-మొక్కజొన్న కొనే దిక్కులేక కొనుగోలు కేంద్రం వద్ద రైతు మృతి
– అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు వదలాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద జమ్మన్న అనే రైతు గుండెపోటుతో మరణించిన ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నాలుగు రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్నా, ప్రభుత్వం మొక్కజొన్న పంటను కొనకపోవడంతో మనస్తాపానికి గురై జమ్మన్న ప్రాణాలు కోల్పోయారని, ఈ నిండు ప్రాణం బలి కావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పూర్తి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో గడిచిన పదేళ్లపాటు సంతోషంగా సాగిన సాగును రెండేళ్లలోనే కాంగ్రెస్ పార్టీ కన్నీటి సేద్యంగా మార్చిందని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి రెండేళ్ల పాలనలో ఇప్పటివరకు 750 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓవైపు రైతుబంధు వంటి పెట్టుబడి సాయం అందక రైతులు అప్పుల పాలవుతుంటే, మరోవైపు భారీ వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతులకు కనీస పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం వారిని బలవన్మరణాల వైపు నెట్టివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పనికిరాని యాప్ల పేరుతో యూరియా అందకుండా చేసి అన్నదాతలను అష్టకష్టాల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన ఈ పాపం ఊరికే పోదని కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి చూస్తున్న రైతుల కష్టాలను వెంటనే తీర్చాలని కోరారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో మరణించిన రైతు జమ్మన్న కుటుంబానికి తక్షణమే 25 లక్షల రూపాయల పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.