– కావాలి డిజిటల్ స్మార్ట్ నెస్
( వాసిరెడ్డి అమర్నాధ్)
మైరావణ మీడియా !
పుట్ట గొడుగుల్లా యు- ట్యూబ్ చానెల్స్ .. టీవీ చానెల్స్ .. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్లు ..
నడుస్తున్నది క్లిక్ జర్నలిజం కాలం ..
ఎన్ని వ్యూస్ వస్తే.. అంత ఆదాయం ..
ఎంత వివాదమయితే అన్ని వ్యూస్..
బూతులు తిట్టినా ఆదాయమే ..
.. తిట్లే రెవిన్యూ ఆశీర్వాదాలు ..
ప్రతిదీ వివాదమే ..
కాదు… కాదు ..
కావాలనే వివాదాలను లేవదీస్తారు
సమర్థిస్తూ ఒక వర్గం ..
వ్యతిరేకిస్తూ ఇంకో వర్గం ..
జన సామాన్యం… వైరి శిబిరాలుగా మారి … మీడియా లో … సోషల్ మీడియా లో… నిజజీవితం లో యుద్ధాలు .
ఒక ఇష్యూ పాతబడిందంటే .. ఇంకొకటి .
ఇది నిరంతర యుద్ధ ప్రక్రియ !
1. 69 ఏళ్ళ సినిమా పెద్దాయన … సరిగ్గా .. తన వయసున్న తోటి నటుడ్ని .. ముసలి .. అని ఒక బూతు పదం తో పిలుస్తాడు .
2. ఇంకో సందర్భం లో ఇంకో నటుడ్ని ఇంకో పరమ బూతు పదం తో…
3. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఒక మహిళ చున్నీ తీసేస్తుంది .
ఇంకో హిట్ దర్శకుడు దేవుడ్ని విమర్శిస్తూ ..
4. ఒక నటుడు.. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్దేశిస్తూ రెండు బూతులు వాడుతాడు.
5. అతన్ని విమర్శిస్తూ ఒక టీవీ / సినీ నటి ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది .
6. రాజకీయ నాయకుడు ఒకటంటాడు. దాని కి ప్రతిగా మరో రాజకీయనాయకుడు …
ప్రతిమోత గదులు !
సోషల్ మీడియా లో రచ్చ రంబోలా ..
మహిళల దుస్తులు ఇలా ఉండాలని చెప్పిన నటుడ్ని సమర్థిస్తూ మగమహారాజుల కామెంట్స్ ..
అతన్ని విమర్శిస్తూ కొండొకచో తిడుతూ మహిళల కామెంట్స్ .. మహిళలు తమకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు అని చెప్పిన నటిని బూతులు తిడుతూ మగాళ్ల కామెంట్స్ ..
దానికి ప్రతిగా వైరి శిబిరం పోస్ట్లు ..
ఒక్క సారి ఆలోచించండి ..
రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు లేక పొతే టీవీ చానెల్స్ యూట్యూబ్ చానెల్స్ … సోషల్ మీడియా… ఏమై పొయ్యేది ?
మాట్లాడుకోవడానికి .. కాదు కాదు… వాదులాడుకోవడానికి , కొట్టుకోవడానికి… ఇష్యూ లేక
జనాలకు బోర్ కొట్టేస్తుంది ..
రెవిన్యూ లేక మీడియా మూతబడుతుంది .
తగలెట్టేయండి నిరంజన్ గారు !
సోషల్ మీడియా బతికితే చాలా ?
1. నువ్వొక ఫంక్షన్ కు వెళుతావు. పోగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు . మహా స్టైల్ గా దాన్ని లొట్టలేస్తూ తాగేస్తావు . ఆరంజ్ టేస్ట్ లేదా లెమన్ టేస్ట్ లేదా ఒంకోటి…” అదిరింది” అని పక్కోడి తో చెబుతావు .అది సహజ రుచి కాదు . అస్పర్టమ్ లేదా సుక్రాలోజ్ అనే రసాయనం .. అది ముందుగా నీ ఉదరాన్ని అటు పై మొత్తం బాడీ ని నాశనం చేస్తుంది .
