– అమరావతిలో తాత్కాలిక భవనాల పేరుతో వేల కోట్లు దుబారా
– నీళ్లు తోడడానికి, ముళ్ల కంప కొట్టడానికే కోట్ల ఖర్చు
– ఇప్పుడు మళ్లీ కొత్త భవనాల పేరిట భారీ నిర్మాణాలు
– 18 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు
– రోజుకు రూ.550 కోట్ల అప్పు
– ఒక రోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తవుతుంది
– విశాఖలో గోమాంసం దొరికితే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరువిప్పలేదు?
– సనాతని అని చెప్పుకునే పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?
– కోటి సంతకాలతో చంద్రబాబు నిర్ణయాన్ని ఎండగట్టిన రాష్ట్ర ప్రజలు
– వైఎస్సార్సీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలతో రాష్ట్ర ప్రజలు సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని ఎండగట్టారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… కోటి సంతకాల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వచ్చిన అత్యుత్తమ ప్రజా స్పందనగా అభివర్ణించారు.
రోజుకు రూ.550 కోట్లు చొప్పున, 18 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు.. ఒక రోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తి చేయవచ్చని.. అయినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకే మొగ్గు చూపడం దుర్మార్గమని మండిపడ్డారు. మరోవైపు గంట యోగా ఖర్చుకు రూ.330 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసిన చంద్రబాబు… ప్రజల సొమ్మును విపరీతంగా దుబారా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్సార్సీపీ అధికారంలోకి రాగానే కచ్చితంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుదన్నారు. విశాఖలో గోమాంసం దొరికితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరువిప్పలేదని ప్రశ్నించిన ఆయన… తనను తాను సనాతని అని చెప్పుకునే పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. పరకామణి కేసు సెటిల్మెంట్ కోర్టు పరిధిలో జరిగితే.. దానికి, వైయస్సార్సీపీకి ఏం సంబంధని.. దాన్ని కూడా రాజకీయం చేయటం పవన్ సంకుచిత బుద్దికి నిదర్శనమని మండిపడ్డారు.
మీ ప్రభుత్వం చేయించుకున్న సర్వేల్లో ఒకవైపు మీరు, కలెక్టర్లు అందరం కష్టపడుతున్నా… ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని మీరే కలెక్టర్లతో చెప్పారు కదా చంద్రబాబు. మీరు చెప్పిన ప్రజాభిప్రాయమే వైయస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో రెఫరెండం మాదిరిగా బయటపడింది.
మీరు మాక్స్ యాక్ట్ లోకి తెచ్చిన ఏ డెయిరీనైనా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నుంచి తిరిగి ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఉందా? విశాఖపట్నంలోని విజయ విశాఖ డెయిరీ, కృష్ణా జిల్లా విజయా డెయిరీ, గుంటూరు సంగం డెయిరీ దేన్నైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకోగలమా? అప్పడు కూడా మీరు ఇలాగే ప్రభుత్వమే నియంత్రిస్తుందని చెప్పారు, తీసుకుని రాగలిగామా?
యోగా పేరుతో కేవలం ఒక గంట కార్యక్రమానికి రూ.300 కోట్లు ఖర్చుపెట్టారు. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు ఏడాదికి దాని కోసం రూ.400 కోట్లు ఖర్చుపెడుతున్నారు. ముళ్ల కంపలు కొట్టే ప్రాజెక్టు కోసం కూడా వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి హైవే కనెక్టివిటీ కోసం 3 కిలోమీటర్ల పొడవైన రోడ్డు కోసం రూ.540 కోట్లతో టెండర్లు పిలిచారు. అంటే కిలోమీటరుకి రూ.180 కోట్లు ఖర్చు. మరో రెండు కిలోమీటర్ల బ్రిడ్జికి రూ.1200 కోట్లు అని చెప్పారు. వీటన్నింటికీ డబ్బులు ఉన్నాయి. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రం డబ్బులు లేవు.
రుషికొండలో భవన నిర్మాణానికి రూ.260 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశామని మాట్లాడుతున్నారు. మీరేమో వెలగపూడిలో రూ.1000 కోట్లతో తాత్కాలిక సచివాలయం కట్టారు. మరలా ఇప్పుడు వేరొకచోట సెక్రటేరియట్ పేరుతో వేల కోట్ల రూపాయలతో పెద్ద, పెద్ద భవనాలు కడుతున్నారు. మరి ఆ రూ.1000 కోట్లు వృధా కాదా? వైయస్.జగన్ విశాఖలో ఒక చారిత్రాత్మక భవనాన్ని కడితే… అది డబ్బులు వృధా, కానీ చంద్రబాబు ఏం కట్టినా అది సంపద సృష్టే? వందలాది కోట్ల రూపాయలతో తాత్కాలిక హైకోర్టు నిర్మించారు. మరలా ఇప్పుడు మరోచోట హైకోర్టు అంటున్నారు, అది వృధా కాదా? దీనికి ఏ ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్తారు?
