హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కు అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. 2026 జనవరి 9 నుండి 11 వరకు దుబాయ్‌లో జరగనున్న ‘2వ అంతర్జాతీయ జునికార్న్ అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్’లో గౌరవ అతిథిగా పాల్గొనవలసిందిగా ఆయనను ఆహ్వానించారు. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాల్లో కేటీఆర్ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ ఆహ్వానం పంపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాలలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లాభాపేక్ష లేని సంస్థ ‘ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్’ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 100 మందికి పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు, యువ ఆవిష్కర్తలు పాల్గొననున్నారు. ముఖ్యంగా ‘జునికార్న్ 100కే’ చొరవ ద్వారా గ్రామీణ యువతలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది.
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి ఇన్నోవేషన్, స్టార్టప్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని, సాంకేతికత ఆధారిత పాలన, అందరినీ కలుపుకొనిపోయే వృద్ధి కోసం ఆయన చేసిన నిరంతర కృషి పంచుకోవాలని కెటిఅర్ కు పంపిన ఆహ్వానంలో నిర్వహకులు పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై కేటీఆర్ భాగస్వామ్యం యువ ఆవిష్కర్తలకు స్ఫూర్తినిస్తుందని, అలాగే తెలంగాణ ఇన్నోవేషన్ మోడల్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని ఆశించారు.