2. సినిమా టాకీసుకు పోతావు . ఇంటిల్లిపాదీ పాపకార్న్ తెచ్చుకొని తింటారు . అందులో బట్టర్ టేస్ట్ కోసం డైసీటాయిల్.. అది పాపకార్న్ లంగ్ రోగాన్ని .. యాభై లక్షలు ఖర్చుపెట్టినా ప్రాణం దక్కించుకోలేని భయంకర అనారోగ్యాన్ని కలిగిస్తుంది
3. డబ్బాల్లో తెచ్చి తినే ప్రతి ఆహారం లో.. బిపిఎ .. అది హార్మోన్ సమస్య ను.. అంటే థైరాయిడ్ ను కలిగిస్తుంది .. అటు పై బతుకు నరకం ..
4. ప్రతి రోజూ నీ బిడ్డలు మొబైల్ ఫోన్ పై తెగ ఆటలాడుతుంటారు . విదేశీ ఈక్విటీ స్టార్ ఆసుపత్రి వాడు .. ఇలాంటి పిల్లల కోసం బ్రెయిన్ కాన్సర్ బెడ్లు రెడీ చేసుకుంటుంటాడు.
నీ పిల్లల చదువు ..
నీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ..
నీ ఆర్థిక స్థితి .
ఇలాంటి విషయాలు … నీకు రుచించవు .. పట్టించుకోవు .
కావాల్సింది మసాలా .. కాలక్షేపం ..
అయన మాజీ కోడలి తాజా భర్త ఎవరు ?
ఆయన మూడో పెళ్ళాం ఎలాంటి దుస్తులు వేసుకొంటోంది ? … లాంటి చెత్త .
నీకు కావలసింది వాడి దగ్గర వుంది !
నీ బతుకు కు సంభందించిన విషయాలు చర్చకు రావు .
వస్తే అవి కార్పొరేట్ బడి , స్టార్ ఆసుపత్రి , జంక్ ఫుడ్ ఇండస్ట్రీ రెవెన్యూ ను..
దెబ్బ తీస్తాయి .
అసలు విషయాలు చర్చకు రాకూడదు .
జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి .
ఎలా ?
సింపుల్ .. ఏదో ఒక పనికి రాని విషయం పై వివాదం లేవదీయాలి .
అటెంషన్ డైవర్ట్ చెయ్యాలి .
వ్యూస్ కొట్టేయాలి ..
రెవిన్యూ పోగెయ్యాలి .
“కాస్త పొట్టి దుస్తులు వేసుకొన్నంత మాత్రాన ఒక అమ్మాయి నీకోసం అర్రులు చేస్తున్న వ్యాంప్ కాదురా ”
” మీ అమ్మమ్మ , నాయనమ్మ కాలం వేరు .. నేటి మహిళ చదువుకుంది .. సంపాదిస్తోంది .. ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక మగమహారాజు అనుకొని కాలిపై కాలేసుకుని కూర్చుంటే ఎలా? .. నీ.. లా ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన భార్యతో కలిసి ఇంటిపని వంటపని చెయ్యి ”
… అని ప్రతి ఇంట్లో కొడుక్కి చెబితే పోలా ?
” అమ్మా.. మనం ఎన్ని చెప్పినా సమాజంలో చిత్త కార్తె కుక్కలు ఉంటాయి . కాస్త పొట్టి దుస్తులు వేసుకొంటే ఇలాంటి వారు .. తన కోసమే అని రెచ్చిపోతారు .. హుందగా దుస్తులు వేసుకో ”
ప్రతి ఇంట్లో అమ్మాయిలకు చెబితే పోలా ?
కాదు .. సోషల్ మీడియా ఎక్కాలి ..
యుద్ధం చెయ్యాలి .
పురుషులు మహిళ ద్వేషాన్ని ..
మహిళలు పురుష ద్వేషాన్ని రెచ్చ గొట్టాలి .
చేతిలో సొల్లు ఫోన్ .. బుర్ర లో విషం .. రాత్రి పదకొండింటి దాక సోషల్ మీడియా లో తిట్లూ శాపనార్తాలతో కాలక్షేపం చేసి .. తుత్తిగా పడుకోవాలి.
పడుకొంటే నిద్రపట్టదు .
పట్టినా కలత నిద్రే .
గంటల పాటు మొబైల్ కు అతుక్కొని పోవడం వల్ల మెలతనిన్ హార్మోన్ చస్తుంది .
దీనితో ఇన్సొమ్నియా .
నిద్రసరిగా పట్టక పొతే ఎలర్జీ లు.. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లు..
హేట్ కంటెంట్ చదువుతుంటే .. పోస్ట్ చేస్తుంటే ..
నీ ఒంట్లో.. లీటర్ ల కొద్దీ స్ట్రెస్ హార్మోన్ కార్టిజల్.
