– విద్యారంగంపై అనాలోచిత నిర్ణయాలు, ప్రయోగాలు
– ప్రైవేటుకు తరలిపోతున్న ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులు
– అటకెక్కిన అమ్మఒడి, గోరుముద్ద, ఫీజు రీయింబర్స్ మెంట్
– బకాయిలతో కుదేలవుతున్న విద్యా పథకాలు
– సర్కారీ బడుల్ని వీడిన 4.6 లక్షల విద్యార్ధులు
– యాప్ లు వద్దన్న వారే ఇప్పుడు యాప్ లు తెస్తున్నారు
– విద్యారంగంపై మంత్రి లోకేష్ శ్వేతపత్రం విడుదల చేయాలి
– వైఎస్సార్సీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ధ్వజం
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కారు 18 నెలల కాలంలో విద్యా వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని, ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను నాశనం చేస్తోందని వైఎస్సార్సీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆక్షేపించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను పక్కనబెట్టి, సంస్కరణల పేరుతో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, ప్రయోగాలు పూర్తిగా వికటించాయని తెలిపారు. తన హయాంలో భ్రష్టుపడుతున్న విద్యారంగంపై మంత్రి నారా లోకేష్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదిమూలపు సురేశ్ కోరారు.
నాడు-నేడు, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ లు, టోఫెల్, ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్ లు ఇచ్చే కార్యక్రమం, అమ్మఒడి, గోరుముద్ద వంటి పథకాలు అటకెక్కించారు. తల్లికి వందనం ఎంత మందికి ఇచ్చారనేది మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. డిజిటల్ క్లాస్ రూమ్ లకు బైబై, టోఫెల్ క్లాసులకు టాటా చెప్పారు. సబ్జెక్టు టీచర్లపై పూర్తిగా వేటు వేశారు. గోరు ముద్ద కాస్తా ఘోరముద్దగా తయారైంది. ప్రభుత్వ బడుల్ని వీడి విద్యార్ధులు కార్పోరేట్ స్కూళ్లవైపు వెళ్తున్నారు. దీంతో కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు కూడా 10-30 శాతం పెరిగాయి. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో తగ్గింది.
కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ చిట్టచివరిలో ఉంది. గతంలో కేరళతో పోటీ పడి అనేక కార్యక్రమాలు చేపడితే ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందో అందరూ గమనించాలి. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో యోగాంధ్ర పేరుతో గిన్నిస్ బుక్ రికార్డుల కోసం విద్యార్ధుల్ని వాడే కార్యక్రమాలు చేశారు, పూర్తిగా విద్యాపరమైన వాతావరణం లేకుండా చేశారు, చరిత్రలో తొలిసారి మమ్మల్ని పాఠాలు చెప్పనివ్వాలని ఉపాధ్యాయులు అడిగే పరిస్ధితి వచ్చింది.
గతంలో మేం పాఠశాలలో పారిశుద్ధ్యం, ఇతర కార్యక్రమాల నిర్వహణకు యాప్ లు పెడితే, ఇప్పుడు విద్యాశక్తి అని మరో యాప్ పెట్టి పిల్లలు స్నానం చేశారా, తల దువ్వుకున్నారా, పౌడర్ కొట్టుకున్నారా అనే విషయాలు చెక్ చేసే స్థితికి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఎలా నడిచాయి, టీచర్లను ఎలా నియమించాం, వారికి శిక్షణ ఇచ్చి ఎలా వాడుకున్నామో చూడాలి. ఇప్పుడు స్కూళ్లలో టీచర్లను ఇష్టారాజ్యంగా మారుస్తూ స్కూల్ అసిస్టెంట్లను క్లస్టర్ టీచర్స్ కింద, ప్రైమరీ స్కూల్లకు హెడ్మాస్టర్లుగా వాడుతూ సబ్జెక్ట్ టీచర్లే లేకుండా చేశారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ 8 త్రైమాసికాలకు సంబంధించి 5600 కోట్లు బకాయిలు ఉంటే ఎంగిలి మెతుకులు విదిలించినట్లు 700 కోట్లు ఇచ్చారు. ఇంకా 900 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వసతి దీవెన కింద ఇప్పటివరకూ 7100 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాళ్లంతా ఎంత ఇబ్బందిపడుతున్నారో మంత్రి బయటికి కొచ్చి తల్లితండ్రులతో మాట్లాడితే అర్దమవుతుంది.
2024 సంవత్సరంలో సర్కారు బడుల్లో 37.1 లక్షల మంది విద్యార్ధులు ఉంటే, ఈ విద్యా సంవత్సరం కూటమి ఏడాదిన్నర పాలనలో 32.6 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే కూటమి పాలనలో సుమారు 4.6 లక్షల మంది విద్యార్ధులు తగ్గిపోయారు. ఏకంగా 29 మంది విద్యార్ధులు చనిపోయారని రికార్డులు చెప్తున్నాయి. హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావు పేట బీసీ బాలికల హాస్టల్లో వంగలపూడి అనిత పిల్లలతో కలిసి భోం చేస్తుంటే బొద్దింక వచ్చిన మాట వాస్తవం కాదా?
డీఎస్సీ అభ్యర్ధులు మెరిట్ లిస్ట్ లో ఉన్నా కాల్ లెటర్లు రాలేదని ఆందోళనలు చేసిన పరిస్ధితి. కొందరు విద్యార్ధులు, రెండు,మూడు ఉద్యోగాలు సాధించినా మెరిట్ ప్రకారం పోస్టు ఎంచుకునే అవకాశం ఇవ్వాలని హైకోర్టు చెప్పినా లెక్కచేయకుండా మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. డీఎస్సీ ఉపాధ్యాయుల్ని కూటమి సర్కార్ నిలువునా ముంచిందని ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. ఇంతవరకూ 12వ పీఆర్సీ నియమించలేదు, ఐదు డీఏలు ఇవ్వలేదు, ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయేతర పనుల్లో వాడుతున్నారు.
ఉద్యోగులకు 22 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. రిటైర్ అవుతున్న టీచర్లు కూడా తమ లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ఇస్తారో లేదో తెలియక ఆందోళనలో ఉన్నారు. మంత్రి తన అనాలోచిత ప్రయోగాలు, నిర్ణయాల్ని సంస్కరణలు అంటున్నారు. రాష్ట్రంలో మూడో వంతు ప్రైమరీ స్కూళ్లు సింగిల్ టీచర్ స్కూళ్లుగా మారిపోయాయి. సగం పైన హైస్కూళ్లు సింగిల్ సబ్జెట్ టీచర్ స్కూళ్లుగా మారిపోయాయి. ఇవేనా మీ సంస్కరణలు ? మీ అనాలోచిత ప్రయోగాల వల్ల విద్యారంగంలో వచ్చిన మార్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.