ఇది నా సినిమా..
సాక్షాత్తు బి ఎన్ రెడ్డి
అంతటి వ్యక్తే సగర్వంగా
చెప్పుకున్న కళాఖండం..
ఈ బొమ్మ ద్వారా
ఆయనకు దక్కిన కీర్తి అఖండం..
వాహిని సంస్థ నుంచి వెలువడిన స్వరవాహిని..
భానుమతి అనే సమ్మోహిని..
ఎన్టీవోడి సరికొత్త బాణి
ఘంటసాల గంధర్వ వాణి
అంతర్జాతీయ విపణి..
వెరసి మల్లీశ్వరి అయింది తెలుగు సినిమాల్లో అగ్రశ్రేణి!
రెడ్డి గార్కి రాయల వారిపై
ఉన్న ప్యాషన్..
పుట్టింది ఈ సెన్సేషన్..
ఇది కధా..కల్పితమా..?
రాయలు నిజం..
మల్లీశ్వరి ఊహ..
మనసున మల్లెల మాలలూపిన
కన్నుల వెన్నెల కాంతి నింపిన ఊహాసుందరి..
బావ మాటైన చెప్పి పోవే
అంటూ మేఘమాలను
వేడుకున్న కలువ కనుల చిన్నది..
తన పాటలను
తానే పాడుకున్న కోయిల..
రాయలనే మెప్పించిన నెలబాల..
కృష్ణశాస్త్రి మదిలో ఇంకాఇంకా
మధురంగా రాయాలనే
కోరిక పెంచిన
అందాల బాలిక
మేఘమాలిక..!
దేవులపల్లి కలం నుంచి జాలువారి ..
సాలూరు వారి రసాలూరి..
ఘంటసాల గళంలో అమృతమే ఊరి..
భానుమతి అమృతం కూరి కురిపించిన స్వరఝరి..
ఏమి పాటలు..
తేనెల ఊటలు!
ఆ రోజుల్లో..
తెనుగింటి గిత్తలను
పరుగులు తీయించి
ఉరకలు వేయించిన
నోమన్న లాలా మసాలాలు
ఝుంఝుం తుమ్మెద ఘింకారాలు..
మధురగీతాల నుడికారాలు!
ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు
జాలి గుండెల మేఘమాలా
కాళిదాసుకు సరిసాటిగా
కృష్ణశాస్త్రి మేఘసందేశం..
మల్లీశ్వరి,నాగరాజు పాత్రల్లో
ఎన్టీఆర్,భానుమతి పరకాయప్రవేశం..
పిలిచిన బిగువటరా..
మత్తెక్కించే స్వరంతో భానుమతి పిలవగనే
థియేటర్లకు ఉరకలెత్తిన కుర్రకారు..
తెలుగునాట ఎక్కడైనా
ఇవే పాటల హోరు!
ఇలాంటి ఓ అపురూప చిత్రం
మళ్లీ మళ్లీ వచ్చేనా..
ఔనా నిజమేనా..!?
వాహినీ వారి కళాఖండం
మల్లీశ్వరి @ 75..(20.12.1951)
ఈ సందర్భంగా..
ఇవిగో..ఇవిగో అక్షరసుమాలు..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286
7995666286