నిన్నటి నుంచి మంత్రులు పార్ధసారధి, సత్యకుమార్ యాదవ్ తోపాటు టీడీపీ నేత పట్టాభి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దమ్ముంటే నన్ను అరెస్టు చేసుకోండి అంటున్నారు. సత్యకుమార్ గారు ఎందుకు గాభరా పడుతున్నారు? ఆ టైం కూడా వస్తుంది, అప్పుడు ఈ వైద్య ఆరోగ్యశాఖలో కేవలం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక్కటే కాదు.. అందులో జరిగిన ప్రతి కుంభకోణం బయటకు వస్తుంది. అర్హత లేకపోయినా.. భవ్యా ఇన్ ఫ్రా అనే కంపెనీకు ఎల్ -1 రాకపోయినా వాళ్లకు 108,104 నిర్వహణ కట్టబెట్టారు. దానిపై విచారణ జరిగి తీరాల్సిందే.
ఏపీ ఎంఎస్ఐడీసీ లో జరుగుతున్న ప్రతి కొనుగోలుపైనా విచారణ జరిగి తీరాల్సిందే? ఆరోగ్యశ్రీని ట్రస్ట్ మోడల్ నుంచి హైబ్రిడ్ మోడల్ లోకి పంపించడానికి ప్రభుత్వంపై ఏడాదికి రూ.1000, రూ.1500 కోట్లు అదనపు భారం మోపడమనేది ఎవరి ప్రయోజనం కోసమన్నదానిపైనా విచారణ జరిగి తీరాల్సిందే. మెడికల్ కాలేజీలు ఎవరి బినామీల చేతుల్లో పెడుతున్నారో? ఎంతెంత చేతులు మారుతున్నాయో? ఎంతెంత కలెక్షన్ జరుగుతుందో విచారణ జరిగాల్సిందే?
100 శాతం ఓపీ ఫ్రీ అని చెబుతున్నారు, ఓపీ ఫీజు రూ. 100 నుంచి రూ.300 వరకు ఉంటుంది. ఆసుపత్రిలో చేరిన తర్వాత పరీక్షలు, ప్రోసీజర్స్, ఇన్ పేషెంట్ ఛార్జీలు గురించి మాత్రం మాట్లాడడు. అంటే కేవలం ఓపీ ఫ్రీగా ఇచ్చి.. ప్రజలను దోచుకుంటారా? దీనికోసం మరలా ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లిస్తారా?
ఒక్కో కాలేజీకి నెలకి రూ.5-6 కోట్లు అవుతాయి. అంటే ఏడాదికి రూ.60-70 కోట్లు, అంటే రెండేళ్లకు రూ.120 కోట్లు మొత్తం 10 కాలేజీలకు కలుపుకుంటే.. రెండేళ్లకి రూ.1200 కోట్లు మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన తర్వాత జీతాల రూపంలో చెల్లించబోతున్నారు. అంటే మీరు కేవలం జీతాల రూపంలోనే రూ. 1200 కోట్లు ప్రభుత్వ ధనాన్నివెచ్చించడానికి సిద్దపడ్డారు.. అంటే మీరు ప్రైవైటు వ్యక్తులకు జీతాల పేరుతో అప్పనంగా ఇవ్వడానికి సిద్దమైన డబ్బులతోనే కనీసం 2, 3 కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. ఇది స్కామ్ కాదా? ఇది స్కామ్ లకే బాబు లాంటి స్కామ్.
రాష్ట్రంలో పెట్టుబడులకు రాకపోవడానికి కారణం ఎవరు? పప్పు బెల్లాల్లా ప్రభుత్వ భూములను పంచినప్పటికీ పెట్టుబడుదారులు ఈ రాష్ట్రానికి రావడానికి ఎందుకు భయపడుతున్నారంటే.. ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దౌర్జన్యమే కారణం. ఆదానీ లాంటి పెట్టుబడుదారుల క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి, ప్రొడక్షన్ ఆపింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కాదా? జిందాల్ లాంటి పెట్టుబడుదారుడ్ని జైల్లో పెట్టే ప్రయత్నం చేసి భయపెట్టింది ఈ ప్రభుత్వ పెద్దలు కాదా? చెట్టినాడు సిమెంట్ ఇండస్ట్రీకి తాళం వేయలేదా? ఎల్ అండ్ టీ తమ కంపెనీకి తాళం వేసుకోలేదా? గ్రీన్ కో, డేటా సెంటర్, ఆదానీ, ఎన్ టీ పీ సీ అన్నీ వైయస్.జగనే తీసుకొచ్చారు. మీరు మీ సొంత కంపెనీలకు సత్వా అనే మీ సొంత మనుషులకు ఉచితంగా భూమిలిస్తారా? రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీ కాదా?
విశాఖలో లక్షలాది కేజీల పశుమాంసం దొరికితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు. మీరు సనాతిని, హిందూ ధర్మ పరిరక్షకులు కదా? మీరు ఎందుకు నోరు విప్పలేదు. వైయస్.జగన్ హయాంలో ఇలాంటి ఘటనలే జరగలేదు. అంత పక్కగా వ్యవహరించారు. మీ హయాంలోనే ఇలాంటి ఘటన జరిగింది.