– సెంట్రల్ జిఎస్టీ ఎ.పి ఆడిట్ కమిషనర్ పి.ఆనంద్ కుమార్
తెనాలి: మల్లేపాడు గ్రామంలో ఉన్న పాత మరియు కొత్త సమాధి స్థలాల వద్ద సరిహద్దు గోడ నిర్మాణానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ కార్యక్రమం ప్రధాన మంత్రి స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మంగళవారం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిఎస్టీ ఆడిట్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆ శాఖ ఆంధ్రప్రదేశ్ కమిషనర్, ఐ.ఆర్.ఎస్ అధికారి పులిపాక ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా జి.ఎస్.టి ఆడిట్ కమిషనరేట్ కమిషనర్ పులిపాక ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాలలో పరిశుభ్రత పాటించి, పరిరక్షించడమే కాకుండా, శుభ్రమైన ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో స్వచ్ఛతా స్ఫూర్తి ని కలిగించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
స్వచ్చత అనేది మన సంస్కృతిలో ఒక భాగం కావాలని, స్వచ్చత సాధనకు సమిష్టి కృషి అవసరమన్నారు. గ్రామ పరిశుభ్రతకు తోడ్పడే ఇటువంటి కార్యక్రమాలు సమాజాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో కొబ్బరి మొక్కలను కమిషనర్ నాటారు.
ఈ కార్యక్రమంలో జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.వి. సుబ్రహ్మణ్యం, గ్రామ సర్పంచ్ పినపాటి భారతి దేవి, జిఎస్టీ శాఖ సూపరింటెండెంట్లు పి. పురుషోత్తం, మహమ్మద్ అస్లాం ఉస్మాని, సాయి చంద్, షబ్బీర్ షేక్, కొప్పిశెట్టి రామారావు, టి.రాజీవి, వి. రేవతి, ఎన్. సుధీర్ కుమార్, జె. వి సతీష్, ఎం. కామేశ్వరరావు, ఊరి ప్రజలు పాల్గొన్నారు.