అప్పుఅంటూ మరో స్టేట్ మెంట్ ఇస్తూ.. చెప్పిన అబద్దాలు చెప్పకుండా పచ్చి అబద్దాలను ప్రజల మనస్సుల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు.
తాను సంపద సృష్టికర్తని చెప్పుకుంటున్న చంద్రబాబు సీనియారిటీ ఏమైందో తెలియడం లేదు? చేసిన అప్పు పధకాల పేరిట ప్రజల అకౌంట్లలో వేసిందీ లేదు. ఇంకా అమరావతి పేరిట తుప్పలు కొడుతున్నారు, నీళ్లు తోడుతూనే ఉన్నారు. మళ్లీ అమరావతి కోసం ప్రత్యేకమైన అప్పులు చేస్తున్నారు.
● ఎక్సైజ్ బాండ్లు ద్వారా అప్పు రాజ్యంగ విరుద్దం కాదా?
చంద్రబాబు ప్రభుత్వం రూ.5490 కోట్లు ఎక్సైజ్ బాండ్ల రూపంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ద్వారా సేకరిస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ అప్పు తీసుకొస్తున్నారు. దీనికి వడ్డీ రేటు 9.25 శాతం అంటే 77 పైసలు. మనం లోన్ తీసుకుంటే 6-8 శాతం వడ్డీకి ఇస్తే.. చంద్రబాబుకున్న పరపతికి 9.25 శాతం వడ్డీకి తెస్తున్నారు. ఇదే తరహాలో గతంలో వైయస్.జగన్ ప్రభుత్వంలో ఏబీబీసీయల్ ద్వారా అప్పుకోసం ప్రయత్నాలు జరిగితే … మహాపరాధం జరిగినట్లు, చాలా దుర్మార్గం చేస్తున్నట్లు కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు కోర్టులో కూడా కేసులు వేశారు.
ఇవాళ అదే చంద్రబాబు ప్రభుత్వం ఎఫ్ ఆర్ ఎం బీ నిబంధనలకు విరుద్దంగా అప్పు కోసం ఎలా ప్రయత్నం చేస్తోంది. ఆ రోజు వైయస్.జగన్ చేసింది తప్పైతే, చంద్రబాబు చేసింది ఒప్పెలా అవుతుంది? ఏ రకమైన న్యాయం ఇది? ఇలా అప్పు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని రాశారు. ఇవాళ ఇది ఏ రాజ్యాంగంలో రాసి ఉంది. 2019-24 మధ్యలో కూడా వైయస్.జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రాజ్యాంగం ఉందా? మారిందా? చంద్రబాబు పరిపానలో అదే రాజ్యాంగం నడుస్తుందా? కొత్త రాజ్యాంగం వచ్చిందా? మీకు పచ్చిఅబద్దాలు, ఆరోపణలు ప్రచారం చేసుకునే నైపుణ్యం ఉంది కాబట్టి… ఆ నాటి ప్రభుత్వం మీద అబద్దాలు వల్లెవేసి, ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.
● చంద్రబాబు పాలనలో సౌత్ సూడాన్ లో రాష్ట్రం…
మా హయాంలో అప్పులు చేసినప్పుడు శ్రీలంక అన్న రాష్ట్రం ఇవాళ అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్న మీ పాలనలో ఏ లంక అయింది? అందమైన పూలు, పళ్లుతో ఉన్న కడియపులంకలా కనిపిస్తోందా? ఆంధ్రప్రదేశలో చంద్రబాబు చేస్తున్న అప్పులు చూసి… రాష్ట్రం పరిస్థితి సౌత్ సూడాన్ లా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైయస్.జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మడం తప్ప.. మరో కార్యక్రమం లేదు. చివరికి కాగ్ రిపోర్టునూ వక్రీకరించారు.భయట ఎన్ని వక్రీకరణలు చేసినా, ఎన్ని అబద్దాలు చెప్పినా చివరకు అసెంబ్లీ సాక్షిగా ఎన్ని కోట్లు అప్పు చేశారన్నది నిజం చెప్పాల్సి వచ్చింది.
