– రేవంత్ సర్కారుకు ఈ ఫలితాలు చెంపపెట్టు
– దమ్ముంటే మున్సిపల్, స్థానిక జడ్పీటీసీఎన్నికలు పెట్టండి
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచుల ఎన్నికలు మూడు విడతలుగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సర్పంచులను గెలిపించి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచిన నిర్మల్ జిల్లా ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. చాలా చోట్ల త్రిముఖ పోటీ కనిపించింది. అయినప్పటికీ, ప్రజలు స్పష్టంగా బీజేపీకి మద్దతుగా నిలిచారు.
ప్రత్యేకంగా నిర్మల్ నియోజకవర్గంలో, మూడు విడతల పోలింగ్లో 128 గ్రామ పంచాయతీలకు గాను దాదాపు 80 గ్రామ సర్పంచులను బీజేపీకి మద్దతుగా గెలిపించిన నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముధోల్ నియోజకవర్గంలో నిన్న పూర్తయిన ఎన్నికల్లో 178 గ్రామ పంచాయతీలకు గాను 98 గ్రామ పంచాయతీల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ ఫలితాలు ప్రజలు కాంగ్రెస్ పాలనను తిరస్కరిస్తూ, భారతీయ జనతా పార్టీపై ప్రజా విశ్వాసం పెరిగిందనడానికి స్పష్టమైన సంకేతాలే. ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా నిర్మల్ జిల్లాకు చెందిన నాలుగు మండలాల్లో బీజేపీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఖానాపూర్ నియోజకవర్గంలో దాదాపు 36 గ్రామ సర్పంచులను బీజేపీ మద్దతుతో గెలిపించారు.
మొత్తంగా చూస్తే, నిర్మల్ జిల్లాలో 213 మంది గ్రామ సర్పంచులను భారతీయ జనతా పార్టీ మద్దతుతో ప్రజలు గెలిపించారు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన అవినీతిలో మునిగిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై, ఆరు గ్యారంటీలు, 420 హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాడి తప్పించింది.
ఈరోజు వచ్చిన గ్రామ సర్పంచుల ఎన్నికల తీర్పు, అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు స్పష్టమైన ప్రతిబింబం. సింబల్స్ లేవని, అధికారం ఉందని చెప్పి గెలిచిన సర్పంచులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం సరికాదని హెచ్చరిస్తున్నాం.
నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలి. అప్పుడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా బయటపడుతుంది. కేవలం రెండు సంవత్సరాల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంతటి ప్రజావ్యతిరేకత కూడగట్టుకోవడం రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యానికి నిదర్శనం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి.
ఒకవైపు అవినీతి, మరోవైపు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కుంభకోణాలు, అవినీతిలో మునిగిపోయి ప్రజలను పట్టించుకోవడం మానేసింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలి. అప్పుడు ప్రజలు ఏ పార్టీపై విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరిపై వ్యతిరేకత ఉందో స్పష్టంగా తేలిపోతుంది.
గత 11 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ భారీగా నిధులు కేటాయిస్తోంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ ముందుండి అమలు చేస్తోంది. మోదీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించి, ఆశీర్వదిస్తూ నిర్మల్ జిల్లాలో అత్యధిక సీట్లను గెలిపించి పార్టీకి బహుమానంగా ఇచ్చారు. ఇది ప్రజల విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా ఫలితాలు వస్తాయని పూర్తి విశ్వాసం ఉంది.
ఈ గ్రామ సర్పంచుల ఎన్నికల ఫలితాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్పష్టమైన సంకేతంగా నిలుస్తున్నాయి. ఇవి కేవలం ప్రారంభం మాత్రమే. ఈ ఉత్సాహం, ఈ మద్దతు కొనసాగితే,తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా ఈ ఫలితాలు మార్గం సుగమం చేస్తున్నాయి. మేమంతా సమిష్టిగా పని చేస్తూ, రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పూర్తి నమ్మకంతో చెబుతున్నాను.
213 సర్పంచులకు మరియు 213 ఉప సర్పంచ్లు మరియు 1300 మంది వార్డ్ సభ్యులకు రేపు తేదీ 19 డిసెంబర్ 2025న నిర్మల్ లో సన్మాన కార్యక్రమం జరగనుంది ఈ సన్మాన కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. బిజెపి జాతీయ నాయకులు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా బిజెపి శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని అత్యధిక సర్పంచులు వార్డు సభ్యులను గెలిపించుకున్నందుకు సన్మానించారు.