– ఇబ్బందుల్లో రాష్ట్ర రైతాంగం
– మార్క్ఫెడ్ ద్వారా ఎంత అమ్మారు?
– ప్రైవేట్ డీలర్లకు ఎంత కేటాయించారో చెప్పాలి
– వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ (వ్యవసాయం మరియు రైతు సంక్షేమం) ఎంవీయస్ నాగిరెడ్డి.
గుడివాడ: రాష్ట్రంలో యూరియా సరఫరాకు సంబంధించి ప్రభుత్వ అంచనాలకు. వాస్తవాలకు ఎక్కడా పొంతన ఉండటం లేదని వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ (వ్యవసాయం మరియు రైతు సంక్షేమం) ఎంవీయస్ నాగిరెడ్డి వెల్లడించారు.
రబీ సాగు పూర్తిగా మొదలవ్వక ముందే యూరియా కొరత ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. నానో యూరియా కొనాలని ఒత్తిడి చేసే డీలర్లపై చర్యలు తీసుకోవాలన్న నాగిరెడ్డి, రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రబీ సీజన్ సాగు పూర్తిస్థాయిలో జరగక ముందే క్షేత్రస్థాయిలో యూరియా కొరత తలెత్తడం చూస్తుంటే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ అంచనాలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదు. డిసెంబరు చివరి నాటికి 3.93 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేస్తే, ఇప్పటికే 3.23 లక్షల టన్నులు అమ్మినట్లు రికార్డుల్లో చూపడం ఆశ్చర్యకరం. రాష్ట్రంలో యూరియా వాడకం, నిల్వలపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలి.
ఈ రబీ సీజన్లో అంచనా ప్రకారం 5.5 నుండి 6 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా ప్రభుత్వ అంచనా 9.38 లక్షల టన్నుల యూరియా డిమాండ్ ఉన్నట్టు చూపిస్తున్నారు. పంటల వారీ మొత్తం డిమాండ్ వివరాలు ప్రకటించాలి..
వరి, జొన్న, మొక్కజొన్న మినహా మరే ఇతర పంటలకు యూరియాతో పెద్దగా అసవరం ఉండదు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారమే 20.69 లక్షల హెక్టార్లలో రబీ సాగు జరగాల్సి ఉంటే ఇందులో వరి 7.45 లక్షల హెక్టార్లు కాగా 17/12 వ్యవసాయ శాఖ రిపోర్ట్ ప్రకారం సాగు జరిగిన వరి 23 శాతం మాత్రమే సాగు జరిగింది. రబీ సీజన్ ప్రాథమిక దశలోనే ఇంతలా యూరియా కొరత రావడం వెనక, ఏదో మతలబు జరిగినట్లు అనుమానం వస్తోంది. రాష్ట్రంలో అసలు యూరియా రైతులకు అందుతుందా? లేక బ్లాక్ మార్కెట్కు మళ్లుతుందా?. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాస్తవాలు బయటపెట్టాలి.
నానో యూరియా బలవంతంగా అమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా, క్షేత్రస్థాయిలో రైతులను కొనాలని బలవంతం చేస్తున్నారు. ఇది అత్యంత హేయం. సాధారణ యూరియా కట్ట కావాలంటే, రూ.450 విలువైన గుళికలు లేదా నానో యూరియా కొనాలని డీలర్లు రైతులను వత్తిడి చేస్తున్నారు. అలా రైతులను వేధించడం సరికాదు.
మరోవైపు యూరియా కోసం సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల వద్ద స్టాక్ లేదన్న సమాధానం వస్తోంది. అంటే యూరియా ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు అయిపోతుందో? కూడా తెలియని అయోమయ స్థితి నెలకొంది.
అందుకే ఈ రబీ సీజన్ ఆరంభంలో ప్రభుత్వం వద్ద ఉన్న యూరియా నిల్వలు. మార్క్ఫెడ్ ద్వారా ఎంత అమ్మారు? ప్రైవేట్ డీలర్లకు ఎంత కేటాయించారు? అన్న పూర్తి వివరాలు గణాంకాలతో సహా బయటపెట్టాలి. అలాగే నానో యూరియాను బలవంతంగా అంటగట్టే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వీడియోలో ఎంవీఎస్ నాగిరెడ్డి కోరారు.