– ఆయా కంపెనీలకు మరిన్ని లైసెన్సులు ఇవ్వాలి
– లోక్ సభలో సబ్కా బీమా సబ్కీ రక్ష బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు
న్యూఢిల్లీ: భారతదేశం ప్రస్తుతం 70 నుండి 72 బీమా కంపెనీలతో మాత్రమే పనిచేస్తుందని, అదే శ్రీలంక లాంటి చిన్న దేశమే 50 కంపెనీలను కలిగి ఉందని, ఇది చిన్న దేశంతో పోల్చినప్పుడు, ఎక్కువ జనాభా కలిగిన మన దేశానికి బీమా కంపెనీల సంఖ్య చాలా తక్కువగా ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు లోక్ సభలో మాట్లాడారు.
క్రెడిట్ వ్యాప్తిని పెంచడానికి బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బిఎఫ్ఎస్) లకు అనేక లైసెన్సులు మంజూరు చేయడంలో ఆర్బిఐ దృష్టి సారించడంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చొరవ చూపాలని కోరారు. ఈరోజు కేంద్రం తీసుకొచ్చిన సబ్కా బీమా సబ్కీ రక్ష బిల్లుకు టీడీపీ తరుపున ఎంపీ లావు మద్దతు తెలిపారు. భారతదేశంలో బీమా వ్యాప్తిని పెంచాల్సిన కీలకమైన అవసరాన్ని లేవనెత్తుతు.. జాతీయ రేటు కేవలం 3.7% గా ఉందని, ఇది ప్రపంచ రేటు అయిన 7% తో పోలిస్తే తక్కువగా ఉందన్నారు.
బీమా కంపెనీలను నియంత్రించే నియంత్రణ సంస్థ, భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డిఏఐ)కొంచెం కఠినంగా ఉందన్నారు. ఎంతో ఉపయోగకరంగా ఉండే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆరోగ్య బీమా వంటి పథకాలను విస్తృతం చేసి మరింత పటిష్టంగా అమలు చేయాలని, బీమా సకాలంలో అందేలా చూడాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీమా సౌకర్యాన్ని పెంచే లక్ష్యంతో ఆర్థిక శాఖ తీసుకొచ్చిన చర్యలను ప్రశంసించారు. ముఖ్యంగా, వ్యక్తిగత ఆరోగ్య బీమాపై జీఎస్టీని 18% నుండి 0%కి తగ్గించడం, బీమాలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్ డిఐ) అనుమతించాలనే నిర్ణయాలు బీమా పాలసీలకు మంచి పరిణామం అన్నారు.