– హోంశాఖలో వెలుగుచూస్తున్న ‘కృష్ణ’లీలలు
– హోంశాఖలో కీలకనేత అనుచరుడికే ఏజెన్సీ పట్టం
– ఇప్పటికే ఫైర్ సేఫ్టీ కంపెనీ నిర్వహిస్తున్న ‘కృష్ణ’మాయ
– ఆ ఏజెన్సీ కోసం ఏకంగా కొత్త నిబంధనలు?
– ఫైర్ ఎన్‌ఓసీ కోసం కొత్తగా సర్టిఫైడ్ ఏజెన్సీలు
– దానితో వందల కోట్ల రూపాయల ఆదాయం
– కొత్త ఏజెన్సీలు వచ్చి చేసేదేమీ ఉండదట
– తెలంగాణలో విఫలమైన ఇదే ప్రయోగం
– అయినా తన అనుచరుడి కంపెనీ కోసం ‘హోం’ ఆరాటం
– ఏజెన్సీల కోసం కొత్తగా టర్నోవర్ నిబంధనలు
– కావలసిన కంపెనీ కోసమే టర్నోవర్ నిబంధనలు?
– అంతా ఆ కంపెనీలే మెటీరియల్, అమర్చడం చేయాలట
– యజమానులు బయటనుంచి కొనుగోలు చేస్తే అనుమతించరట
– ఇప్పటివరకూ ప్రభుత్వ ప్రాజెక్టులకే టర్నోవర్ నిబంధనలు
– ఇప్పుడు కొత్తగా ఫైర్ సర్వీసులో దేశంలోనే తొలిసారి
– ప్రైవేటు వ్యక్తుల భవనాలపై ఏజెన్సీల పెత్తనమేంటి?
– మరి ఫైర్ సర్వీసు అధికారులు, యంత్రాంగం పనికిరాని వాళ్లేనా?
– సీఎం చ ంద్రబాబునాయుడును ఏమార్చి మళ్లీ సర్క్యులర్?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది జీఓ ఎంఎస్ నెంబరు 20. హోం (జైళ్లు-అగ్నిమాపక) డిపార్టుమెంటు ఇచ్చిన ఉత్తర్వు అది. రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ పరిధిలోకి వచ్చే అన్ని భవనాలు, పరిశ్రమలు ఇకపై సర్టిఫైడ్ ఏజెన్సీలతో మాత్రమే కాంట్రాక్టు వర్కు చేయించుకోవాలి. ఇక ఇతర ఏజెన్సీలతో ప్రైవేటు వ్యక్తులు-సంస్థలతో ఫైర్ ఎక్విప్‌మెంట్‌కు సంబంధించిన పనులు చేయించకూడదు. అందుకోసం ఈ నిబంధనలు అమలుచేయాలి.
– ఇదీ హోంశాఖ అధీనంలోని అగ్నిమాపక విభాగానికి సంబంధించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి 19-02-2024 లో ఇచ్చిన ఉత్తర్వు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తర్వు ఇది.
కానీ ఈ ఉత్తర్వు కారణాంతరాల వల్ల అమలుకాలేదు. చిన్న చిన్న ఫైర్ సేఫ్టీ ఏజెన్సీలు దానిపై అభ్యంతరం వ్యక్తం చేయడమే దానికి కారణం. కొన్ని బడా ఏజెన్సీలను బాగుచేసే లక్ష్యంతోనే ఆ జీఓ ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తడమూ దానికి ఓ కారణం.
మళ్లీ కూటమి ప్రభుత్వం దానిని అమలు చేసేందుకు నడుం బిగించింది. ఆ మేరకు 30-10-2025న ఆర్.సి నెం.5862/జనరల్/2023న ఫైర్ సర్వీసు విభాగంలో సరఫరా-అమర్చే సర్టిఫైడ్ ఏజెన్సీల ఎన్‌పానెల్‌మెంట్ దరఖాస్తులు కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది. ఇదీ కథ.
దేశంలో ఎక్కడా లేని కొత్త నిబంధనలకు ఏపీ అగ్నిమాపక శాఖతెరలేపింది. హోం శాఖలో కీలక నేతకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఒక వ్యక్తికి చెందిన ఫైర్ సేఫ్టీ ఏజెన్సీ కోసమే, ఈ కొత్త నిబంధన తెచ్చారని.. తమకు నచ్చిన కంపెనీలను ఎంపిక చేసుకునేందుకే ‘టర్నోవరు అర్హత’ రూపొందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్, ఇతర శాఖల్లో ఉండే టర్నోవరు నిబంధన, ఫైర్ సర్వీసులో తీసుకురావడమే వింత. ప్రభుత్వ నిధులతో ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో, ప్రైవేటు పెత్తనమే ఇప్పుడు హాట్ టాపిక్.
