– శాసనమండలిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్
హైదరాబాద్: భూమిని మనం తల్లిగా పూజిస్తాం. అదే మట్టిలో పుడతాం, అదే మట్టిలో కలిసిపోతాం. అలాంటి తల్లిని మనమే కలుషితం చేస్తున్న పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని, కానీ తెలంగాణలో దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అత్యవసరం ఉందన్నారు.నెట్ జీరో లక్ష్యాలను సాధించాలంటే పెద్దఎత్తున సేంద్రియ వ్యవసాయ సంస్థలు, రైతు సమూహాలు పెరగాల్సిన అవసరం ఉందని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశం గర్వించేలా ధాన్యం ఉత్పత్తిలో ముందంజలో నిలిచిందని, దీనికి రైతుల కృషి అమూల్యమని ఆయన కొనియాడారు. అయితే సేంద్రియ వ్యవసాయాన్ని మరింత విస్తరించాలంటే రైతులకు సేంద్రియ విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసే అంశంపై స్పష్టమైన విధానం అవసరమని చెప్పారు.
సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఎక్స్టెన్షన్ సర్వీసుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందో వెల్లడించాలని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో నిర్మించిన రైతు వేదికలను సద్వినియోగం చేసుకొని సేంద్రియ వ్యవసాయ శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అంశాలపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను శాసనమండలిలో స్పష్టంగా తెలియజేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.