వైయస్.జగన్ ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులో 80 శాతం అప్పును కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల కాలంలోనే చేసింది. ఈ అప్పు ఏమైంది? ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? అమరావతి కట్టారా? మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీల కోసం మహిళలకు, ఇతర వర్గాల వారికి అకౌంట్ లో వేశారా? మీ ఎల్లో పత్రికల్లో నూ ఇటీవల వార్తలు చూశాను. పోటెత్తుతున్న లోటు, ప్రమాదంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, వైయస్సార్సీపీ హాయంలో రెవెన్యూలోటు ప్రమాదకరంగా ఉంది, కూటమి ప్రభుత్వంలో అంతకంటే ప్రమాదకంగా మారిందని రాశారు.
మీ హయాంలో రెవెన్యూ లోటు మొదటి ఆరు నెలల్లో 140 శాతం ఎలా వచ్చింది? అంటే మీ అంచనాలు అబద్దాలు, మీ బడ్జెట్ కూడా అబద్దాలే కదా? మీరు ఆదాయం రూ.100 వస్తుందని చూపించారు, ఖర్చు రూ.25 అని చూపిస్తే అది కాస్తా తిరగబడింది… ఆదాయం రూ.100కు బదులు రూ.34 వచ్చింది. ఇవాళ మీరు టార్గెట్ లు పెట్టి, పర్మిట్ రూమ్ లు ఏర్పాటు చేసి, డోర్ డెలివరీ చేస్తూ.. ఇంటింటికీ లిక్కర్ అమ్మిస్తున్నారు.
ఆ రోజు ప్రజలు మీరు చెప్పింది నిజమేనేమో అనుకున్నారు. మీరు సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అనుకున్నారు. కానీ వాస్తవంలో జరుగుతున్నదేంటి? మీరు అప్పు చేస్తేనేమో అది సంపద అవుతుందా? వైయస్.జగన్ చేస్తే అది అప్పు రాష్ట్రాన్ని నాశనం చేస్తుందా? ఇది ఏ రకంగా సాధ్యం? చంద్రబాబు చేసిన అప్పు తీర్చక్కరలేదా? రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదా? కోవిడ్ వంటి కష్టకాలాన్ని కూడా వైయస్.జగన్ ప్రభుత్వం ఒంటి చేత్తో ఎదుర్కొంది.
● చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు- గోబెల్స్ ప్రచారం..
చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని కేవలం ప్రచారం మీద ఆధారపడి గోబెల్స్ ని మించిపోయి ప్రచారం చేశారు. ఒక అబద్దాన్ని పదే పదే చూపిస్తూ దాన్నే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు చేస్తున్న ఈ అప్పులకు ఏం సమాధానం చెప్తారు? పరిమితికి మించి అప్పులు చేసే అధికారం మీకు ఏ చట్టం నుంచి వచ్చింది. ఆ రోజు మేం పరిమితికి మించి అప్పు చేయకపోయినా మా మీద దుష్ప్రచారం చేశారు.
అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అని మొదటి నుంచి ప్రచారం చేస్తున్నారు. మరి ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి, ఏడీబీ నుంచి అప్పులు ఎందుకు తెస్తున్నారు? బ్యాండులు ఎందుకు తాకట్టు పెడుతున్నారు? రూ.5490 కోట్లు కాకుండా అమరావతి కోసం మరో రూ.7-8 వేల కోట్లు అప్పుకు సిద్ధమవుతున్నవారు. ఇచ్చేవాడు ఉంటే చాలు చంద్రబాబు ఎవరిదగ్గరైనా అప్పు తీసుకుంటాడు.
జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఇంకా 18 శాఖలకు 13వ తేదీ వచ్చినా జీతాలివ్వలేదు. గట్టిగా నిలదీస్తారని రెండు, మూడు శాఖలకు మాత్రమే జీతాలు ఇచ్చారు. పైగా వచ్చే నెల కూడా జీతాలు ఆలస్యం అవుతాయని చెబుతున్నారు. అంటే క్రిస్టమస్, సంక్రాంతి పండగల రెండు నెలలకు జీతాలు ఆలస్యమే.
