ఎన్నడూ లేని విధంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. సాధారణంగా ఇంతటి రద్దీ ఉన్నప్పుడు అలజడి కనిపిస్తుంది. కానీ, ఇక్కడ ఆశ్చర్యకరంగా క్యూలైన్లలో భక్తుల మొహాల్లో నిశ్చలమైన ప్రశాంతత గోచరిస్తోంది. గంటల తరబడి వేచి ఉన్నా, ఎంతో క్రమశిక్షణతో, రామనామ స్మరణతో భక్తితో వేచి ఉండటం ఇటీవలి కాలంలో మనం చూడని ఒక అరుదైన దృశ్యం.
16వ శతాబ్దంలో చోళ మరియు విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన ఈ అద్భుత కట్టడం, శిల్పకళా సౌందర్యానికి నిలయం. మహాకవి బమ్మెర పోతన తన ‘ఆంధ్ర మహాభాగవతాన్ని’ ఈ రామయ్య సన్నిధిలోనే రచించారు. దీనికి గుర్తుగా ఆలయంలో ఆయన విగ్రహాన్ని నేటికీ మనం దర్శించుకోవచ్చు.
ఇక్కడ సీతా, రామ, లక్ష్మణుల విగ్రహాలు ఒకే శిలపై (ఏకశిల) చెక్కబడి ఉండటం అత్యంత విశేషం. శ్రీరాముడు ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు హనుమంతుడిని ఇంకా కలవని కారణంగా, ఈ ఆలయ గర్భాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు. ఇది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత.
‘ దేవుని కడప’ లో.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్టలోని ఏకశిలా నగరం, తెల్లవారుజాము నుంచే భక్తులు ఇలా బారులు తీరి ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవడం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు చక్కగా ఏర్పాట్లు చేసి శోభాయమానంగా దర్శించుకొనేలా చేసి భక్తులను చక్కటి ఆధ్యాత్మికను అనుభవించేలా చేశారు.