– చైర్మన్ నాయుడు వర్సెస్ జెఈఓ చౌదరి
– నాయుడు అవునంటే.. చౌదరి కాదనిలే..
– చౌదరి అవునంటే.. నాయుడు కాదనిలే..
– చౌదరి తీరుతో ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్లకు రోజూ అవమానమేనట
– చౌదరి పనితీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం
– ఎవరినీ లెక్క చేయని నిర్లక్ష్యం
– లోకేష్‌కు ఫిర్యాదు చేస్తే గానీ అనుమతించని సిఫార్సు లేఖలు
– పాలనపై ఈఓకు పట్టేదీ?
– – ‘కొండె’క్కిన క్రమశిక్షణ
తిరుమల పవిత్రతకు రాజకీయ మలినం.. మనం చూస్తూ ఊరుకుందామా? ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం. అనేది భక్తికి కేంద్రం కావాలి. కానీ కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నది అందుకు భిన్నం.
గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి విధ్వంస పాలనలో తిరుమలలో చోటుచేసుకున్న అపచారాలు, అవినీతి ఆరోపణలు, వ్యవస్థల వైఫల్యం.. ఇవి కేవలం పరిపాలనా లోపాలు మాత్రమే కాదు. ధార్మిక వ్యవస్థపై జరిగిన దాడులుగా చూడాలి. కల్తీ నెయ్యితో లడ్డు తయారీ నుంచి.. పరకామణి దొంగతనాన్ని “చిన్న విషయం”గా తేల్చడం వరకు, ఇవి అన్నీ తిరుమల పవిత్రతపై పడిన మచ్చలే.
ఇంకా దారుణం ఏమిటంటే, దొంగ చేత ఆలయానికి ఆస్తులు రాయించాం అని గొప్పగా చెప్పుకోవడం! దొంగతో రాజీ పడటం పాలన కాదే… అది వ్యవస్థల పరాభవం. రక్తంతో రాసిన అపచారం. పరకామణి కేసులో కాపలాదారుగా ఒక సీఐ మృతి చెందడం హత్యా? ఆత్మహత్యా? ఏదైనా కావొచ్చు. కానీ ఆలయ వ్యవహారంలో రక్తం చిందడం అంటే, వ్యవస్థ ఎంతగా కుప్ప కూలిపోయిందో చెప్పే నిశ్శబ్ద సాక్ష్యం సీఐ మృతి.
ఇంత జరుగుతున్నా.. నిత్యం ప్రవచనాలు చెప్పే పీఠాధిపతులు, ధార్మిక నేతలు పెదవి విప్పలేదు. ఐవైఆర్ కృష్ణారావు, అరవ సుబ్రమణ్య స్వామి లాంటి రాజకీయ దళారులు తేలుకుట్టిన దొంగల మాదిరి నోట్లో గుడ్డలు కుక్కుకుని మౌనంగా ఉన్నారు. ధర్మం కోసం గళం విప్పాల్సిన చోట, వారి సౌకర్యం కోసం మౌనం పాటిస్తున్నారు.
తెలుగు నాట టీవీ5 చానెల్‌ను, అప్రకటిత అనధికార తెలుగుదేశం చానెల్‌గా భావించే వారు ఉన్నారు. జగన్ పాలనలో టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు, ఆ చానెల్ సీఈఓ మూర్తి పై కేసులు, వేధింపులు, విచారణలు జరిగాయి. కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ అయ్యారు.
టిడిపి ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ బిఆర్ నాయుడిని సహజంగానే వ్యతిరేకిస్తారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందే.. టిడిపి అధినేత చంద్రబాబు తో, బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ కోరికను వెళ్ళబుచ్చడం.. సహజంగానే మొహమాటస్తులయిన చంద్రబాబు సరే అనో.. చూద్దాం అనో అన్నారని సమాచారం.
కూటమి గెలుపు కోసం.. అంతకు ముందు అమరావతి ఉద్యమం కోసం, టీవీ5 పూర్తిగా అంకితమైన విషయం అందరికి తెలిసిందే. కూటమి పార్టీల నుండి ఎటువంటి ఆర్థిక సాయం పొందకుండా, టీవీ5 తన హార్థిక వార్తా కథనాల ఊచకోత ప్రసారాలు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బిఆర్ నాయుడు భేటి సందర్భంగా, టిటిడి చైర్మన్ పదవి ప్రస్తావన మళ్లీ వచ్చింది. ముఖ్యమంత్రి మదిలో బిఆర్ నాయుడిని ఎంపీగా పెద్దల సభకు పంపించాలనే ఆలోచన వ్యక్తపరిస్తే… బిఆర్ నాయుడు తెలివైన వారు. ఆయనకు తెలుసు. గట్టిగా పట్టుబట్టక పోతే ఉన్నదీ పోతుంది. రాజ్యసభ పోతుందని!