ఏ విధంగా చూసిన నీవు విదేశీ ఈక్విటీ ఆసుపత్రిగాడికి చిక్కుతావు . అంతేలే … వారు బతకాలంటే .. నీ అజ్ఞానం తగలడాలి మరి .
1 . ప్రతి ఇల్లు.. ఊరు – వాడ.. మొత్తం ప్రపంచం యుద్ధ భూములుగా మారిపోతున్నాయి .
ఎవడో జ్వాలను రగిలిస్తాడు . దానికి కోట్లాది మంది బలైపోతున్నారు .
2 . నీ బతుకు నిజమయిన ప్రభావం చూపే వాటిపై కొట్లాడుతున్నావా?
కాదు ..
ప్రతి రోజా .. సొల్లు .. సుత్తి .. చెత్త .. జీవితానికి ఏ మాత్రం పనికి రాని అంశాల పై వివాదాలు .
౩. మనిషి మనిషితో కలవడం తగ్గిపోయింది . గంటలు గంటలు సొల్లు ఫోన్ ద్వారా… వర్చువల్ లోకం లో .
సెల్ ఫోన్ రేడియేషన్ . వైఫై రేడియేషన్ . మెదడులో న్యూరో కెమికల్ మార్పులు తెస్తోంది .
ఫలితంగా … చిరాకు .. అసహనం .. ద్వేషం .
నరనరాల్లో ద్వేషం .
భార్యంటే భర్తకు ..
భర్త అంటే భార్యకు ..
పిల్లలపై పేరెంట్స్ కు ..
అంతకు మించి పేరెంట్స్ అంటే పిల్లలకు ద్వేషం .
కులాల మధ్య మతాల మధ్య .. ప్రాంతాల మధ్య ద్వేషం .
మనిషంటే మనిషికి ద్వేషం .
తాను నాశనం అయినా ఫరవాలేదు .. పక్కోడు బాగుపడకూడదు .. నా మాట వినకపోతే కాల్చుకొని చచ్చిపోతా లేదా చంపేస్తా… అంటూ మొబైల్ బానిసలు .
ద్వేషమే ముడి సరుకు ..
రాజకీయ పార్టీలకు .. నాయకులకు .. మీడియా కు .. సోషల్ మీడియా కు .. దేశాలకు ..
… ద్వేషమే వ్యాపార వస్తువు .
తెలంగాణా గురించి మాట్లాడుకొందామా?
లేక ఆంధ్ర ప్రదేశ్ ?
లేదా మొత్తం ఇండియా ?
లేదా ప్రపంచం ?
ఒక ఘటన ..
దాని పై ఒక టీవీ ఛానల్ ఒక లాగా చెబుతుంది .
దాని వైరి టీవీ ఛానల్ లో సరిగ్గా మరో రీతిలో .
దానికి దీనికి పొంతన ఉండదు .
ఉత్తరం – దక్షిణం . తూర్పు – పడమర .. ఆకాశం- నేల..
కలవని దిక్కులు .. అవి కలవవు .
ఏది నిజమో .. ఏది అబద్దమో ఎవరికీ పట్టదు .
ఈ పక్షం వారు .. ఈ టీవీ చూసి శివాలెత్తి పోతుంటారు .
మరో పక్షం వారు .. తమ టీవీ చూసి అటువైపు శివాలెత్తి పోతుంటారు . రాత్రి ఏండింటినుంచి పదిదాకా తెలుగు చానల్స్ పెట్టండి . ఒకప్పుడైతే టీవీ వైట్ అండ్ బ్లాక్ లో ..
ఇప్పుడు రంగులు .
. కొన్ని పసుపు ..
కొన్ని నీలం ..
కొన్ని పింక్ ..
కొన్ని కాషాయం ..
కొన్ని ఎరుపు ..
మనకైతే అలవాటైపోయింది కానీ… ఏదో గ్రహం నుంచి ఒక బుద్ధి జీవి ఇక్కడికొచ్చి రెండు వైరి రంగుల టీవీ డిబేట్స్ చూస్తే .. వాక్ సీన్ వేసుకొని ఆత్మ హత్య చేసుకోవడం ఖాయం.
దీన్ని ఎకో చాంబర్స్ అంటారు.
ఏ గూటి చిలక ఆ పాటే పాడుతుంది … అనేది పాత సామెత .
ఏ గజ్జి వారు అదే ఛాంబర్ లో దూరుతారు అనేది డిజిటల్ యుగం రీతి .