మరో వైపు కొత్తగా తెచ్చిన ఈ నిబంధనపై, సీఎంను తప్పుదారిపట్టించి తెచ్చిన ఈ జీఓ వల్ల.. రాష్ట్రంలో ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకున్న వేల మంది రోడ్డునపడతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు జగన్ ప్రభుత్వంలోనే ఇచ్చిన ఉత్తర్వును, అప్పటి డీజీనే పక్కనపెడితే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ దానిని దుమ్ముదులిపి అమలుచేయడంపైనే విస్మయం వ్యక్తమవుతోంది.
అసలు ఇది దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. ఫైర్ సర్వీసు డిపార్టుమెంటులో సర్టిఫైడ్ ఏజెన్సీ అన్నది దేశంలో ఏ రాష్ట్రంలోనే లేదు. నిజానికి ఈ పద్ధతి కార్మికశాఖ పరిథిలోని ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్‌లోనే ఉంది. ఏడాదికోసారి ఫ్యాక్టరీలు థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ చేయిస్తాయి. లేకపోతే వారిపై లీగల్‌గా చర్యలు తీసుకుంటారు.
కానీ ఫైర్ సర్వీసు శాఖలో ధర్డ్ పార్టీ ఏజెన్సీ ఎందుకు? ఇది ఎవరి కోసం? ఎవరి జేబులు నింపడం కోసం? అన్నదానిపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అంశాలను స్థానికంగా ఉండే ఫైర్ ఆఫీసర్, డిఎఫ్‌ఓ, ఆర్‌ఎఫ్‌ఓ, ఆపైన డీజీ పర్యవేక్షిస్తున్నారు. భవనాల ఎత్తు ప్రాతిపదికగా తనిఖీ చేసి అనుమతులు మంజూరు చేస్తున్నారు.
అదెలాగంటే… 10 మీటర్ల ఎత్తు భవనాలు ఉంటే దానిని స్థానిక స్టేషన్ ఫైర్ ఆఫీసర్, మరో ఇద్దరు సిబ్బంది కలసి తనిఖీ చేసి, ఫైర్ ఎన్‌ఓసీ ఇస్తున్నారు.
10 నుంచి 12 ఎత్తు భవనాలు ఉంటే దానిని డిఎఫ్‌ఓ, ఏడిఎఫ్‌ఓ, ఎస్‌ఎఫ్‌ఓ కలసి తనిఖీ చేసి ఫైర్ ఎన్‌ఓసీ ఇస్తున్నారు.
ఇక 12 నుంచి 15 మీటర్ల ఎత్తు భవనాలు ఉంటే దానిని ఆర్‌ఎఫ్‌ఓ, డిఎఫ్‌ఓ, ఎస్‌ఎఫ్‌ఓ కలసి తనిఖీ చేసి, ఫైర్ ఎన్‌ఓసీ ఇస్తున్నారు.
అదే 15 మీటర్ల ఎత్తు దాటిన భవనాలు ఉంటే.. దానిని డిజి పర్యవేక్షణలో ఆర్‌ఎఫ్‌ఓ, డిఎఫ్‌ఓ, ఎస్‌ఎఫ్‌ఓలతో కూడిన కమిటీ వేసి ఎన్‌ఓసీ మంజూరు చేస్తారు. ఇదీ ఫైర్ సర్వీసులో ఎన్‌ఓసీ మంజూరు చేసే ప్రక్రియ.
ఫైర్ సర్వీసు అధికారులు తమ తనిఖీల్లో.. ఆయా భవనాల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్లు, ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ తయారీ, వాటి మెటీరియల్ సప్లై పంప్ హౌస్, నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్‌బిసి) నిబంధనలు అక్కడ అందుబాటులో ఉన్నాయా లేవా అని పరిశీలించిన తర్వాతనే ఫైర్ ఎన్‌ఓసీ ఇస్తారు.