నేను ఈ వయసులో ఢిల్లీ వెళ్ళడం కంటే, స్వామి వారికి ఇక్కడే ఉండి సేవ చేసుకుంటాను అనే అభిప్రాయాన్ని బిఆర్ నాయుడు వ్యక్తపరచడం… చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి . కానీ ఆయన తీసుకునే నిర్ణయంలో, కమ్మ కులం కనిపించ కూడదు. దానికి సాక్ష్యం చంద్రబాబు ముఖ్యమంత్రిగా టిటిడి చైర్మన్ స్థానంలో, కమ్మ కులానికి చెందిన వ్యక్తిని ఇప్పటి వరకు నియమించలేదు.
కాంగ్రెస్ పాలనలో , వైసీసీ పాలనలో అనేక మంది రెడ్ల ని టిటిడి చైర్మన్ పదవి వరించింది. పూర్వాశ్రమంలో నాస్తికుడు, తిరుమల స్వామి విగ్రహాన్ని నల్లరాయితో పోల్చినవాడు, వైఎస్ కుటుంబంతో వియ్యం అందుకుని, కూతురుకు క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి తంతు జరిపించిన కరుణాకర్ రెడ్డి రెండు సార్లు టిటిడి చైర్మన్ అయ్యారు.
జగన్ పిన్ని భర్త సుబ్బారెడ్డి కూడా టీటీడీ చైర్మన్ గా వెలగబెట్టారు. మరోసారి వైసీసీ అధికారంలోకి వస్తే, టిటిడి చైర్మన్ గా ఏ బుక్కారెడ్డో తిక్కారెడ్డో రప్పా రెడ్డో టిటిడి చైర్మన్ అవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. ఎట్టకేలకు టిటిడి చైర్మన్ గా బిఆర్ నాయుడు ఎంపిక జరిగింది..
తిరుమల అనేది ఒక రాజకీయ ప్రయోగశాల కాదు. అధికారుల అహంకార ప్రదర్శన స్థలం అంతకంటే కాదు. కూటమి ప్రభుత్వంలో కొంత మంది అధికార మదంతో, టిటిడి ని నిత్యం వివాదాల వేదికగా మారుస్తున్నారు. గతంలో పనిచేసిన ఈఓ శ్యామలరావుతో పాటు, జెఈఓ వెంకయ్య చౌదరికి చైర్మన్ బిఆర్ నాయుడితో సఖ్యత ఉండేది కాదు.
తిరుమల పరిసరాల చెత్తను తొలగించడానికి ఒక ప్రైవేటు సంస్థ.. ఆ చెత్తకు కోట్లు ఎదురు చెల్లించి, ఆ చెత్తను తీసేస్తాం అని ముందుకు వస్తే సహేతుక కారణాలు చూపించకుండా.. నాటి ఈఓ అడ్డుకోవడంపై ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. చివరకు శ్వామలరావు బదిలీ వరకు వెళ్లింది.
తెలుగుదేశం ప్రభుత్వంలో 2017 18 మధ్య ఈఓ గా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ జగన్ ప్రభుత్వంలో కూడా కొనసాగడం, ప్రస్తుతం మళ్లీ సింఘాల్ ఈఓ గా కొనసాగడం అంటే.. ఆయన ఢిల్లీ స్థాయిలో ఎంత శక్తిమంతుడో అర్ధం చేసుకోవచ్చు..
ఇక తిరుమల స్టోరీలో కీలకమైన వ్యక్తి చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి 2005 ఐఆర్‌ఎస్ బ్యాచ్ అధికారి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసు నుండి డిప్యుటేషన్ మీద ఆంధ్రకు తీసుకు వచ్చి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వైస్ చైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు.
జగన్ ప్రభుత్యం లో మరో సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ ను వేధించడం, సీఐడీ కేసు నమోదు చేయడం, హైకోర్టు వరకు విషయం వెళ్లింది. మరో డిజిపి ర్యాంక్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు సైతం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలిసిందే.. కమ్మ అధికారుల లిస్ట్ తెప్పించి మరీ, జగన్ ప్రభుత్యం వేదింపులకు పాల్పడింది అన్నది బహిరంగ రహస్యమే.. మరి వెంకయ్య చౌదరి, జగన్ బారిన పడకుండా ఎలా తప్పించుకోగలిగారు అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది.
