– పెండింగ్‌లో ఉన్న అన్ని అంగన్వాడీ భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తాం
– బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కల్పించండి
– అంగన్వాడీలకు సెల్ ఫోన్ పంపిణీ చేసిన మంత్రి సవిత
పెనుకొండ: భావితరాల పిల్లల భవిష్యత్ ఆరోగ్యానికి పునాది అంగన్వాడీలని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 459 మంది అంగన్వాడీ వర్కర్లకు 5జీ సామ్సంగ్ ఫోన్లను అందచేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 57 మంది అంగన్వాడీ మినీ వర్కర్లను మెయిన్ వర్కర్‌గా ఉన్నతీకరించారు. వారికి ధ్రువీకరణ పత్రాలు మంత్రి సవితమ్మ అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లను పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. అంగన్వాడీలు ప్రతి రోజూ బాల సంజీవని, పోషణ్ ట్రాకర్, మాతృవందన యోజన తదితర యాప్‌లలో పిల్లల పోషణ, బరువు, ఎత్తు కొలతలు వంటి వాటిని నమోదు చేయాలన్నారు.
పిల్లలకు మరో తల్లిలాగా అన్నీ నేర్పేది అంగన్వాడీలేనన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అన్ని అంగన్వాడీ భవనాలను పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా బాల్య వివాహాలపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించి బాల్య వివాహాలను అరికట్టాలని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ICDS అధికారులు, నియోజకవర్గంలోని అంగన్వాడీలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.