– భక్తుల కోలాహలం నుండి జాతీయ మీడియా విశ్లేషణల వరకు!
( ఒక విశ్లేషణ)
అయోధ్య రామమందిర రెండో వార్షికోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సందర్శన కేవలం ఒక ముఖ్యమంత్రి పర్యటన మాత్రమే కాదు.. మారుతున్న భారత రాజకీయ ముఖచిత్రానికి ఒక నిదర్శనం.
ఈ పర్యటనలో అత్యంత ఆసక్తికరమైన అంశం.. ఆలయ ప్రాంగణంలో ఉన్న సామాన్య భక్తుల ప్రతిస్పందన. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపట్టడం విశేషం.
సాధారణంగా దక్షిణాది నేతలకు ఉత్తరాది పల్లెటూరి ప్రజల్లో గుర్తింపు తక్కువగా ఉంటుంది. కానీ, అయోధ్యలో భక్తులు ఆయనను “హైటెక్ సిటీ వాలా సీఎం” అని, “మోదీజీ కే మిత్ర” అని సంబోధించడం కనిపించింది.
భద్రతా వలయాన్ని దాటుకుని మరీ భక్తులు ఆయనతో ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపడం, ఆయన అనుభవానికి లభించిన గౌరవంగా భావించవచ్చు. ఇది జాతీయ మీడియాలోని నయా జర్నలిస్టులను ఆశ్చర్యపరిచింది.
జాతీయ మీడియా (The Hindu, Indian Express, NDTV) ఈ పర్యటనను కేవలం ఆధ్యాత్మిక పర్యటనగా కాకుండా రాజకీయ ఎత్తుగడగా విశ్లేషించింది.
ఎన్డీయే (NDA) కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, బీజేపీ అజెండాతో మమేకమవుతున్నారనే సంకేతాన్ని పంపడంలో సఫలమయ్యారని మీడియా పేర్కొంది.
హైటెక్ సిటీ నిర్మాతగా పేరున్న నాయకుడు ఇప్పుడు ‘హిందూత్వ’ బాట పట్టడం ఒక పెద్ద మార్పుగా (Shift) విశ్లేషించారు.
“ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు, ఆధునిక భావాలున్న వ్యక్తి ఇలా సంప్రదాయబద్ధంగా రాముడిని దర్శించుకోవడం మాకు సంతోషంగా ఉంది” అని హర్యానాకు చెందిన ఒక యాత్రికుడు జాతీయ మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇక సోషల్ మీడియా వేదికలైన X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ పర్యటనపై భిన్నమైన, లోతైన చర్చలు నడిచాయి.
#ChandrababuNaidu, #Ayodhya, #RamMandir వంటి ట్యాగ్లు ఆ రోజు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు గతంలో చంద్రబాబును ప్రశంసించిన సందర్భాలను గుర్తుచేస్తూ ఈ పర్యటన వీడియోలు వేలల్లో రీట్వీట్లు పొందాయి.
“బీజేపీకి అత్యంత విశ్వసనీయమైన మిత్రుడు” అనే ట్యాగ్‌తో ఉత్తరాది నెటిజన్లు బాబు పర్యటన వీడియోలను పెద్ద ఎత్తున షేర్ చేశారు.
“విజనరీ నాయకుడు చివరకు వాస్తవాన్ని (రామరాజ్యం) గుర్తించారు” అంటూ కొందరు కామెంట్ చేయగా, మరికొందరు దీనిని “వ్యూహాత్మక రాజకీయ అడుగు”గా అభివర్ణించారు.
ఇక్కడో విషయాన్ని తెలుగు మీడియాకు గుర్తు చేయాలి. రామరాజ్యం రావాలి అంటే రామారావు రావాలి అనే స్లోగన్ తెలుగుదేశం ఆవిర్భావం సందర్భంగా ఎన్నికల నినాదం అనే విషయం ప్రస్తుత జాతీయ మీడియాలోని జర్నలిస్టులకు తెలియని విషయం.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తరాది హ్యాండిల్స్ నుండి చంద్రబాబు గారికి మద్దతు లభించడం, ఆయన జాతీయ స్థాయి ఇమేజ్ పెరిగిందనడానికి సంకేతం.