నాడు కేంద్రంలో బీజేపీ పార్టీలో కీలకంగా ఉన్న సుజనా చౌదరి ఆశీస్సులతో, బీజేపీ కోటలో సేఫ్ జోన్ లోకి వెళ్ళారనే వార్త విస్తృత ప్రచారంలో ఉంది. మైనింగ్ ప్రక్రియలో వెంకయ్య చౌదరి అపారమైన అనుభం గడించారట.. ఈయన గారి అనుభవాన్ని, నాటి వైసీపీకి బదిలీ చేస్తే.. వైసీపీ పెద్దలు లాభపడ్డారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
నాడు మైనింగ్ సీనరేజ్ వసూలు చేసుకోవడానికి ఏ. మహేశ్వర్ రెడ్డి , గిరీష్ రెడ్డి స్థాపించిన ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టింది జగన్ సర్కార్. కూటమి ప్రభుత్వంలో కూడా అదే ఏఎంఆర్ రంగ ప్రవేశం చేయడంలో మన వెంకయ్య చౌదరి ప్రముఖ పాత్ర పోషించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
వెంకయ్య చౌదరి ప్రవర్తన- నడవడిక పై ఒక ఛానల్ లో ఇటీవల వార్త ప్రసారం అయితే, ఆ చానల్ యజమానికి జూబ్లీహిల్స్ ముఠా ఒకరి తరువాత మరొకరు, ఆ వార్త తీసేయమని ఫోన్ కాల్స్ వర్షం కురిపించారట.
చైర్మన్ బిఆర్ నాయుడు ఎస్ అంటే జెఈఓ వెంకయ్య నో అంటారని.. జెఈఓ ఎస్ అంటే బిఆర్ నాయుడు నో అంటారని, పరిస్థితి ఇద్దరికి మధ్య ఉప్పు-నిప్పు మాదిరి తయారయ్యింది అనేది కొండ పై నుండి, క్రిందకు అందుతున్న సమాచారం.
వెంకయ్య చౌదరి ప్రవర్తన గురించి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వంలో ముగ్గురికి నామినేటెడ్ పదవులతో పాటు, క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పించారు. అందులో ఒకరు ఏపీ మహిళా కమీషన్ చైర్మన్ రాయపాటి శైలజ. ఆమె తిరుమల వెళితే పట్టించుకున్న నాధుడే లేడు.. విషయం మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లింది. అంతే. తిరుమల దర్శనాలకు మహిళా కమీషన్ చైర్మన్ టీటీడీ దర్శనం సిఫారసు లెటర్స్ జారీ చేసే అవకాశం కల్పించారు.
ఇక మరో కేబినెట్ ర్యాంక్ హోల్డర్ ఎస్సీ కమీషన్ చైర్మన్ జవహర్ గట్టిగా పట్టుబడితే.. వారంలో రెండో, మూడో లెటర్స్ కు అనుమతించారట మన వెంకయ్య చౌదరి. ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ది కూడా క్యాబినెట్ ర్యాంకే. ప్రెస్ అకాడమీకి అంతకు ముందు టిటిడి దర్శన సిఫారసు ఉండేది. తనకు అవకాశం కల్పించమని జేఈఓ వెంకయ్య చౌదరికి మెయిల్, వాట్సప్ సందేశం, ఫోన్ కాల్స్ సైతం చేసినా ఇప్పటికీ కనీసం స్పందించక పోవడం ఆయన అధికార దురహంకారానికి పరాకాష్ట అని చెప్పాచ్చు .
స్వయంగా ఒక మీడియా సంస్థ అధిపతి టిటిడి చైర్మన్ గా ఉండి కూడా, ప్రెస్ అకాడమీ పై వివక్షకు ఎవరు బాధ్యులు ? వైసీపీ పాలనలో టీటీడీ దర్శనాల విచ్చలవిడి తనానికి లెక్కే లేదు. నాడు టిడిపి ఎమ్మెల్యేల లెటర్స్ కూడా పక్కన పెట్టే వారు.
నేడు వైసీపీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ దర్శనాలు జరుగుతున్నాయి. జరగాలి. అది వారి హక్కు కాబట్టి. అదనంగా వెంకయ్య చౌదరి, వైసీపీ మానవ మానవతా సంబంధాలు అదనం కాబట్టి .. వైసీసీ వారు ఎటువంటి ఇబ్బందులు, అవమానాలు పడాల్సిన పరిస్థితి లేదు.
ఇక కొంత మంది చీపు ప్రజా ప్రతినిధులు దర్శన సిఫారసులు అమ్ముకుంటున్నారేనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నియోకవర్గంలో నాయకులకు, క్యాడర్ కు దర్శన భాగ్యం కల్పించకుండా, ఇతర రాష్ట్రాలవారు ఎలా ఈ లేఖలలో దర్శనం చేసుకుంటున్నారో ఆ పెరుమాళ్లు కే తెలియాలి..
తిరుమల ప్రాంగణం కోట్లాది మంది భక్తుల ఆత్మీయ విశ్వాసం. ఆ విశ్వాసం దెబ్బతింటే ధార్మిక వ్యవస్థ కూలిపోతుంది . సమయం మించి పోలేదు. తిరుమల ధార్మిక పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. స్వయంగా ఆ దేవ దేవుడు మా ఇలవేల్పు అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ‘కొండ’పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది.
– శుభకర్ మేడసాని
(జర్నలిస్ట్)