– ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావుకు క్లీన్ చిట్
– ఇకపై ఆయనను విచారించేందుకు వీలు లేదు
– సుప్రీంకోర్టు ఆదేశం.. హరీష్ రావుకు క్లీన్ చిట్
– తెలంగాణ సర్కారు వాదనను త్రోసి పుచ్చిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి,హరీష్ రావుకు అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవంటూ హైకోర్టు గతంలోనే కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కొనసాగుతోందని, దీనికి సంబంధించి కీలక ఆధారాలు ఉన్నందున హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, ప్రభుత్వం సమర్పించిన వాదనలతో విభేదించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఎటువంటి సంబంధం లేదని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో, ఇకపై ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
ఈ తీర్పుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై ఉన్న ఆరోపణలన్నీ దాదాపు ముగిసినట్లేనని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ కేసు విచారణలో ఆయనను ప్రతివాదిగా చేర్చే అవకాశం లేదనే విషయం కోర్టు తీర్పు ద్వారా తేట తెల్లమైంది.