– వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు పక్కా
– బీసీలకు బీఆర్ఎస్ ఒక్కటే అండ
– ఎంపి వద్దిరాజు రవిచంద్ర
ఖమ్మం : కాంగ్రెస్ సర్కార్ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు జరిగినా బీఆర్ఎస్ 100 సీట్లలో ఘన విజయం సాధించడం తథ్యమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పనతో పాటు 56 హామీలిచ్చి,ప్రజలకు అలవికాని 432 వాగ్ధానాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
ఖమ్మం తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన సభలో ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో గెలిచిన సర్పంచులు,ఉప సర్పంచులు, వార్డ్ సభ్యుల సన్మానసభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యారని విమర్శించారు.
రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.సీతారామ,భక్త రామదాసు నీటి పారుదల ప్రాజెక్టులతో ఖమ్మం జిల్లా ఆకుపచ్చగా, సస్యశ్యామలంగా మారిందని వివరించారు.
మున్నేరు ద్వారా ఈ ప్రభుత్వం గార్ల, బయ్యారం మండలాలకు నీళ్లించే కార్యాచరణ చేపట్టనట్టయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతామని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.బీసీ బిడ్డనైన తనను ఊహించని విధంగా కేసీఆర్ పెద్దల సభ రాజ్యసభకు పంపారని,రెండవ సారి కూడా అవకాశమిచ్చారని వద్దిరాజు చెప్పారు.