– సాయి మృతి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీకి తీరనిలోటు
– పిన్నమనేని సాయిబాబాకు నందమూరి రామకృష్ణ నివాళి
– సాయిబాబా క్రమశిక్షణ గల సైనికుడు: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్
-ఒక మిత్రుడిని కోల్పోయా: మాజీ మంత్రి తలసాని నివాళి
– స్నేహశీలిని కోల్పోయా: ఎమ్మెల్యే ముఠా గోపాల్
– టీడీపీ సీనియర్ నే త సాయిబాబాకు టీడీపీ, బీఆర్ఎస్ నేతల నివాళి
హైదరాబాద్: టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా మృతిపై పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం బేగంపేటలోని ఆయన నివాసానికి తరలివెళ్లిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, సాయిబాబా మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన భౌతికకాయం వద్ద జోహార్పు అర్పించారు.
నందమూరి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ కార్యాలయ ఇన్చార్జి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, అమర్నాథ్, అరవిందకుమార్ గౌడ్, బక్కని నర్శింహులు, కొమ్మినేని సాయి వికాస్, శ్రీపతి సతీష్, అశోక్, నందమూరి సుహాసిని, నగర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్, టీడీపీ సీనియర్ నేతలు నైషధం సత్యనారాయణ మూర్తి, మండూరి సాంబశివరావు, కొత్త రామారావు, బాలరాజ్‌గౌడ్, పరశురాం, భవానీ శ్రీనివాస్, రాము, రాజాచౌదరి, విజయశ్రీ, లోకేష్‌యాదవ్, రవీంద్రాచారి, మల్లారెడ్డి, శాంతి, రాజు, శ్యాంసుందర్, వినోద్, భాను తదితరులు పాల్గొన్నారు.
నేడు అంతిమయాత్ర
కాగా సాయిబాబా భౌతికకాయాన్ని సోమవారం ఎన్టీఆర్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న టీడీపీ నగర కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్ధం 10 నుంచి 12 గంటల వరకూ ఉంచనున్నట్లు టీడీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్ వెల్లడించారు. అక్కడి నుంచి అంబర్‌పేట శ్మశానవాటికకు తీసుకువెళతారని చెప్పారు.
సాయిబాబా మృతి మా కుటుంబానికి తీరనిలోటు: నందమూరి రామకృష్ణ
టీడీపీ సీనియర్ నేత సాయిబాబు మృతి తమ కుటుంబానికి, ఎన్టీఆర్ అభిమానులకు తీరనిలోటని నందమూరి రామకృష్ణ నివాళి అర్పించారు. నందమూరి కుటుంబానికి సాయిబాబా నిజమైన విశ్వాసపాత్రుడన్నారు. ‘‘ నాన్నగారు చెన్నైలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడయిన సాయి తరచూ వచ్చేవారు. నాన్న గారి పాత్రలపై చర్చించేవారు. తమిళ్లో శివాజీ గణేశన్ చేసిన పాత్ర మీరు చేస్తే బాగుండేదని సలహా ఇచ్చేవారు. నాన్న గారి దర్శక-నిర్మాతలు కూడా సాయిని ఎంతో అభిమానించేవారు. నాన్నగారికి సాయి అంటే పుత్రవాత్సల్యం. మా ంటే ఆయనను ఎక్కువగా చూసుకునేవారు. సాయి కూడా ఎన్టీఆర్ అంటే ప్రాణం పెట్టేవారు. ఏ విషయంపైనయినా సరే నాన్నగారితో ధైర్యంగా మాట్లాడేవారు. పార్టీ అధికారం-ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాయి ప్రకటనలు రాసి నాన్నగారికి ఇచ్చేవార’’ని రామకృష్ణ ఆనాటి అనుభవాలను కార్యకర్తలతో పంచుకున్నారు. ఎన్టీఆర్ సినిమా విడుదలయిన రోజు సాయిబాబు ఆనందోత్సాహం చెప్పనలవి కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన సాయిబాబా కుటుంబసభ్యులను పరామర్శించి, తన సానుభూతి వ్యక్తం చేశారు.
