– క్యాడర్, లీడర్లతో కదనానికి ‘కారు’ కసరత్తు
– మెజారిటీ మున్సిపాలిటీల సాధనకు కేటీఆర్ జిల్లాల పర్యటనలు
– వరుసగా జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– 24 నెలల కాంగ్రెస్ మోసం, పాలన వైఫల్యంపై రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహం
– రెండు సంవత్సరాలు పట్టణాల్లో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ఖర్చు చేయలేదు
– పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలన తిరస్కరించాయి
– పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేయాలి
– జిల్లాలోని పార్టీ మున్సిపాలిటీ వారీగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్న కేటీఆర్
– హైదరాబాద్ లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం
– నిన్న వరంగల్, రేపు ఖమ్మం నిజామాబాద్ జిల్లాల వారీగా సమావేశం నిర్వహించిన కేటీఆర్
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ దిశానిర్దేశం మేరకు వచ్చే మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే ప్రక్రియకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీకారం చుట్టారు. వరుసగా జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల సమావేశాలను నిర్వహిస్తున్నారు.
నిన్న వరంగల్ జిల్లాతో పాటు నేడు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమై వచ్చే పురపోరులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి విస్తృతంగా చర్చించారు.
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, అడ్డదారులు తొక్కినా 4000 పైచిలుకు గ్రామ పంచాయతీలు BRS గెలవడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి స్పష్టమైన సంకేతమని కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని, అన్ని రంగాల్లో కుప్పకూలిన పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
రేవంత్ చేతకాని పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని చెప్పడానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష సాక్షమని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా పెద్ద ఎదురుదెబ్బ తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే అధికార పక్షంపైన ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ అన్నారు.
అసెంబ్లీ ఫలితాలు అనంతరం మన పార్టీ అనేక సవాలను ఎదుర్కొని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని దాటుకొని…కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరంతర పోరాటం చేస్తూ మరోసారి ప్రజల మనసును చురగొన్నదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనతో విసిగిపోయిన ప్రజలు బిఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలకు సర్వసన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలు మన పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారని, మరోసారి రాష్ట్ర ప్రజానీకం పల్లెలు పట్టణాలకు అతీతంగా మన పార్టీ వైపు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
పార్టీ శ్రేణులంతా శక్తి వంచన లేకుండా గులాబీజెండాకు పూర్వ వైభవం తెచ్చేందుకు సరిహద్దుల్లో పనిచేసే సైనికుల్లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గత 24 నెలలుగా పట్టణాల్లో నెలకొన్న సమస్యలను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ పార్టీ నేతలను కోరారు. పారిశుధ్యం నుంచి మొదలుకొని వీధీదీపాల వరకు అన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ పాలనలో పట్టణాల్లో కొత్తగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, మున్సిపాలిటీలు సమస్యలకు కేరాఫ్ గా మారాయని మండిపడ్డారు. గతంలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నిధులకు పనులకు తిరిగి శిలాఫలకాలు వేయడం తప్పించి రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క పని కూడా లేదన్నారు.
సుమారు దశాబ్ద కాలం పాటు BRS హయంలో పట్టణ ప్రగతితో పురపాలికల రూపురేఖలు మారిపోయాయని, ప్రతి మున్సిపాలిటీని గ్రోత్ ఇంజన్లు గా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. పట్టణ ప్రగతితో పాటు ప్రతి మునిసిపాలిటీలో అవసరమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని, వీటిని ప్రజలకు గుర్తు చేయాలన్నారు.
హైదరాబాద్ లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. కరీంనగర్ భారత రాష్ట్ర సమితి కోట అని, రెండున్నర దశాబ్దాలుగా అన్ని ఎన్నికల్లో పార్టీ వెంట కరీంనగర్ ప్రజానీకం నిలబడ్డారన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు తమ పరిధిలో ఉన్న మునిసిపాలిటీలు కార్పొరేషన్ లో పార్టీపరంగా ఉన్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతను తెలియజేశారు.
ఇప్పటికే ప్రతి వార్డు డివిజన్ వారీగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు నేతలు కేటీఆర్ కి తెలియజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాల పైన కేటీఆర్, నేతలకు దిశా నిర్దేశం చేశారు.