ఎన్నికల్లో గెలవడానికి ఏమి చేయాలి అనేది తెలుసుకోవడం అంటే…. గడ్డివామిలో సూది కోసం వెదుకులాడడం వంటిదే. అది దొరుకుతుందో… లేదో తెలియదు. 2019 ఎన్నికలకు ముందు ఓటర్లను ఒక ఎమోషనల్ ఇష్యూ కి గురి చేయడానికి అప్పటి సీయం చంద్రబాబు నాయుడు చేసిన బృహత్తర ప్రయత్నమే ఒక ఉదాహరణ. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హోదాను కేంద్రం ఇవ్వక పోవడాన్ని ఒక భావోద్వేగ అంశంగా చేయాలని చంద్రబాబు నాయుడు భారీ ప్రయత్నం చేశారు. కానీ, క్లిక్ అవ్వలేదు. చివరకు 23 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐనప్పటికీ, అధికారం లోకి రావడానికి… నాయకులకు ఈ వెదుకులాట మాత్రం తప్పనిసరి.
మౌలిక వసతులు, సదుపాయాలు ఇబ్బడి ముబ్బిడి గా కల్పించడం వల్ల, పెట్టుబడులు రప్పించడానికి రేయింబవళ్ళు కృషి చేయడం వల్ల ఓట్లు రాలతాయా? రాలవు -అని చెప్పడానికి – చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయాణమే ఓ ఉదాహరణ. 2004, 2019 ఎన్నికల్లో ఆయన ఎందుకు ఓడిపోయారు?. మరి ఉచితాలు చూసి, మురిసిపోయి… ఓటర్లు గెలిపిస్తారా? గెలిపించరు అనడానికి…. 1989 లో ఎన్టీ రామారావు, 2024 లో జగన్మోహన్ రెడ్డి, 2019 లో చంద్రబాబు నాయుడు పార్టీల ఘోర పరాజయాలే పెద్ద ఉదాహరణలు.
పన్నులు, సెస్సుల రూపం లో ప్రజల రక్త మాంసాలను ఒక పక్క పిండేస్తూ ; మరో పక్క పప్పు బెల్లాల లాగా ఓట్ల కోసం ఆ డబ్బును వెదజల్లడానికి…. ఈ డబ్బు ఎవడబ్బ సొత్తు అంటూ ఆవేదనకు లోనైన వారు వేసే వ్యతిరేక ఓటు…. గతం లో టీడీపీ ని, వైసీపీ ని ఓడించాయి.
అయినా ; రాజకీయ పార్టీలు…. అధికారం లోకి రావడానికి పదే పదే- అదే షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకుంటుంటాయి. ఎన్నికల్లో బోల్తా పడుతుంటుంటాయి.
“తోటి వాడు తొడ కోసుకుంటే…. మనం మెడ కోసుకోవాలి ” అన్న తెలుగు సామెత చందం గా…. ఏదో రాష్ట్రం లో ఏదో ఉచితం ఇస్తున్నారని… దానిని మించిన ఉచితం ఇవ్వాలనే తహతహలతో నిద్రలేని రాత్రుళ్ళు గడపడం మన పాలక వర్గాల ముఖ్యులకు అలవాటయి పోయింది.
“మా ఆఫీసర్ల ను పంపి, సంసారాలు చేయించి పెడతాం. మా లేడీ ఆఫీ సర్ల ను పంపి మీ ఇళ్లల్లో వంటలు చేయించి పెడతాం…..” వంటి హామీలు తప్ప ; దాదాపుగా అన్నీ ఉచితాలు చేసేశారు. అయినా, ఎన్నికల్లో గెలవడానికి సరిపడినన్ని ఓట్లు రాలడం లేదు.
మరి, గెలిచేది ఎలా!?
వరదల్లో పడి అన్నీ కొట్టుకు పోయినట్టుగా… భావోద్వేగ అంశాలలోకి ఓటర్లను నెట్టగలిగితే…. ఎన్నికల్లో అవే గెలుపోటములను డిసైడ్ చేస్తాయి.
అన్ని రుగ్మతలకూ జిందా తిలిస్మాత్ లోషనే మందు అని ఒక సామెత తెలంగాణ లో ఉంది.
