– ఇది చరిత్రను ఖూనీ చేయడమే
– ఏకపక్ష నిర్ణయాలు.. నియంతృత్వ ధోరణి
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు
హైదరాబాద్: “పునర్వ్యవస్థీకరణ” పేరుతో సికింద్రాబాద్ నగరం యొక్క 200 ఏళ్ల ఘన చరిత్రను చెరిపేయాలని చూస్తే ప్రజలు సహించబోరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు హెచ్చరించారు.
200 ఏళ్ల సజీవ చరిత్రపై దాడి:
సికింద్రాబాద్ కేవలం ఒక పిన్‌కోడ్ లేదా బ్యూరోక్రాటిక్ బ్లాక్ కాదని, అది 1806లో పురుడుపోసుకుని, తనదైన విశిష్ట సంస్కృతితో ఎదిగిన సజీవ నగరమని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌కు ‘ట్విన్ సిటీ’గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన నగరాన్ని పాలనా సౌలభ్యం పేరుతో తుడిచివేయాలని చూడటం “సాంస్కృతిక విధ్వంసం” అని మండిపడ్డారు.
“సికింద్రాబాద్‌ను మ్యాప్‌పై గీసి చెరిపేయగల గీతలా చూడటం చరిత్రపై, ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన దాడి. ఇది పరిపాలనా సంస్కరణ కాదు – ఇది చరిత్ర హత్య,” అని డా. శ్రవణ్ వ్యాఖ్యానించారు.
మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచినంత మాత్రాన, సికింద్రాబాద్ పౌర అస్తిత్వాన్ని మార్చేసే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. మల్కాజిగిరి పేరుతో ఒక ప్రత్యేక ఎం.సి.హెచ్ ఏర్పాటు చేసి, చారిత్రాత్మక సికింద్రాబాద్ సరిహద్దులను అందులో బలవంతంగా విలీనం చేయడం ఏకపక్షమని, ఇది నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజాస్వామ్య విరుద్ధం: ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా చేస్తున్న ఈ మార్పులు అధికార దుర్వినియోగమే.
గుర్తింపు చోరీ: తరతరాల జ్ఞాపకాలను, పౌర గుర్తింపును చెరిపేయడం ప్రజల మనసులను గాయపరచడమే.
సికింద్రాబాద్ పేరును, సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని డా. శ్రవణ్ హెచ్చరించారు. ఇది కేవలం స్థానిక సమస్య కాదని, మన అస్తిత్వం కోసం జరుగుతున్న పోరాటమని ఆయన పేర్కొన్నారు.
“సికింద్రాబాద్ పేరును చెరిపేయాలనుకుంటే, ప్రజల ఆత్మగౌరవాన్నే చెరిపేయాలని చూస్తున్నట్లే. ప్రభుత్వం ఈ ప్రమాదకరమైన ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు,” అని డా. శ్రవణ్ దాసోజు హెచ్చరించారు.