స్నేహితుడిని కోల్పోయా: తలసాని
సాయిబాబా మృతి తనను కలచివేసిందని, కొన్నేళ్లపాటు తమ అనుబంధం కొనసాగిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ నివాళి అర్పించారు. సాయిబాబా కుటుంబసభ్యులను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. సాయిబాబా తనకు ఆప్తమిత్రుడని, తాము గతంలో ఒకేపార్టీలో ఉన్నప్పుడు ఆయన సేవలు తాను స్వయంగా చూశానన్నారు. మంచి వక్త, విషయ పరిజ్ఞానం గల మిత్రుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన సాయిబాబాతో తన అనుభవాలు పంచుకున్నారు.
టీడీపీ-ఎన్టీఆర్ అభిమానులకు తీరని లోటు: టిడి జనార్దన్
సాయిబాబా మృతి యావత్ టీడీపీ పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులకు తీరనిలోటని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ నివాళి అర్పించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి అన్నగారికి వీరభక్త హనుమాన్‌లా పనిచేసిన సాయిబాబా సేవలు చిరస్మరణీయమని నివాళులర్పించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, సాయిబాబా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రధానంగా గండిపేట ఆశ్రమంలో పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరాల్లో సాయిబాబా చురుకుగా వ్యవహరించేవారన్నారు. ఈ సందర్భంగా ఆయన సాయిబాబా కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
స్ఫూర్తిప్రదాత సాయి: మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి
నిత్యం చుట్టూ కార్యకర్తలతో ఉత్సాహంగా కనిపించే సాయిబాబు అందరికీ స్ఫూర్తిప్రదాత అని మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ ఉండగా, చంద్రబాబు పార్టీ అధ్యక్షుడయిన తర్వాత తామిద్దరం నగర పార్టీలో కలసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్ధులపై విరుచుకుపడటంలో సాయిబాబా శైలి ప్రత్యేకమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వికలాంగ సహకార సంస్థ చైర్మన్‌గా ఉన్నప్పుడు వేలాదిమంది వికలాంగుల సంక్షేమం కోసం అవిరళ కృషి చేశారని కొనియాడారు.
మిత్రుడిని కోల్పోయా: ఎమ్మెల్యే ముఠా గోపాల్
సాయిబాబా మృతి వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ విచారం వ్యక్తం చేశారు. సాయి-తాను-సాయన్న కొన్ని దశాబ్దాల పాటు ముషీరాబాద్‌లో కలసి పనిచేశామని, ఎన్టీఆర్ సినిమాలు విడుదలయినప్పుడు సాయి చేసే హడావిడి, కనబరిచే ఉత్సాహం తనకు ఇంకా గుర్తేనన్నారు. సాయి చురుకైన చిత్తశుద్ధి, అంకితభావం గల కార్యకర్త అన్నారు.
సాయి ఒక చెతన్య స్ఫూర్తి: మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
సాయిబాబు ఒక చైతన్యస్ఫూర్తి అని, టీడీపీ కుటుంబంలో అందరికీ ఆత్మీయుడైన సాయిబాబు మృతి అందరినీ కలచివేసిందని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన నివాళి అర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సాయిబాబు మరణం టీడీపీకి తీరని లోటన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అందరికీ తలలోనాలుకలా ఉండే అజాతశత్రువైన సాయిబాబా ఇకలేరని తలచుకుంటేనే బాధగా ఉందన్నారు.
సాయిలేని లోటు పూడ్చలేనిది: కొమ్మినేని సాయి వికాస్
సాయిబాబా లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఎక్కడుంటే అక్కడ సందడి. కార్యకర్తలు ఉంటే ఆయనకు ఎక్కడలేని ఉత్సాహం. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అంటే ఆయన ప్రాణం. ఎన్టీఆర్‌తో ఆయన అనుబంధం అనంతం. తనతో పాటు కొన్నేళ్లు టీడీపీ రాష్ట్ర రిసెప్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన సాయిబాబా ఇక లేరంటే, నమ్మశక్యంగా లేదని సీనియర్ నేత కొమ్మినేని సాయి వికాస్ నివాళి అర్పించారు. తాను-సాయిబాబు-పొగాకు యాదగిరి రిసెప్షన్ కమిటీ సభ్యులుగా ఉన్నప్పటిరోజులను వికాస్ గుర్తు చేసుకున్నారు.