అలా, అన్ని సమస్యలకూ జగనే పరిష్కారం అన్న భావోద్వేగానికి తెలుగు ఓటర్లు 2019 ఎన్నికలకు ఆర్నెల్లు ముందే లోనయ్యారు. ఆ భావోద్వేగమే జగన్ కు 151 సీట్లు తెచ్చిపెట్టింది. ఓటర్ల భావోద్వేగాలకు దమ్మిడీ విలువ కూడా ఇవ్వని ఫలితం గానే, 2024 ఎన్నికల్లో… ప్రధాన రాజకీయ జీవన స్రవంతి నుంచి జగన్ ను ఓటర్లు పక్కకు తప్పించారు. ప్రస్తుతం పే టీ యం జనాలతో ఆయన జనం లో తిరుగుతున్నారు.
2024 ఎన్నికల నాటికి… ఈ భావోద్వేగం కొత్త రూపం తీసుకుంది.
వైసీపీ లో అరాచకాలకు పాల్పడిన వారిని పాల్పడినట్టుగా ” తోకలు కత్తిరిస్తా “, ” వడ్డీ తో తిరిగి చెల్లిస్తా “, ” ఇదిగో రెడ్ బుక్. అందరి జాతకాలు ఇందులో ఉన్నయ్…. ఒక్కొక్కరి తాట తీస్తా…. “, “నా వ్యక్తి గత విషయాలకు వస్తే…. మీ బతుకులు బజారులో పెడతా. ఒక్కొక్కడికి అనఫసీయల్ గా ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో నాకు తెలుసు.ఇదిగో చెప్పు. ఒక్కొక్కడికి చర్మం తీస్తా…. ఏమనుకుంటున్నారో కొడకల్లారా…” వంటి వైసీపీ వ్యతిరేక ప్రకటనలు ఓటర్లను ఊపేశాయి.
జగన్ & కో ను జైళ్ళల్లో వేయించాల్సిందే అన్నది…. 2024 ఎన్నికలకు ముందు ఓటర్ల భావోద్వేగ అంశం అయింది.
అందుకే, మూకుమ్మడి గా జగన్ వ్యతిరేక శిబిరం వైపు ఓటర్లు మొగ్గారు. అనుకోకుండానే టీడీపీ కూటమి తో కనెక్ట్ అయ్యారు.
అంటే – కూటమికి ఫ్రీ గా ఓట్లు వేశారు అని కాదు, దాని అర్ధం. అటు కూటమి నుంచి, ఇటు జగన్ & కో నుంచి కూడా మొహమాటం ఏమీ లేకుండా అందినంతవరకు లాగేసి ; ఓట్లు మాత్రం కూటమి కి వేశారు. కూటమి కంటే, ఏ విషయం లో తక్కువ చేసిందని జగన్ & కో ను ఓటర్లు తిరస్కరించారు?
ఇక్కడ జగన్ & కో ను ముంచింది మాత్రం…. భావోద్వేగ ఇష్యూ అన్న మాట. తుపాను సమయాల్లో… సముద్ర అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వచ్చే భారీ తిమింగలాల్లా 164 సీట్ల తో అధికారపు తీరానికి కొట్టుకు వచ్చిన కూటమి ; – మరి, ఓటర్ల భావోద్వేగ అంశాన్ని అందుకోగలుగుతున్నదా? ఎందుకు కూటమి అభ్యర్థులను మూకుమ్మడిగా గెలిపించారో కూటమి నేతలు విశ్లేషయించుకున్నారా?
పోనీ, వచ్చే ఎన్నికల నాటికి…. ఓటర్లను తన శిబిరం లోనే ఉంచుకోగలిగిన భావోద్వేగ అంశం ఏదైనా కూటమి కి ఉన్నదా? అలాగే, వచ్చే ఎన్నికల్లో తనను అధికారం లోకి తీసుకురాగలిగిన భావోద్వేగ అంశం ఏదైనా జగన్ శిబిరానికి ఉన్నదా?
చూద్దాం. ఎవరు ఏ ఎత్తుగడలతో… ఓటర్లను ఏ ఎమోషనల్ ఇష్యూస్ కు గురి చేస్తారో!!. కానీ, ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఏదో ఒక బలమైన భావొద్వేగ అంశం లేకుండా ఎన్నికలలో గెలవడం ఇటు కూటమి కి గానీ, అటు జగన్ కు గానీ సాధ్యం కాదు .
– భోగాది వేంకట రాయుడు