అంటే అగ్నిప్రమాదం జరిగితే.. దానిని వెంటనే నివారించాల్సిన పరికరాలు అక్కడ అందుబాటులో ఉన్నాయా లేవా అన్న ప్రాతిపదికకే ప్రాధాన్యం ఇచ్చి ఎన్‌ఓసీ మంజూరు చేస్తారు.
మరి ఈ పని ఈపాటికే ఫైర్ సర్వీసు శాఖ నిర్వహిస్తుండగా.. కొత్తగా సర్టిఫైడ్ ఏజెన్సీ వ్యవస్థను తెరపైకి తీసుకురావలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది ఎవరి కోసం? ఎవరి ప్రయోజనాల కోసం ఈ కొత్త వ్యవస్థ ఏర్పాటుచేశారన్న చర్చకు తెరలేచింది. హోంశాఖ తీసుకువచ్చిన ఈ కొత్త వ్యవస్థ వల్ల.. ఫైర్ సర్వీసు అధికారులు, సిబ్బంది పనిచేయడం లేదన్న సంకేతాలు వెళుతున్నాయి.
నిజానికి ఫైర్ సర్వీసు అధికారులు కూడా ఎన్‌బిసి నిబంధనల మేరకే అనుమతులివ్వాలి. ఇప్పుడు కొత్తగా హోంశాఖ తెరపైకి తెచ్చిన సర్టిఫైడ్ ఏజెన్సీలు కూడా అదే పనిచేయాలి. మరి తేడా ఏమిటి?
తేడా ఉంది.. అదెలాగంటే.. ఇప్పటివరకూ ఎవరైనా భవన నిర్మాణ దారులు లేదా ఫ్యాక్టరీలు గానీ ఫైర్ ఎక్విప్‌మెంట్లను తమకు నచ్చిన ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి, వారితో పనిచేయించుకునే పద్ధతి ఉండేది. పని ముగిసిన తర్వాత ఫైర్ డిపార్టుమెంట్ దానిని పరిశీలించి, అది ఎన్‌బీసీ నిబంధనల ప్రకారం ఉంటే సర్టిఫై చేసి ఎన్‌ఓసీ ఇస్తున్నారు.
కానీ ఇప్పుడు హోంశాఖ (ఫైర్ సర్వీసు) కొత్తగా తెరపైకి తెచ్చిన ఈ సర్టిఫైడ్ ఏజెన్సీ వ్యవస్థతో భవననిర్మాణదారులు, ఫ్యాక్టరీ యజమానుల జేబులు గుల్లయ్యే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటివరకూ వారంతా తమకు నచ్చిన ఏజెన్లీతోనో, లేదా వారే సొంతంగా మెటీరియల్ కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా.. సర్టిఫైడ్ ఏజెన్సీలతోనే వర్కు చేయించాలన్న నిర్ణయం తమను ఆర్ధికంగా నష్టపరుస్తోందన్నది వారి ఆందోళన.
అదెలాగంటే.. ఎవరైనా సరే ఈ సర్టిఫైడ్ ఏజెన్సీల ద్వారానే మెటీరియల్‌ను అవి చెప్పిన ధరలకే కొనుగోలు చేయాలి. పని కూడా వారు చెప్పిన ధరలకే అమర్చాలి. సప్లై, మెటీరియల్ అన్నీ వారు చెప్పిన ప్రకారమే చేయాలట. ఈ ఏజెన్సీలతో చేయించుకుంటేనే ఫైర్ సర్వీసు డిపార్టుమెంట్ ఎన్‌ఓసీ ఇస్తుందట.
ఉదాహరణకు ప్రస్తుతం ఒక మెటీరియల్ ధర మార్కెట్‌లో 25 వేల రూపాయలు ఉందనుకుందాం. వినియోగదారుడు మార్కెట్‌కు వెళ్లి దానిని 25 వేల రూపాయలకు కొనుగోలు చేసి, తనకు నచ్చిన ఏజెన్సీతో పనిచేయించుకుంటాడు. ఏజెన్సీ చెప్పిన రేటు తనకు నచ్చితే దానితోనే పనిచేయించుకుంటాడు. లేకపోతే మరో ఏజెన్సీని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ,అవకాశం వినియోగదారుడికి ఉంటుంది.
కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా.. సర్టిఫైడ్ ఏజెన్సీ వాడు బయట మార్కెట్‌లో 25 వేలకు దొరికే అదే మెటీరియల్‌ను 50 వేలకు బిల్లు వేసినా వినియోగదారుడు చెల్లించాల్సిందే. మరి ఇది ఎవరిని బతికించడానికి తెచ్చిన విధానం అన్నదే ప్రశ్న.
