– నాపై కోపం ఉంటే నా మీద చూపించు రేవంత్ రెడ్డి.. సిద్దిపేట ప్రజలపై కాదు
– బాండ్ పేపర్ మీద రాసిచ్చిన రూ. 4000 పెన్షన్ ఏమైంది?
– 25 నెలలుగా పెన్షన్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఒక్కో అవ్వా తాతకు రూ. 50,000 బాకీ పడ్డారు
– మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
– సిద్దిపేటలో బీజేపీకి భారీ షాక్.. బీఆర్ఎస్లో చేరిన మాజీ పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్
– అభివృద్ధిని చూసే గులాబీ గూటికి వచ్చాం: పార్టీలో చేరిన నేతలు
సిద్దిపేట: బీజేపీ పట్టణ అధ్యక్షులు పత్రి శ్రీనివాస్, సీనియర్ నాయకులు హనుమంత్ రావు తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా, మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఒకప్పుడు సిద్దిపేటలో మంచినీళ్ల కష్టాలు ఎలా ఉండేవో, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకంటే మీకే బాగా తెలుసు. ఒకప్పుడు నీళ్ల కోసం సిద్దిపేటకు పిల్లని ఇవ్వడానికి కూడా భయపడేవారు. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మురికి కాలువలు గుర్తుకొచ్చేవి. ఇప్పుడు పందులు మాయమయ్యాయి. మోరీల స్థానంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వచ్చాయి.
సైకిళ్ల మీద నీళ్లు మోసే బాధలు పోయి, ఇంటింటికి నల్లా నీళ్లు వచ్చాయి. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి తెలియాలంటే వేరే ఊరికో, వేరే నగరానికో వెళ్లి చూస్తే అర్థమవుతుంది. కమ్యూనిటీ హాల్స్, చెత్త సేకరణ, వీధి దీపాలు.. ఇలా ఏది చూసినా సిద్దిపేట రాష్ట్రానికే మోడల్‌గా నిలిచింది.
సిద్దిపేట చదువుల తల్లిగా మారింది. మెడికల్ కాలేజ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, నర్సింగ్, మహిళా డిగ్రీ కాలేజీలతో విద్యాక్షేత్రంగా వెలుగొందుతోంది. వైద్యంలోనూ అగ్రగామిగా నిలిచింది. దేవాలయాల జిల్లాగా సిద్దిపేట కీర్తి గడించింది. కోమటి చెరువు పర్యాటక కేంద్రంగా మారి, ఇతర జిల్లాల వారిని ఆకర్షిస్తోంది. మీ ఎమ్మెల్యేగా మీ పరువు, ప్రతిష్ట పెరిగేలా పనిచేశాను. సిద్దిపేట ప్రజలను ఎవరైనా చూస్తే అదృష్టవంతులు అనే స్థాయికి తీసుకువచ్చాను.
30, 40 ఏళ్ల సిద్దిపేట ప్రజల కలను కేసీఆర్ నిజం చేసి జిల్లాను ఇచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి జిల్లాలు ఎక్కువయ్యాయని సాకు చూపి సిద్దిపేట జిల్లాను రద్దు చేసి మళ్ళీ సంగారెడ్డిలో కలపాలని కుట్ర చేస్తున్నారు. జిల్లా రద్దయితే కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి, ఎస్సీ ఆఫీస్, ఇరిగేషన్ ఆఫీసులన్నీ పోతాయి. సిద్దిపేట అభివృద్ధి కుంటుపడుతుంది.
రేవంత్ రెడ్డికి నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి కానీ, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తానంటే ఊరుకోం. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సిద్దిపేట అస్తిత్వాన్ని కాపాడుకుంటాం. అవసరమైతే మరో ఉద్యమం చేస్తాం. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన రూ. 4000 పెన్షన్ ఏమైంది? 25 నెలలుగా పెన్షన్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఒక్కో అవ్వా తాతకు రూ. 50,000 బాకీ పడ్డారు.
అక్కచెల్లెళ్లకు నెలకు 2500 రూపాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఒక్కో మహిళకు రూ. 62,500 బాకీ పడ్డారు.కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు.. ఎవరికైనా ఇచ్చారా? కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు వచ్చేవి, ఇప్పుడు మాయమయ్యాయి. ఆడబిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ తోపాటు 12,000 రూపాయలు ఇచ్చి ఆటోలో ఇంటికి పంపేవారు. ఇప్పుడు అదీ లేదు.
కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల తిప్పలు లేవు. ఇప్పుడు ఎరువుల కోసం క్యూ లైన్లు. పంటలు కొనట్లేదు, రైతుబంధు పడట్లేదు. ఉన్న సంసారాన్ని నడపడం రేవంత్ రెడ్డికి చేతకావడం లేదు. సిద్దిపేట అంటే నా కుటుంబం. దసరా అయినా, రంజాన్ అయినా మీ మధ్యలోనే ఉంటా.
నా శక్తినంతా సిద్దిపేట అభివృద్ధికే ధారపోశాను. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మనవాళ్లే గెలవాలి. కౌన్సిలర్, చైర్మన్ మనవాళ్లే ఉంటేనే అభివృద్ధి ముందుకు సాగుతుంది. రేవంత్ రెడ్డితో ఇంకా కొట్లాడుదాం. విడిచి పెట్టేదే లేదు. కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యేదాకా, తెలంగాణ మళ్ళీ బాగుపడేదాకా కొట్లాడుదాం.