– హామీలు ప్రశ్నిస్తే తిట్టే సీఎంను ఇప్పుడే చూస్తున్నాం
– కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి తలసాని ఫైర్
– మీ శ్రీనన్న ఎప్పుడూ జనంపక్షమే
– బీఆర్ఎస్లో భారీ చేరికలు
హైదరాబాద్: మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారంలో కి వచ్చేది కేసీఆర్ నాయకత్వంలోని బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వమేనని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్టలో మనోహర్ యాదవ్, అతని అనుచరులు సుమారు 100 మంది ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.
వారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కండువాలు కప్పి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు డప్పు చప్పుళ్ళు, బాణసంచాతో ఘన స్వాగతం పలికారు. స్థానికంగా బి ఆర్ ఎస్ పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించి పావురాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి తెలంగాణ ను దేశానికే ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. కానీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు అవుతున్నా హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా బజారు బాష మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు ఆ బాష ను అసహించుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని బూతులతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ల క్రింద నూతన దుస్తులు, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్, క్రిస్మస్ విందులు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవేమి చేయడం లేదని విమర్శించారు. మహిళలకు 2500 రూపాయలు, వికలాంగులకు 6 వేల రూపాయల పెన్షన్, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని నేటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఇక్కడి నుండి ఎమ్మెల్యే గా గెలిచి ముఖ్యమంత్రి గా పని చేసిన మర్రి చెన్నారెడ్డి హయాంలో కూడా అభివృద్ధి జరగలేదని చెప్పారు. కోట్లాది రూపాయల వ్యయంతో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ లైన్ ల ఏర్పాటు, త్రాగునీటి సమస్య పరిష్కారం వంటివి అనేకం చేయడం, జరిగిందని, కండ్ల ముందు కనిపిస్తున్నాయని వివరించారు.
ఎవరికి ఏ కష్టమొచ్చినా, అవసరమొచ్చినా శ్రీనన్న ఉన్నాడనే నమ్మకం, భరోసా ను నియోజకవర్గ ప్రజలకు కల్పించాన నని అన్నారు. ఎప్పటికి నియోజకవర్గ ప్రజలకు, పార్టీ సభ్యులకు అండగా ఉంటానని ప్రకటించారు. ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన మనోహర్ యాదవ్, అతని అనుచరులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు. మనోహర్ యాదవ్ తో పాటు అరుణ్, శ్రవణ్, రత్నాకర్, రాజేష్ తదితరులు పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, కిరణ్మయి, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, కిషోర్, కోటేశ్వర్ గౌడ్, సతీష్, ఆంజనేయులు, గణేష్, నాగులు, శ్రీహరి, మల్లేష్, మిట్టు, అరుణ్ భట్ తదితరులు ఉన్నారు.