అసలు ఈ విధానం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఇదే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది విఫమమవడం, వినియోగదారులు వ్యతిరేకించటంతో దానిని పక్కనపెట్టారు. కానీ విచిత్రంగా తెలంగాణలో విఫలమయిన అదే విధానాన్ని ఇప్పుడు ఏపీపై రుద్దాలన్న ప్రయత్నమే వ్యతిరేకతకు కారణమవుతోంది.
అసలు ఈ విధానం కేవలం ఒకరిద్దరు బడా వ్యాపారులకు లబ్థి చేకూర్చేందుకే రూపొందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఎవరూ అర్హులు కాకుండా ఉండేందుకే.. ఏజెన్సీకి ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయలున్న ఏజెన్సీకి ఏ గ్రేడ్ గాను, కోటిన్నర రూపాయలు టర్నోవరు ఉన్న ఏజెన్సీని బి గ్రేడు గాను, 50 లక్షల టర్నోవరు ఉన్న ఏజెన్సీని సి గ్రేడుగాను, 25 లక్షల టర్నోవరు ఉన్న ఏజెన్సీని డి గ్రేడు గానూ విభజించారు.
ఇక భవనాలను కూడా గ్రేడ్ల వారీగా విభజించడం ఆశ్చర్యం. ఫైర్ ఎక్విప్‌మెంట్ వ్యాల్యూ 70 లక్షలు దాటితే ఏ గ్రేడు, 30-70 లక్షల వరకూ ఉంటే బి గ్రేడు, 5 నుంచి 30 లక్షల వరకూ ఉంటే సి గ్రేడ్, 5 లక్షల లోపు ఉంటే డి గ్రేడ్‌గా విభజించారు.
నిజానికి ఏపీలో ఆ స్థాయి వ్యాపారులెవరూ లేరు. ఏపీకి చెందిన వారే హైదరాబాద్‌లో ఈ వ్యాపారాలు చేస్తున్నారు. ఏపీలో ఎక్కువగా చిన్న-మధ్య స్థాయి ఫైర్ సేఫ్టీ ఏజెన్సీలే ఉన్నాయి. ఈ సంఖ్య 40 వరకూ ఉండవచ్చన్నది ఒక అంచనా. ఇప్పటివరకూ వినియోగదారులు వారితోనే పనులు చేయించుకుంటున్నారు. అయినా ఇదంతా పూర్తిగా వినియోగదారుడి స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారం.
అయితే ఈ పనులు చేయడానికి సహజంగా సామర్థ్యం, నైపుణ్యం కావాలి. పనిచేసే సిబ్బంది కావాలి. అంతేగానీ టర్నోవర్ నిబంధనలు ఎందుకు? పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి మాత్రమే ప్రభుత్వం టర్నోవరు నిబంధన విధిస్తుంది. అందులో ప్రభుత్వం నిధులుంటాయి కాబట్టి ఆ మేరకు నిబంధనలు విధిస్తుంది.
కానీ.. యజమానులే తమ సొంత ఖర్చులు పెట్టుకుని ఏర్పాటుచేసుకునే ఫైర్ ఎక్విప్‌మెంట్లపై హోం శాఖ (ఫైర్ సర్వీసు) అజమాయిషీ ఎందుకు? ఫలానా ప్రైవేటు నుంచి పనులు చేయిస్తేనే ఎన్‌ఓసీ ఇస్తామనే నిబంధనలు ఎందుకు? ఎవరి కోసం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి? ఎన్‌బిసి నిబంధనల ప్రకారం యజమానులే మెటీరియల్ కొనుగోలు చేసి, తమకు నచ్చిన ఏజెన్సీలతో పనులు చేయించుకుంటే. మధ్యలో ఈ సర్టిఫైడ్ ఏజెన్సీల ప్రమేయం, పెత్తనం ఎందుకని భవన యజమానులు ప్రశ్నిస్తున్నారు.
