– సుప్రీం ఆదేశాలను కాదని సొంత రాజ్యాంగం అమలు చేస్తామంటే కుదరదు
– ప్రభుత్వ తీరుపై ప్రజా పోరాటం తథ్యం
– సకలశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్
– ఏ హోదాలో సోషల్ మీడియా కేసులపై సమీక్ష చేస్తారు?
– టీడీపీ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు కనిపించడం లేదా?
– అది సుప్రీం గైడ్ లైన్స్ అతిక్రమించడం కాదా?
– వైయస్సార్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు
తాడేపల్లి: సోషల్ మీడియా నియంత్రణ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలు, ప్రజా స్వామ్య వాదుల గొంతు నులిమే ప్రయత్నం చేస్తోందని వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… కేవలం వైయస్సార్సీపీ సోషల్ మీడియా లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఖాకీలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.
సోషల్ మీడియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని గైడ్ లైన్స్ రూపొందించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సైతం కాదని… లోకేష్ సొంత రాజ్యాంగం అమలు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఏ అర్హతతో ఆయన సోషల్ మీడియా పై సమీక్ష చేసి ఆదేశాలు జారీ చేస్తారని ప్రశ్నించారు. కేవలం వైయస్సార్సీపీ కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్న లోకేష్ కి, ఐటీడీపీ పేరుతో టీడీపీ సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యపోస్టులు పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న జూపూడి ప్రభాకరరావు… టీడీపీ సోషల్ మీడియాకు మరో రకమైన చట్టాలున్నాయా? అని నిలదీశారు.
నియంత్రణ ముసుగులో ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గదని… ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూనే ఉంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వ సకలశాఖ మంత్రి నారా లోకేష్ హోంమంత్రి,ఐ అండ్ పీఆర్ మంత్రితో కలిసి వైయస్సార్సీపీ సోషల్ మీడియాపై ఎలా దాడిచేయాలో దిశానిర్దేశం చేశారు. తన పరిధిని దాటి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలని హితబోధ చేశారు.
కానీ తన టీడీపీ సోషల్ మీడియా ఐ టీడీపిని మాత్రం విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు రాసుకొండి, మీ మీద ఎవ్వరూ కేసులు పెట్టరు. పెట్టినా మేం పట్టించుకోము, కానీ వైయస్సార్సీపీ సోషల్ మీడియాను మాత్రం లేకుండా చేయాలని సూచించారు. 25 ఆగష్టు 2025 నాడు సోషల్ మీడియాపై కొన్ని గైడ్ లైన్స్ తయారు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ తన శాఖ, తన పరిధి కాని అంశాలపై సకలశాఖా మంత్రిగా పిలవబడుతున్న లోకేష్ ఏ అధికారంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని సోషల్ మీడియా గ్రూపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తారు?
ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కనీసం సమాచారం లేకుండా విదేశాలకు వెళ్లిపోతారు. అదే విషయం సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇదా సుప్రీం కోర్టు చెప్పింది? వైయస్.జగన్ తరపున, వైయస్సార్సీపీ తరపున ఎవరూ ఏమీ మాట్లాడకూడదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? మీ ఒక్క పార్టీ మాత్రమే రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్ అయిందా? ప్రతిపక్ష పార్టీలు లేవా? భావ ప్రకటనా హక్కును హరించాలనుకుంటూ… సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా.. ఆ తీర్పు ఎవరికీ తెలియదు అన్నట్టు మీరు సమీక్షలు చేసే విధానం అప్రజాస్వామికం. ఇది రాజ్యాంగ విరుద్దం.