● రోడ్లపై గోతులు పూడ్చమంటే గ్రోత్ కారిడార్లంటూ గొప్పలు…
ఇదికాకుండా విశాఖపట్నం నాలెడ్జ్ ఎకానమీ, ఏఐ హబ్ అని పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్స్ తో ప్రచారం చేసుకుంటున్నారు. విశాఖ గ్లోబల్ ఎకనమిక్ రీజియన్, ఎకనమిక్ రీజియనల్ లో సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు, తొమ్మిది జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం, పోర్టులు, రోడ్లు, రైలు మార్గాల నిర్మాణం, విమానాశ్రయాల అభివృద్ది,లాజిస్టిక్స్ అభివృద్ధి చేయడం ఎలా? టూరిజం అభివృద్ధి ఎలా? గ్రోత్ ఇంజన్లు, గ్రోత్ కారిడార్లు అంటూ పెద్ద ఎత్తున వార్తలు కనిపించాయి. విశాఖ ఎకనమిక్ రీజియన్ లో 2024 నాటికి 52 బిలియన్ డాలర్లు ఉన్న జీడీపీ 2032 నాటికి 125, 135 బిలియన్ డాలర్లకు వెళ్తుందని, 30 లక్షలు ఉద్యోగాలొస్తాయని చెబుతున్నారు. వీజీఆర్ మాష్టర్ ప్లాన్ అభివృద్ధి చేస్తే… 2047 నాటికి 750 నుంచి 800 మిలియన్ డాలర్లకు జీడీపీ పెరుగుతుందని చెబుతున్నారు.
మేం ముందునుంచి ఇదే విషయం చెబుతున్నాం. విశాఖపట్నం మా ఆర్దికరాజధాని, శాసనరాజధానిని అమరావతిలో ఉంచుకుని మిగిలినవి విశాఖ షిఫ్ట్ చేసి, అక్కడ అభివృద్ది చేద్దామంటే పెద్ద ఎత్తున అల్లరి చేశారు. ఇవాళ అదే చంద్రబాబూ, ఆయన తనయుడు లోకేష్ విశాఖను ఏపీ ఎకనమిక్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. మీరైతే విశాఖను పవర్ హౌస్ గా తీర్చిదిద్దుతారు, మా హయాంలో అయితే సునామీలు వంటి విపత్తులు వస్తాయి.
విశాఖ గ్రోత్ రేటు చెప్పిన మీరే.. అమరావతి గ్రోత్ రేటు గురించి కూడా చెప్పండి? రోడ్డు మీదున్న గోతులు పూడ్చడ చేతకాని ఈ ప్రభుత్వం గ్రోత్ ఇంజన్ల గురించి మాత్రం మాట్లాడుతుంది. ఎక్కడ గోతులు అక్కడే ఉంటే.. గ్రోత్ కారిడార్ల గురించి మాట్లాడుతున్నారు. గ్రోత్ కారిడార్ల గురించి తర్వాత చూడవచ్చు.. ముందు గోతులతో కూడిన కారిడార్లను బాగుచేయండి. రోడ్ల మీదకు వెళ్లి చూస్తే అర్ధం అవుతుంది. ఒకవైపు భవిష్యత్తులో వచ్చిన ఆదాయాన్ని తాకట్టు పెడుతూనే.. మరోవైపు ఆకాశమార్గాలు, భూమార్గాలు, సొరంగమార్గాలు అంటూ కథనాలు వండి వార్చి ప్రచారం చేయడం మినహా మరో కార్యక్రమం లేదు.
మా హయాంలో ఏబీబీసీఎల్ ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నంచేస్తే తప్పుపట్టిన మీకు ఇవాళ మీరు చేస్తున్న కార్యక్రమం తప్పనిపించలేదా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజ్యాంగం మారుతుందా అని ప్రశ్నించారు. మీ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి చెందిన ప్రజలైనా సంతోషంగా, సుభిక్షంగా ఉన్నారేమో చెప్పాలని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. మేం చెప్పేదొక్కటే మీరు సంపద సృష్టికర్త కాదు.. మరు రుణసృష్టికర్త అని, మీరు చెప్పే ప్రచారగాధలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు.