– రంగా ఆశయాలు కొనసాగిస్తా
– మాపై రాజకీయాలు చేస్తే ఖబడ్దార్
– ‘రంగానాడు’ను మూడుసార్లు ఎందుకు మార్చారు?
– అధికారం అడ్డుపెట్టుకుని రంగానాడును మారుస్తారా?
– వ చ్చిన జనాలను బెదిరించి పంపేస్తారా?
– మమ్మల్ని భయపెడితే భయపడం
– ఒకరిని భయపెడితే వందమందిని లేచి వస్తాం
– నేను ఆడపిల్లను.. సాఫ్ట్‌గా ఉంటాననుకోవద్దు
– రంగా బిడ్డనని గుర్తుంచుకోండి
– ఇంకా బలమైన పోరాటాలతో కదులుతాం
– కృష్ణా జిల్లాకు రంగా పేరెందుకు పెట్టరు?
– వైసీపీ, టీడీపీ, జనసేన జవాబు చెప్పాలి
– మా నాన్న ఫొటోను అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి
– మరి నాన్నకు ఎందుకు గుర్తింపు ఇవ్వరు?
– విశాఖ ‘రంగానాడు’లో కూతురు వంగవీటి ఆశాలత గర్జన
– హాజరైన బీజేపీ ఎంపి ఆర్.కృష్ణయ్య, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
– రంగా కొడుకు వంగవీటి రాధా గైర్హాజరు.. వంగవీటి శంతన్‌కుమార్ హాజరు
(మార్తి సుబ్రహ్మణ్యం)
వంగవీటి కుటుంబం నుంచి మరో వారసురాలు తెరపైకొచ్చి.. విశాఖ తీరాన సింగగర్జన చేసింది. ‘‘నా తండ్రి వంగవీటి రంగా ఆశయాలను కొనసాగిస్తా. రాధా-రంగా మిత్రమండలిని బలోపేతం చేయటమే ఇకపై నా లక్ష్యం. మమ్మల్ని ఎవరూ భయపెట్టలేరు. నేను టైగర్ రంగా బిడ్డను. ఇది రంగా బ్లడ్. రంగా పౌరుషం. మాపై రాజకీయాలు చేస్తే సహించేది లేదు. అధికారం అడ్డుపెట్టుకుని కొన్ని అరాచకశక్తులు మా సభను వారంలో మూడుచోట్లకు మార్చారు. వచ్చిన జనాలను వెనక్కి పంపించారు. వారి ఆటలిక చెల్లవు. మమ్మల్ని ఒకరిని అడ్డుకుంటే వందమంది లేచి వస్తాం.’’ అని రంగా బిడ్డ ఆశాలత విశాఖ రంగానాడు వేదికపై చేసిన సింహగర్జన ఆసక్తికరంగా మారింది.
నిజానికి ఈ సభకు లక్షమంది వస్తారని ప్రచారం జరిగింది. అయితే వేదికను మూడుసార్లు మార్చడంతో గందరగోళం నెలకొంది. దానితో ఆశించినంత మంది జనం కనిపించలేదు. అయితే రంగా కూతురు ఆశాలత ప్రసంంగాలు, రాజకీయాలకు కొత్త అయినప్పటికీ తొలివేదికపై చేసిన భావోద్వేగ ప్రసంగం బాగానే ఆకట్టుకుంది.
వేదికపై నుంచి ఎవరినీ, ఏ పార్టీనీ, ఏ కులాన్నీ పేరు పెట్టి విమర్శించకపోగా.. తాను రంగా వారసురాలినన్న భావన కలిగించే ప్రసంగం చేయడం ప్రస్తావనార్హం. రంగా వర్ధంతి సందర్భంగా విశాఖలో రాధా-రంగా మిత్రమండలి, రాయల్స్ నిర్వహించిన రంగానాడు సభలో వంగవీటి ఆశాలత నదురు బెదురు లేకుండా మాట్లాడిన అంశాల్లో.. కృష్ణా జిల్లాకు రంగా పేరు ఎందుకు పెట్టడం లేదని, తన తండ్రి ఫొటో వాడుకునే పార్టీలు ఆయనకు ఆరకంగా ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదని నిలదీయడం విశేషం. ఇక టీడీపీ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరుకాకపోయినా.. బీజేపీ ఎంపి, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, స్ధానిక బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత నేత విష్ణుకుమార్‌రాజు హాజరవడం గమనార్హం.
వంగవీటి ఆశాలత ఇంకా ఏమన్నారంటే.. మాకు పార్టీలు- కులం-మతం లేదు. అన్ని కులాలు, మతాలూ మా రంగా-రాధా మిత్రమండలిలో ఉన్నారు గుర్తుంచుకోండి. 37 ఏళ్ల క్రితం పేదల కోసం పోరాడుతున్న మహనీయుడు వంగవీటి రంగాను నిరాయుధిడిని చేసి చంపేశారు. ఆయనతోపాటు మురళి, దీక్షితులుతోపాటు రాష్ర్డవ్యాప్తంగా 42 మందిని చంపేశారు. వారికి నా నివాళులు.
తాను బయటకు వెళితే చంపేస్తారని తెలిసినా రంగా ఎప్పుడూ భయపడలేదు. ఎందుకంటే ఆయన ప్రజలే నా శ్వాస అనుకున్నారు. మరి పేదలకోసం అంత చేసిన రంగాకు ఆ స్ధాయిలో గుర్తింపు వచ్చిందా? ఎన్నికలప్పుడు ప్రతి పార్టీ వాళ్లు రంగా ఫొటో పెట్టుకుని ఓట్లు అడగటానికి వస్తారు. వాళ్లను ఇప్పుడు నేను నిలదీసి అడుగుతున్నా. రంగా గారి కోసం మీరేం చేశారు? వైసీపీ, టీడీపీ, జనసేనను అడుగుతున్నా. రంగా కోసం మీరేమైనా చేశారా? రంగా ఫొటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు.
ఇవాళ మేం అడుగుతున్నాం. రంగాపేరు కృష్ణా జిల్లాకు పెట్టమని మూడేళ్ల నుంచి అడుగుతున్నాం. ఏం చేశారు మీరు? ఎప్పుడు కదలివస్తారు? ఎప్పుడు రంగాకు గుర్తింపు ఇస్తారు? నేను రంగా కూతురిగా కాదు. రంగా అభిమానిగా మిమ్మల్ని నిలదీస్తున్నా. రంగాపేరు కృష్ణా జిల్లాకు ఎప్పుడు పెడతారు?
కొన్ని అరాచకశక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ అవుతుందేమోనని అధికారం అడ్డుపెట్టుకుని, మూడుసార్లు వేర్వేరు చోట్లకు మార్చారు. వచ్చిన జనాలను రావద్దని చెప్పి భయపెట్టారు. నేనొకటే చెబుతున్నా. రంగా అభిమానులను ఎవరూ భయపెట్టలేరు. రాధా-రంగా మిత్రమండలిని ఎవరూ భయపెట్టలేరు. ఒకరిని భయపెడితే వందమందిని లేచివస్తాం. గుర్తుంచుకోండి. మేం ఎలాంటి వర్గ పోరాటానికి రాలేదు. మంచి పనిచేయడం కోసం వచ్చాం. రంగా పేరు ముందుకు తీసుకువెళ్లడానికి వచ్చాం. కానీ మీరు మాపై అడ్డమైన రాజకీయాలు చేస్తే సహించేది లేదు. గుర్తుంచుకోండి.
ఆడపిల్లను. సాఫ్ట్‌గా ఉంటాను. గర్జించను అనుకోకండి. ఇక్కడ ఉంది రంగా బ్లడ్. రంగా పౌరుషం. నిలదీసేందుకు సిద్ధంగా ఉంటాం. పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ప్రజాపోరాటాల్లో రంగా సజీవంగా ఉంటారు.
మా పెద్దనాన్నగారు పోయిన తర్వాత బడుగు బలహీనవర్గాల కోసం, పేదల కోసం మా నాన్న రంగా ఈ ముళ్లకిరీటం మీద పెట్టుకున్నారు. ఆయనకు తెలుసు. ఇది పూలబాట కాదని. ఈ ప్రయాణంలో ఆయన ప్రాణం పోతుందని కూడా తెలుసు. ఆయన దేనికీ లెక్క చేయలేదు. ప్రజల కోసమే జీవించారు. ప్రజల కోసమే ప్రాణాలు వదిలారు.
కష్టాలు- కనీళ్ల నుంచి పుట్టింది రాధా-రంగా మిత్రమండలి. ఆయనకు యుఐ, రాధా-రంగా మిత్రమండలి ఒక ఫోర్సుగా ఉండేవి. రంగా ఒక టైగర్. ఆయన రక్తం పంచుకుని పుట్టడమే నా అదృష్టం. రంగా చనిపోతూ మా కోసం వసుధైక కుటుంబాన్ని వదిలి వెళ్లారని ఇప్పుడనిపిస్తోంది. మీరు నమ్మిన రంగాను గుండెల్లో పెట్టుకున్న మీ కోసం నేను ఏమైనా చేస్తా.
రంగా కొడుకు రాధా గైర్హాజర్
కాగా వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా, విశాఖలో రాధా-రంగా మిత్రమండలి-రాయల్స్ నిర్వహించిన సభకు.. రంగా కుమారుడు వంగవీటి రాధా గైర్హాజరవడం చర్చనీయాంశమయింది. సభకు హాజరుకావాలని నిర్వహకులు ఆయనను ఆహ్వానించినప్పటికీ, చెల్లితో వేదిక పంచుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వంగవీటి సోదరుడి కుమారుడయిన వంగవీటి శంతన్‌కుమార్ మాత్రం సభకు హాజరవడం విశేషం. కాగా ఈ సభకు ముందు కాపు వర్గాలు-రంగా అభిమానుల్లో ఒక ప్రచారం విస్తృతంగా జరిగింది. ‘‘రంగానాడుకు హాజరయ్యే కుటుంబసభ్యులే రంగాకు నిజమైన వారసుల’’న్న ప్రచారం జరిగిన నేపథ్యంలో.. రంగా కుమార్తె ఆశాలత హాజరుకావడంతో, ఇక రంగా వారసులు కూతురేనన్న చర్చకు రంగానాడు వేదికయింది.
బీజేపీ నేతల హాజరుపై ఆశ్చర్యం
కాగా రంగానాడు సభకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలనూ ఆహ్వానించినా, ఎవరూ హాజరుకాలేదు. జనసేన అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కనీసం వాల్‌పోస్టర్ విడుదల చేయించాలన్న ప్రయత్నాలు కూడా ఫలించలేదు. పార్టీల నుంచి ఎలాంటి ఆదేశాలు-అనుమతులు లేకపోవడంతో టీడీపీ-వైసీపీ-జనసేన నుంచి ఎవరూ హాజరుకాలేదు.
అయితే విచిత్రంగా బీజేపీ నుంచి ఇద్దరు ప్రజాప్రతినిధులు హాజరుకావడంతో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. బీజేపీ ఎంపి, బీసీ నేత ఆర్.కృష్ణయ్య, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు హాజరవడంతో.. సహజంగానే రంగానాడుకు బీజేపీ మద్దతు ఉందని భావించక తప్పదు. నిజానికి ఇలాంటి సభలకు.. పార్టీ నాయకత్వం అనుమతి-ఆదేశాలు లేనిదే, ఆ పార్టీ ప్రతినిధులు హాజరుకారన్నది బహిరంగ రహస్యమే. పైగా రంగా వ్యవహారం. ఆపై సభ జరుగుతున్నది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సొంత జిల్లాలో. ఆ క్రమంలో కూటమిలో మిత్రపక్షమైన బీజేపీ నుంచి ఏకంగా ఒక ఎంపి, ఒక ఎమ్మెల్యే హాజరయ్యారంటే.. భవిష్యత్తులో రంగా కుమార్తె ఆశాలతకు బీజేపీ బాసటగా నిలుస్తుందన్న సంకేతాలు వెళ్లేందుకు కారణమయింది.
రంగా కుటుంబానికి అండగా ఉంటా
రంగా కుమార్తె ఆశాకిరణ్‌తో పాటు కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉండి వారి ఉద్యమాలకు పూర్తి మద్దతిస్తామని బీసీ సంఘం నాయకుడు, బీజేపీ ఎంపి ఆర్.కృష్ణయ్య అన్నారు. తాను బీసీల కోసం ఉద్యమం చేస్తే రంగా అండగా నిలబడ్డారన్నారు.
నా గెలుపునకు రాధా ఎంతో కృషి చేశారు
ఉత్తర నియోజకవర్గ బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. వంగవీటి మోహనరంగాకు నివాళులర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ బహిరంగ సభకు ఆటంకాలు వచ్చాయని తెలిసి, ఇబ్బందులు లేకుండా తన వంతు ప్రయత్నం చేశానన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రంగా కుమారుడు రాధా తన గెలుపునకు ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు.
త్వరలో రంగా రాజ్యం
రాధా రంగా రాయల్ అసొసియేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ మాట్లాడుతూ రామరాజ్యం, రాజన్న రాజ్యం చూశారని, త్వరలో రంగా రాజ్యం చూస్తారన్నారు. ఉత్తర నియోజకవర్గంలో రంగా విగ్రహం ఏర్పాటు చేశామంటే ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కృషి ఎంతో ఉందన్నారు.
కార్యక్రమంలో వంగవీటి శంకర్ కుమార్, మున్నూరు కాపు గ్లోబల్ చైర్మన్ రజనీకాంత్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య తదితరులు ప్రసంగించారు.
మాజీ కార్పొరేటర్ పీలా ఉమారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ, కాపు సంఘాల నాయకులు లక్ష్మణ్ పటేల్, గుర్రం శ్రీనివాస్, కర్రి వెంకటరమణ, సత్యారెడ్డి, జగత్ శ్రీనివాస్, ముత్యం సతీష్, పీలా వెంకటలక్ష్మి, దినకర్, సుంకరి అప్పారావు, గుడివాడ ప్రభాకర్, తుర్లపాటి సురేష్, బొగ్గు శ్రీను, సిపాని శ్రీనుబాబు, వంగవీటి రాజా పాల్గొన్నారు.