నీవు మహిళ ద్వేషివా ? నువ్వు ఒక పోస్ట్ చూడగానే అటువంటి దాన్నే సోషల్ మీడియా అల్గోరిథం చూపిస్తుంది . దాన్ని చూస్తావు .. అయిపోగానే అలాంటిదే ఇంకోటి .
అదే ప్రపంచం అనుకొంటావు .
బిర్రబిగుసుకొని పోతావు .
అదే పనిగా అలాంటి కంటెంట్ చూసి చూసి నీలో… స్త్రీ ద్వేషం పెరిగిపోతుంది .
నిన్ను కన్న మహిళ… నీ తోడు పుట్టిన మహిళ కూడా స్రీలు … అనే విషయాన్ని మరిచి నరనరాల్లో మహిళా జాతి పై ద్వేషాన్ని నింపుకొంటావు .
అదే సమయం లో నీ భార్య కూడా పురుష ద్వేష ఎకో ఛాంబర్ లో ..
అదే రీతిలో .. ఆ రంగు పార్టీ వారు .. తమ రంగు టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానెల్ సిసిల మీడియా గ్రూప్స్ లో ..
ఎవరికి వారు తమదే రైట్ అనుకొంటారు . అవతలి వారిని విలన్స్ అనుకొంటారు .
మేము పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు అని ఒక వర్గం .
లేదు .. మూడు చెవులు … అని మరో వర్గం !
ఒక్కడంటే మరొకరికి పడదు .
ద్వేషం .. వైరం .
ఒకప్పుడు రాజకీయ పక్షాలంటే కేవలం సిద్ధాంత ప్రాతిపదికన విబేధాలు .
ఇప్పుడు వైరి శిబిరాలు . నరుక్కొని చచ్చిపోతే తప్ప వైరం .. సమసి పోదేమో అనే స్థాయిలో సమాజం లో వైరి పక్షాలు .
మాటల్లేవు .. మాట్లాడుకోడాలు లేవు ..
నరుక్కోవడాలు .. బూతులు తిట్టుకోవడాలే!
మనిషి మనిషి కలిస్తేనే సమాజం ..
పొద్దున నీవు వాడే బ్రష్ మొదలు రాత్రి పడుకొనే చాప / బెడ్ దాక ఏదీ సొంతంగా ఒక్కడే తయారు చేసుకోలేవు .
1. మనిషికి మనిషికి మధ్య వైరం పెడుతున్న సోషల్ మీడియా ను పాతరేయండి .
2. మొబైల్ బానిసత్వం నుండి బయటకు రావాలి . మొబైల్ వినోద సాధనం కాదు . అవసరాలకోసమే వాడండి
3. హేట్ కంటెంట్ ను బ్లాక్ చెయ్యండి .
గుర్తు పెట్టుకోండి .. హేట్ కంటెంట్ మైరావణుడు . నీవు దాన్ని విమర్శిస్తూ.. తిడుతూ కామెంట్ చేస్తే అదే దానికి రెవిన్యూ అవుతుంది .
4. విర్చువల్ లోకం నుండి బయటకు రండి . నిజమయిన బతుకులు బతకండి . కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితులతో సహ- ఉద్యోగులతో కాలం గడపండి . అవతలి వ్యక్తిని అర్థం చేసుకోండి . సహానుభూతి ని అలవర్చుకోండి . నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించండి .
5. మనిషిని మనిషి ద్వేషించడానికి కారణాలు ఎన్నో . కానీ సాటి మనిషని ప్రేమించడానికి కారణం ఒక్కటే .. ఆ వ్యక్తి నీలాగే మనిషి . టైం స్పేస్ లేని ఈ అనంత విశ్వములో నీ దగ్గర గా ఉన్న .. నీ సమకాలికుడు .
పక్కాడిని అకారణంగా ద్వేషిస్తే .. మండేది నీ చితే..
తన కోసమే తన శత్రువు .. తన శాంతమే తనకు రక్ష.. దయయు చుట్టంబు .. తన సంతోషమే స్వర్గం .. తన దుఖ్ఖమే నరకం .
బతకడం నేర్చుకోండి ..
సొల్లు ఫోన్ మంటల్లో మాడి మసై పోవద్దు .
“అప్పట్లో సోషల్ మీడియా అలోగరిథమ్ దెబ్బకు పోయిన వ్యక్తి” .. అని నీ సమాధి పై ఎవరో రాసే స్థితిని కొని తెచ్చుకోవద్దు!
కావాలి డిజిటల్ స్మార్ట్నెస్ !
సర్వే జనా సుఖినోభవంతు !