2022 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో బేస్ లైన్ పరీక్షలు నిర్వహించింది. అందులో చాలా ఫలితాలు చాలా దారుణం గా ఉన్నాయి . 10 వ తరగతి చదివే వారిలో 48% మందికి ‘ I LIKE THIS BOOK , this is my house ‘ లాంటి చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు కూడా చదవటం రాదు ! ASER సర్వే యొక్క ఫలితాల కన్నా , వాస్తవ పరిస్థితులు మరింత ఘోరంగా ఉన్నాయని అప్పటి బేస్ లైన్ పరీక్ష తెలియపరిచింది .
దురదృష్టవశాత్తూ ఆ ఫలితాలను అప్పటి ప్రభుత్వం తల్లిదండ్రులకి ఇవ్వలేదు . ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. యథావిధిగా హైకోర్టు ను తప్పుదోవ పట్టించి , బడిలో అందరికీ అందుబాటులో ఉంచాము … అని నమ్మబలికింది! మరి తల్లిదండ్రులకి ఎందుకు చెప్పలేదు … అంటే …. పిల్లల లేత మనస్సు బాధ పడుతుంది అని హైకోర్టు కు చెప్పారు !
2024 లో ప్రస్తుత ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక … 1000 ప్రభుత్వం బడుల్లోని విద్యార్థులు 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు CBSE బోర్డులో వ్రాసి , ఉత్తీర్ణత సాధించగలరా ? లేదా ? అని తెలుసుకోవడానికి … ట్యాబ్ లో 10 వ తరగతి విద్యార్థులకు బేస్ లైన్ పరీక్షలు నిర్వహించారు. అందులోని ఫలితాలు దారుణంగా ఉండటం వలన … ఆ 1000 స్కూళ్ల లోని విద్యార్థులకు … CBSE బోర్డ్ లో కాకుండా … SSC బోర్డు లో 10 వ తరగతి పరీక్షలు వ్రాయించారు .
అయితే ఆయా ఫలితాల యొక్క రాష్ట్ర వ్యాప్త percentage లను ప్రభుత్వం జి.ఓ లో కూడా పొందుపరిచింది. అది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం! అయితే జి.ఓ లో ఫలితాల percentage లను ఉంచిన ప్రభుత్వం, తల్లిదండ్రులకు మాత్రం ఆ మార్కులు ఇవ్వలేదు. పైపెచ్చు ఏదో ఒక చిన్న క్లాస్ పరీక్ష పెట్టి … ఆ మార్కులను FA మార్కుల్లా రాసి, మెగా PTM లోని ప్రోగ్రెస్ కార్డులు కూడా పంచారు !
2025 : నవంబర్ చివరి వారం నుండి డిసెంబర్ 5 వ తేదీ వరకు … ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో ‘ బేస్ లైన్ ‘ పరీక్ష నిర్వహించింది! ఆ పరీక్ష objective గా ఉండటం కోసం DIET విద్యార్థుల చేత , surplus ఉపాధ్యాయుల చేత , CRP ల చేత చేయించారు. బేస్ లైన్ సర్వే ను మొబైల్ లోని LEAP యాప్ చేయించారు. పరీక్ష LEAP యాప్ లో చేశారు .
చూడటానికి , వినడానికి … అంతా పకడ్బందీగా ఉన్నట్లుగానే ఉంది !
కానీ అంతా లోపాలతో నిండి ఉంది.
పై రెండు బేస్ లైన్ పరీక్షల ఫలితాలకు భిన్నంగా, ASER సర్వే కు కూడా భిన్నంగా… ప్రస్తుత బేస్ లైన్ సర్వే లో ఫలితాలు వచ్చాయి !
కారణం ఏమిటంటే …. అదంతా యాప్ మహిమ అని ఉపాధ్యాయులు చెప్తున్నారు! విద్యాశాఖ ఈ రోజు ( 19/12/2025) బేస్ లైన్ సర్వే ఫలితాల పట్టిక విడుదల చేయకముందే …. గత రెండు వారాలుగా ఉపాధ్యాయులు … ఈ సర్వే లోని లోపాలను ఎత్తి చూపుతున్నారు .
కనీసం నోరుకూడా తెరవని విద్యార్థులకు … ఈ యాప్ లో అత్యధిక మార్కులు! వారందరికీ SKY line వచ్చింది. అనగా 70% పై గా మార్కులు వచ్చాయి.
మామూలుగా ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉంటే గౌరవం దక్కుతుంది అని పెద్దలు చెప్తారు . కానీ విద్యాశాఖ వారి యాప్ మాత్రం మార్కులు కుమ్మరించింది !
ఇంత పెద్ద ఎత్తున 13 లక్షల పై చిలుకు విద్యార్థుల సామర్థ్యాల పై సర్వే చేస్తున్నప్పుడు … ప్రభుత్వం ఎప్పటికప్పుడు feedback తీసుకోవాలి . కానీ అది చేయకపోవడం వలన … ఈ సర్వే వృథా అయ్యింది .
ఈ సర్వే లో విద్యార్థులకు వచ్చిన మార్కులు… యథాతథంగా తల్లిదండ్రులకి తెలియజేసే ధైర్యం అటు ప్రభుత్వానికి , ఇటు ఉపాధ్యాయులకు లేదు. కారణం … వెంటనే పోలికలు వస్తాయి ! పిల్లలు … తల్లిదండ్రులు ఈ సర్వే లోని లోపాలను నిక్కచ్చిగా నిలదీస్తారు!
– డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్