ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిశ్రమదారుల మిత్రుడైన నాయకుడు — ‘నాయిడుగిరి’ అనేది పెద్ద వ్యాపార ప్రపంచాన్ని గెలుచుకునే ఒక కళ. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీని విజయపథంలో నడిపించిన తరువాత, 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా మిషన్ మోడ్‌లో ఉన్నారు. ఫలితంగా ఏపీ గత 18 నెలల్లో రాష్ట్రం రూ. 10.7 లక్షల కోట్ల పెట్టుబడులను సమకూర్చుకుంది.
ఇవి కేవలం ఆశలు కాదు — మంత్రివర్గం ఆమోదం పొందిన, పలు దశల్లో అమలులో ఉన్న ప్రాజెక్టులు. ఆర్థిక సంస్కరణలకు ప్రాతినిధ్యం వహించిన నాయుడు, ఐటీ రంగానికి తొలినాళ్లలోనే బాట వేసిన నాయకుడిగా, అలాగే హైదరాబాద్‌ను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీర్తి పొందినవారిగా ప్రసిద్ధి. ఆయన పదవి చేపట్టిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్లిన కంపెనీలను మళ్లీ రప్పించడం తన లక్ష్యమని ప్రకటించారు.
లులు గ్రూప్, అశోక్ లేలాండ్, రెన్యూ ఎనర్జీ కంపెనీ, సింగపూర్ ప్రభుత్వం వంటి సంస్థలతో స్వయంగా సంప్రదించి వారిని తిరిగి తీసుకొచ్చారు. ఈ విజయాలు, ఆయన గత రికార్డుతో కలిపి, ఈ ఏడాది ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఆయనను ఎంపిక చేసేందుకు జ్యూరీని ప్రేరేపించాయి.“ఈ గుర్తింపుకు ‘ది ఎకనామిక్ టైమ్స్’కు ధన్యవాదాలు. నేను దీన్ని వ్యక్తిగత బహుమతిగా కాదు, ఒక విస్తృత ప్రయాణానికి, నిర్మించిన సంస్థలకు, కొనసాగించిన సంస్కరణలకు, జీవన ప్రమాణాల్లో మార్పునకు దారితీసే వ్యాపార శక్తిపై ఉంచిన విశ్వాసానికి గుర్తింపుగా భావిస్తున్నాను,” అని నాయుడు ETతో అన్నారు.
“ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి సమపాళ్లలో సాగాలని విశ్వసించింది. వ్యాపారసంస్థలు ధైర్యంగా నూతన ఆవిష్కరణలు చేయగల వాతావరణం, పెట్టుబడులు ఉద్యోగాలుగా మారే విధానం, స్థిరమైన, సమగ్ర, సాంకేతిక ఆధారిత వృద్ధి ఉండేలా మేము కట్టుబడి పని చేస్తున్నాము.
”ఈ అవార్డు ఆయన నమ్మకాన్ని మరింత బలపరచింది — ప్రజల జీవితాలను మార్చే, వ్యాపార స్ఫూర్తిని పెంచే ప్రయాణం కొనసాగుతుందనే విశ్వాసాన్ని పెంచుతుంది. 2024లో ఆయన పదవి చేపట్టినప్పుడు విజయవాడలో ఆకస్మిక వరదలతో పరిపాలనాత్మక సవాళ్లు ఎదుర్కొన్నారు. వెంటనే వార్ రూమ్ ఏర్పాటు చేసి, నీటి నిల్వ, దోమల విపత్తు వంటి పౌర సమస్యలకు పరిష్కారాలు సూచించమంటూ స్టార్టప్‌లను ఆహ్వానించారు.
అదే సమయంలో వరద సహాయ సామగ్రి పంపిణీని వేగవంతం చేశారు. ఫలితంగా, పరిపాలనా రాజధానిగా ఉన్న విజయవాడ తక్షణమే సాధారణ జీవనానికి తిరిగి వచ్చింది.ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి IVRS వ్యవస్థను ఉపయోగించి, సేవా నాణ్యతపై ఫీడ్‌బ్యాక్ ఆధారంగా జిల్లా కలెక్టర్ల రేటింగ్ వ్యవస్థను రూపొందించారు. దీని ద్వారా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా, ప్రజలకు స్పందించే విధంగా మారింది.
జ్యూరీ గమనించిన అంశం — నాయుడు పరిపాలనలో సాంకేతిక ఆధారిత క్రమశిక్షణను ప్రవేశపెట్టిన తీరు. ఆయన కొత్త నగరాల సృష్టి దృశ్యకోణం, హైదరాబాద్ పునరుద్ధరణతో అది నిరూపితమైంది. అదే విజన్ ఇప్పుడు అమరావతిపై ఆయన సంకల్పాన్ని నడిపిస్తోంది — దానిని ఉద్యోగాల కల్పన కేంద్రంగా మార్చే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్యానల్ నాయుడు నాయకత్వాన్ని ఒక కొత్త రాజకీయ మోడల్‌గా — దేశంలో మొదటి “సీఈఓ ముఖ్యమంత్రి”గా అభివర్ణించింది.
నాయుడు ప్రభుత్వం ఆర్థిక, చట్ట విధానాలపై శ్వేతపత్రాలు విడుదల చేసి, వ్యవస్థలో సమస్యలను గుర్తించింది. వీటి ఆధారంగా రంగాల వారీగా ప్రత్యేక విధానాలు రూపొందించి, కంపెనీలకు పెట్టుబడి మార్గదర్శకాలు ఇచ్చింది. దీని ఫలితంగా ప్రతిపాదనలు వేగంగా పరిష్కరించబడుతున్నాయి, అలాగే “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడిదారులు కోరుకునే గమ్యస్థానంగా మార్చేందుకు ఆయన ఎన్నో సృజనాత్మక చర్యలు ప్రారంభించారు
వాటిలో ముఖ్యమైనది పెట్టుబడిదారుల ప్రోత్సాహకాలు నేరుగా అందించబడేలా ఎస్క్రో ఖాతాలను ఏర్పాటు చేయడం, రెడ్ టేపిజాన్ని తొలగించడం. ఈ చర్యలతో పెద్ద మదుపుదారులు ముందుకు వచ్చారు. గూగుల్ 5 సంవత్సరాల్లో ₹15 బిలియన్ విలువైన ఎఫ్‌డీఐతో విశాఖలో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తోంది. బ్రూక్‌ఫీల్డ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, డిజిటల్ రియాల్టీ కలయిక అయిన డిజిటల్ కనెక్షన్ కంపెనీ ₹11 బిలియన్ పెట్టుబడితో ఇలాంటి మరో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నది.
AM/NS ఆనకపల్లి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తోంది. ఈ పెట్టుబడుల ద్వారా సమకూరే ఆదాయంతో నాయుడు సంక్షేమ పథకాలను బలోపేతం చేస్తున్నారు — వాటిలో పేద మహిళలకు పిల్లల విద్య కోసం ఆర్థిక సహాయం, రైతులకు మద్దతు, అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు LPG సిలిండర్లు అందించడం ఉన్నాయి.
(ఎకనామిక్ టైమ్స్ కథనానికి అనువాదం)
– కందిమళ్ల కృష్ణారావు