కాగా హోం శాఖలోని ఓ కీలక వ్యక్తితో.. చాలాకాలం నుంచి సన్నిహితంగా ఉండే ఓ ఫైర్ సేఫ్టీ ఏజన్సీ యజమాని కోసమే ఈ సర్టిఫైడ్ ఏజెన్సీని మళ్లీ తెరపైకి తీసుకువచ్చారన్న ప్రచారం జరుగుతోంది. సదరు వ్యాపారి తెలంగాణలో ఫైర్ సర్వీసు వ్యాపారం చేస్తున్న క్రమంలో, ఏపీలోనూ దానిని విస్తరించుకునేందుకు హోం శాఖలోని ఓ కీలక వ్యక్తితో తనకున్న పరిచయాలను వాడుకున్నారన్న ప్రచారం ఫైర్ సర్వీసు శాఖలో వినిపిస్తోంది. ఈ ‘కృష్ణ’మాయ అంతా ఆయన కోసమేనంటున్నారు. నిజం నారాయణుడికెరుక?!
‘ఫైర్’లో బ్రోకర్ రాజ్.. అంతా ‘దేవ’ రహస్యం!
ఫైర్ సర్వీసులో దశాబ్దాల నుంచి దళారీ వ్యవస్థ వర్ధిల్లుతోంది. ఫైర్ సర్వీసులో పనిచేసే అధికారుల్లో 70 శాతం మందికి సొంతగా ఏజెన్సీలు ఉన్నాయనదే బహిరంగ రహస్యమేనంటున్నారు. భార్య, బావమరుదుల పేర్లతో ఈ ఏజెన్సీలు నడుస్తున్నాయంటున్నారు. వీరిపై ఇప్పటికే ఏసీబీ, విజిలెన్సు కేసులున్నాయని గుర్తు చే స్తున్నారు. వీరి కంపెనీలతో ఫైర్ సేఫ్టీ పనులు చేయిస్తే, ఎన్‌ఓసీలు సులభంగా వస్తాయన్న ఆశతో అటు వినియోగదారులు కూడా వారికే పనులు ఇస్తున్న పరిస్థితి.
అసలు ప్రధాన కార్యాలయంలోనే.. గతంలో ఏసీబీకి పట్టుబడ్డ ఓ అధికారికి ఎన్‌ఓసీ బాధ్యత అప్పగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాటి డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నప్పుడు అక్రమార్కులకు చెక్ పెట్టడంతో, ఆయన ఉన్నంతకాలం ఎవరి ఆటలు సాగలేదు. ‘హోం’లోని కీలక వ్యక్తులు కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఏడాది జరిగిన బదిలీలో ‘హోం’లోని ఓ కీలక వ్యక్తి పక్షాన పనిచేసే సిబ్బంది భారీ మొత్తంలో వసూలు చేశారని, వాటిని నాటి డీజీ మాదిరెడ్డి తిరస్కరించడంతో.. బదిలీల కోసం ఇచ్చిన డబ్బును వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చిందని అప్పట్లో మీడియాలో కథనాలు కూడా రావడం ప్రస్తావనార్హం. ఆ తర్వాతనే మాదిరెడ్డి బదిలీ జరిగింది. ఇక అక్కడి మళ్లీ అక్రమార్కులకు రెక్కలు వచ్చాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఫైర్ సర్వీసు డీజీ పోస్టు కేవలం ఐపిఎస్‌లకే ఇస్తారు. కానీ ఇప్పుడు ఆ నిబంధన మార్చడం గమనార్హం. దేవదాయ శాఖలోనూ ఇలాగే జరిగింది. ఐపిఎస్ అధికారులకు మాత్రమే ఇచ్చే దేవదాయ శాఖ కమిషనర్ పోస్టును, ఇప్పుడు ఆ శాఖలో పదోన్నతిపై వచ్చిన నాన్ ఐఏఎస్ రామచంద్రమోహన్‌కు ఇవ్వడం తెలిసిందే. ఫైర్ ససర్వీసులోనూ అదే సూత్రం పాటించినట్లు కనిపిస్తోంది.
అయితే ఈ ఎన్‌ఓసీల వ్యవహారంలో అధికారుల ఆదాయం తక్కువేనని, బ్రోకర్లే ఎన్‌ఓసీల పేరిట లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారని చెబుతున్నారు. ‘‘ పాపం ఈ వ్యవహారంలో అధికారులకు పెద్దగా రావు. ఒక్కో ఎన్‌ఓసీకి 25,30 వేలు ఇస్తారు. కానీ బ్రోకర్లే ఎక్కువగా బాగుపడుతున్నారు. రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు పెద్ద బ్రోకర్లే ఫైర్ సర్వీసులో చక్రం తిప్పుతున్నార’’ని ఒక ఉద్యోగి వెల్లడించారు.