– శాంతిభద్రతల్లో జాతీయస్ధాయిలో అట్టడుగున రాష్ట్రం
– పోలీసుల రెస్పాన్స్లోనూ దేశంలోనే ఏపీ వెనకడుగు
– శాంతిభద్రతల వైఫల్యంపై చంద్రబాబుకు అమిత్ షా లేఖ
– కలెక్టర్ల సదస్సులో స్వయంగా అంగీకరించిన చంద్రబాబు
– మీడియాతో వైయస్సార్పీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
తాడేపల్లి: రాష్ట్రంలో క్యాలెండర్ ఇయర్ మారుతోంది కానీ కూటమి పాలనలో ప్రభుత్వం, నాయకుల క్యారెక్టర్లో మార్పు కనిపించడం లేదని వైయస్సార్పీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆక్షేపించారు. మహిళలకు ఆరు పథకాల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, వాటిని అమలు చేయకపోగా వారికి ఆర్తనాదాలు, అఘాయిత్యాలు, అబద్ధాల్ని మిగిల్చిందని ఆమె గుర్తు చేశారు. ఆ బాధితులకు వైయస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలబడిందన్న వరుదు కళ్యాణి, కొత్త సంవత్సరంలో కూడా తమ పార్టీ మహిళలకు ఆ భరోసా ఇస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో ఐదు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి అమ్మకానికి పెట్టేసిన పరిస్ధితి చూస్తున్నాం. నెలకో డ్రామా, రోజుకో అబద్ధం, గంటకో అరాచకం ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
2025 ఏడాదిని ఓ చీకటి సంవత్సరంగా కూటమి ప్రభుత్వం నిలిపింది. ప్రజా రక్షణలో పూర్తిగా విఫలమైన పోలీస్ వ్యవస్థ వల్ల వారి పనితీరులో మన రాష్ట్రం 36వ స్ధానానికి దిగజారింది. మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు విచ్చలవిడిగా పెరిగాయి. పది జిల్లాల్లో అవి పెరిగాయని కలెక్టర్ల సదస్సులో స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే వారిని శిక్షించకపోవడం వల్ల పెచ్చుమీరుతున్నాయి. సీఎం నివాసం ఉంటున్న జిల్లాలో మహిళలపై నేరాలు 11 శాతం పెరిగాయి. హోంమంత్రి అనిత ఇన్ఛార్జ్గా ఉన్న విజయనగరం జిల్లాలోనూ మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి.
అలాగే ఏపీలో ఏదైనా అఘాయిత్యం జరిగి అత్యవసర పరిస్ధితుల్లో పోలీసులు రెస్పాండ్ అయ్యే టైం 26 నిమిషాలు అని, అది చాలా ఎక్కువ సమయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుకు లేఖ రాశారు. ఎందుకంటే దానికి సంబంధించి దేశ సగటు సమయం 18 నిమిషాలు మాత్రమే. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం. పారిశ్రామికవేత్తల్ని చేస్తాం. ఇంట్లో ఉంటే చాలు లక్ష రూపాయలు వచ్చేలా చేస్తాం. 18 ఏళ్లు దాటితే ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తాం. 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఏదీ నెరవేర్చకుండా దగా చేశారు.
కూటమి మ్యానిఫెస్టోలో అన్ని రకాల సంక్షేమం హామీలిచ్చారు. బాండ్లలో ఎవరికి ఎన్ని డబ్పులు వస్తాయో కూడా చెప్పారు. ఇవాళ మహిళల్ని మహిళల్ని నిట్టనిలువుగా మోసం చేసారు. ప్రతీ ఆడబిడ్డకూ రెండు సెంట్ల స్థలం ఇస్తాం, సొంత ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. కానీ ఏ మహిళకూ ఇల్లు నిర్మించి ఇవ్వలేదు. వడ్డీ లేని రుణాలు 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామన్నారు. అది నమ్మి మహిళలు ఓటేస్తే 10 లక్షల రుణాలు రాకపోగా.. ఆ 3 లక్షలకూ వడ్డీ లేని రుణాలు రావట్లేదు. ఉద్యోగాలు చేస్తే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు పశువులకు హాస్టళ్లు కడతామంటున్నారు.
ప్రతీ మహిళా నిరుద్యోగికి నెలకు 3 వేలు చొప్పున ఇప్పటికే రూ.54 వేల నిరుద్యోగ భృతి బాకీ పడ్డారు. 2 కోట్ల మంది మహిళలకు 18 నెలల్లో రూ.27 వేలు చొప్పున బకాయి పడ్డారు. మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టింది కాక రెండో ఏడాది కూడా అరకొరగానే ఇచ్చారు. ఇంకా చాలా మందికి కోత పెట్టారు. 16 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తామని దగా చేసారు. 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 18 నెలల్లో రూ.70 వేలు బాకీ పడ్డారు.
ఆవకాయ్ ఫెస్టివల్ కు డబ్బులుంటాయి కానీ ఆడబిడ్డ నిధికి డబ్బులుండవు. అమరావతిలో తుప్పలు కొట్టడానికి డబ్బులుంటాయి, ఫీజు రీయింబర్స్ మెంట్ కు డబ్బులుండవు. విహార యాత్రలకు డబ్బులుంటాయి, డ్వాక్రా మహిళలకు, సున్నా వడ్డీకి డబ్బులుండవు, ప్యాలెస్ లు, ఆర్భాటాలకు డబ్బులుంటాయి, నిరుద్యోగులకు ఇచ్చేందుకు డబ్బులుండవు, పబ్లిసిటీ ఈవెంట్స్ కి డబ్బులుంటాయి, పెన్షన్లు ఇచ్చేందుకు మాత్రం ఉండవు. కార్యకర్తలకు పేమెంట్స్ కు డబ్బులుంటాయి, ఆరోగ్యశ్రీ అమలుకు డబ్బులుండవు. మహిళలంటే ఎందుకింత చులకన , చిన్నచూపు. దేవతలన్నా చంద్రబాబుకు చిన్నచూపే. అమ్మలగన్నమ్మ దుర్గమ్మ గుడికి పవర్ కట్ చేశారంటే ఎంత దిగజారిపోయారో అర్దమవుతుంది.
హోం మంత్రిగా అనిత శాంతిభద్రతలు, మహిళల రక్షణ చూడకుండా ఖైదీలకు పెరోల్స్ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. ఇంకో మంత్రి సవిత కుట్టుమిషన్ల ట్రైనింగ్ లో కూడా స్కాం చేయడంలో బిజీగా ఉంటూ, బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసి సొంత సంక్షేమం మీదే దష్టిపెట్టారు. మూడో మంత్రి మహిళా, శిశు సంక్షేమం చూడమంటే సొంత పీఏ వల్ల ఓ మహిళ బాధించబడితే ఆయనకు అండగా నిలబడటమే కాకుండా బాధితురాలైన ఆమెను రిమాండ్ కు పంపారు. హాస్టళ్లలో పిల్లలు చనిపోతున్నా, రోగాల బారిన పడుతున్నా పట్టించుకోవట్లేదు.