– జాతీయ అబద్దాల పోటీలు నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవార్డులు ఖాయం
– 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని ఒప్పందం చేసుకున్నదే కేసీఆర్
– తెలంగాణకు రావాల్సిన వాటాను కేసీఆర్ ఏపీకి ధారాదత్తం చేస్తూ సంతకం చేసింది నిజమే
– ఆ ఒప్పంద పత్రాలను ఆనాడు బయపెట్టిందే నేను
– యూపీఏ సర్కార్ చేసిన విభజన చట్టం పరిమితులవల్లే తెలంగాణకు అన్యాయం
– తెలంగాణాకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని మోదీ ప్రభుత్వం సరిదిద్దింది
– కృష్ణా బేసిన్ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజన చేసేలా అవకాశం కల్పిస్తూ కొత్త ట్రైబ్యునల్ కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారు
– పాలమూరు రంగారెడ్డిపై కేంద్రం అడిగిన నీటి వివరాలు ఇవ్వకుండా రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి
– అందుకే డీపీఆర్ ను కేంద్రం వెనక్కు పంపింది
– సమగ్ర వివరాలతో కేంద్ర గైడ్ లైన్స్ తో డీపీఆర్ పంపకుండా కేంద్రం నిధులిస్తుందనడం హాస్యాస్పదం
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్: కృష్ణా జలాల వాటా వినియోగంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పచ్చి అబద్దాలాడుతూ కేంద్రాన్ని దూషించడం అలవాటుగా మారింది. అందాల పోటీల మాదిరిగా హైదరాబాద్ లో ‘‘జాతీయ అబద్దాల పోటీలు’’ నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మొదటి రెండు అవార్డులు దక్కుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సింది పోయి ప్రజలను గందరగోళంలోకి నెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కావాల్సిన పవిత్రమైన అసెంబ్లీని స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గు చేటు.
నీటి వాటా పంపకాల విషయంలో తెలంగాణకు మొట్టమొదట అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన చట్టం- 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కృష్ణా జలాల వాటా పంపిణీకి సంబంధించి బచావత్ ట్రైబ్యునల్ చేసిన కేటాయింపుల వివాదాలను టచ్ చేయరాదని పేర్కొంటూ విభజన చట్టంలో సెక్షన్ 89ను చేర్చి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా? నాటి నీటి కేటాయింపులపై పరిశీలిన చేసే అవకాశమే కొత్త ట్రైబ్యునల్ కు లేకపోవడంవల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోంది.
తెలంగాణాకు యూపీఏ చేసిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు 2023 అక్టోబరు 6న మోదీ ప్రభుత్వం కొత్త ట్రైబ్యునల్‌కు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సు ఇస్తూ గెజిట్ నోటిఫికే షన్ జారీ చేసింది. తద్వారా, కృష్ణా బేసిన్ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజన చేసే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్, లీగల్ వాదనలు సమర్థంగా వినిపించే అంశంపై ద్రుష్టి సారించకుండా స్వార్ధ రాజకీయ లబ్డి కోసం అడ్డగోలుగా మాట్లాడుతుండటం సిగ్గు చేటు.
నీటి కేటాయింపుల్లో నాటి కేసీఆర్ ప్రభుత్వం ఏపీకి ఉద్దేశపూర్వక సాయం చేస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. 811 టీఎంసీల క్రిష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉండగా, 299 టీఎంసీలు చాలు అని అంగీకరిస్తూ కేసీఆర్ 2015 జూన్ 19న కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో, 1వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఒప్పందం చేసుకుని తెలంగాణ హక్కులను కాలరాశారు.
ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నా ఆనాడు కేసీఆర్ పట్టించుకోలేదు. ఈ అంశాన్ని వివరిస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ 2020 మే 12న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేంద్ర జలశక్తికి నేను లేఖ రాశాను.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెంటనే స్పందించి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందేదాకా ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలని కృష్ణా బోర్డును కోరితే… ఆ బోర్డు (KRMB) తెలంగాణ చట్టబద్ధమైన ప్రయోజనాలను కాపాడాలని AP ప్రభుత్వానికి ఐదుసార్లు లేఖలు (15 మే 2020, 20 మే 2020, 16 జూన్ 2020, 1 జూలై 2020 మరియు 30 జూలై 2020 తేదీల్లో) రాసింది. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో కనీసం కేంద్రానికి లేఖ రాయలేదు. సాయం కోరలేదు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (LIS) ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచి క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్న సమయంలో తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఆనాడు మళ్లీ నేను 2020 జులై 29న కేంద్రానికి లేఖ రాస్తూ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరాను.
కేంద్రం వెంటనే స్పందించి 2020 ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంటే…ఆ సమావేశానికి కూడా కేసీఆర్ వెళ్లకుండా వాయిదా కోరుతూ ఏపీ ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా సహాయం చేసి తెలంగాణకు తీరని నష్టం కలిగించారు. నీటి కేటాయింపులపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నా సుప్రీంకోర్టులో కేసుల పేరుతో దాదాపు 8 ఏళ్లపాటు కొత్త ట్రైబ్యునల్ రాకుండా జాప్యం చేసింది కూడా కేసీఆరే.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కేంద్రంపై విమర్శలు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనం. ఈ విషయంలో హరీష్ రావు ఏం మాట్లాడుతున్నరో ఆయనకే అవగాహన లేదు. గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ప్రకారం పోలవరం ద్వారా 45 టీఎంసీల నీటిని ఉమ్మడి ఏపీలోని ఎగువ ప్రాంతానికి వినియోగించుకోవాలని కేంద్రం చెప్పింది నిజం కాదా? ఆ మొత్తం నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వాడుకోవాలని కేంద్రం సూచించింది నిజం కాదా?
చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం మోపుతూ హరీష్ రావు ఆరోపణలు చేయడం విడ్డూరం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90 టీఎంసీల నీటి వినియోగం సమగ్ర వివరాలు పంపకపోవడంవల్లే రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ను తిరిగి వెనక్కు పంపిందే తప్ప తిరస్కరించలేదు. ఈ విషయంలో నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి.
ఆ పార్టీలు చేసిన తప్పిదాలను కేంద్రంపై నెట్టడం దుర్మార్గం. నీటి వినియోగం, కేటాయింపులపై కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ) కోరిన వివరాలు పంపిస్తే తప్పకుండా డీపీఆర్ ఆమోదం పొందుతుంది. ఇవేమీ చేయకుండా ప్రధానమంత్రి క్రుషి సంచాయ్ యోజన కింద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి 60 శాతం నిధులను కేంద్రం నుండి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యస్పదం.
ఇకనైనా నీటి కేటాయింపులు, డీపీఆర్ రూపకల్పనలో చేసిన తప్పిదాలను, తెలంగాణకు చేసిన అన్యాయాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒప్పుకుని రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో ఒకరిపై ఒకరు తిట్లు, దూషణలతో కాలయాపన చేయకుండా చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని తెలంగాణ హక్కులను కాపాడాలి. ఈ విషయంలో కేంద్రం పూర్తిగా సహకరించేందుకు సిద్దంగా ఉంది.