చంద్రబాబు నాయుడు అంటే మనకు గుర్తొచ్చేది కంప్యూటర్లు, ఐటీ కంపెనీలు. కానీ అయోధ్యలో ఆయన చేసిన “రామరాజ్యమే అత్యుత్తమ పాలన” అనే వ్యాఖ్య ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఉత్తరాది ప్రజలు ఆయనను సాదరంగా ఆహ్వానించడం చూస్తుంటే, ఆయన ప్రభావం కేవలం ఆంధ్రాకే పరిమితం కాదని అర్థమవుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకునే నాయకుడికి హిందూ సెంటిమెంట్ తోడైతే వచ్చే బలం అపారం.
ఒక సీనియర్ జర్నలిస్ట్ కోణంలో చూస్తే, చంద్రబాబు నాయుడు గారు అత్యంత చాకచక్యంగా ‘డెవలప్మెంట్’ మరియు ‘ధర్మ’ అనే రెండు డీడీ పట్టాల మీద తన రాజకీయ బండిని నడిపిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.
“రామరాజ్యమే పరిపాలనకు బెంచ్‌మార్క్” అనడం ద్వారా ఆయన తన పాత ‘టెక్నోక్రాట్’ ఇమేజ్‌కు ఒక ‘సాంస్కృతిక రక్షణ కవచాన్ని’ ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల రాష్ట్రంలో.. దేశంలో స్వపక్ష విపక్షాలు ఆయనపై వేసే రకరకాల మతపరమైన విమర్శలకు పరోక్షంగా చెక్ పడింది అనే చర్చ కూడా మొదలైంది.
యోగి ఆదిత్యనాథ్ పాలనను మెచ్చుకోవడం ద్వారా, భవిష్యత్తులో ఉత్తరాది రాష్ట్రాల మద్దతును కూడగట్టే దిశగా అడుగులు వేశారు అని కొందరు విశ్లేషించారు. ఒక విధంగా అతివాద వారి మనసులు కూడా చల్లబడ్డాయి అని చర్చ జరుగుతోంది.
అయోధ్య సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని స్పష్టం చేశారు: ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమైన నాయకుడు కాదు, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగల ‘స్టేట్స్‌మన్’ అని, భక్తుల నుండి లభించిన ఆత్మీయత, సోషల్ మీడియాలో వచ్చిన సానుకూలత ఆయన రాజకీయ ప్రయాణంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయనడంలో సందేహం లేదు.
అలాగే రామారావు నటించిన లవకుశలో “రామన్న రాముడు కోదండరాముడు
శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్…సీతమ్మ తల్లితో వచ్చాడురా
నెల మూడు వానలు కురిసేనురా…బంగారు పంటలు పండేనురా
కష్టజీవుల వెతలు తీరేనురా..బీదా సాద బ్రతుకు మారేనురా” అని పాట పెట్టారు.
రామారావు శ్రీరాముడిగా వేసిన గెటప్పులు మనతో పాటు చంద్రబాబును కూడా ప్రభావితం చేసింది. ఇవన్నీ అయోధ్యకు ముందే అని ఈ తరం జర్నలిస్టులకు తెలియకపోవచ్చు.
అటు ‘వికాసం’ (అభివృద్ధి), ఇటు ‘విశ్వాసం’ (ఆధ్యాత్మికత) రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సాగిస్తున్న ఈ ప్రయాణం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా కొత్త చర్చలకు దారితీస్తోంది. టెక్నోక్రాట్ నుండి రామరాజ్య కాంక్షితుడిగా ఆయన మారుతున్న తీరు భవిష్యత్ రాజకీయాల్లో ఏ తీరాలకు చేరుస్తుందో వేచి చూడాలి.
ఏది ఏమైనా.. టెక్నాలజీతో ప్రపంచాన్ని గెలిచిన బాబు, ఇప్పుడు భక్తితో దేశాన్ని పలకరిస్తూ పులకరింపజేస్తున్నారు.