సినిమా అనేది కళ. కళ అనేది మనుషుల భావాలను, విలువలను, సమాజానికి అవసరమైన సందేశాలను ప్రతిబింబించాల్సిన మాధ్యమం. కానీ నేటి పరిస్థితుల్లో కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఈ కళను వ్యాపారంగా మాత్రమే కాకుండా, స్త్రీల గౌరవాన్ని కించపరిచే మార్గంగా ఉపయోగించడం చాలా బాధాకరమైన విషయం.
సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటే ఆడవారు పూర్తిస్థాయిలో అంగ ప్రదర్శన చేయాలి, కమిట్మెంట్లు ఇవ్వాలి అనే భావన చాలా సిగ్గుపడవలసినది. ఇది కళ కాదు, ఇది మనుషుల విలువలను తొక్కేసే దుర్మార్గం. ప్రతి స్త్రీ తన జీవనోపాధి కోసం, తన పిల్లల భవిష్యత్తు కోసం, కుటుంబ బాధ్యతల కోసం కష్టపడుతూ ముందుకు సాగుతుంది.
అలాంటి మహిళల బలహీనతలను, అవసరాలను అవకాశంగా తీసుకొని దుర్వినియోగం చేయడం మానవత్వానికి అవమానం. శారీరక ప్రదర్శనకు బలవంతంగా ఒప్పించడం, ఒప్పుకోకపోతే అవకాశాలు ఇవ్వకపోవడం అనేది స్పష్టమైన మానసిక, సామాజిక హింస. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ విధమైన పోకడలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్త్రీని ఒక కళాకారిణిగా కాకుండా ఒక వస్తువుగా చూడటం అనేది అత్యంత దిగజారిన ఆలోచన.
స్త్రీని గౌరవించడం ప్రతి ఒక్క మనిషి బాధ్యత. తల్లి, చెల్లి, భార్య, కూతురు అనే సంబంధాలను పక్కన పెట్టి, ఒక స్త్రీని అవమానించడం అనేది ఆ వ్యక్తి సంస్కారాల లోపాన్ని తెలియజేస్తుంది.
సమాజంలో అనేకమంది మహిళలు అవకాశాలు లేక, ఆర్థిక ఇబ్బందులతో, పిల్లల చదువుల కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. వారి కష్టాలను ఆసరాగా చేసుకొని కొంతమంది మూర్ఖులు వారిని తప్పుదోవ పట్టించడం ద్వారా సమాజాన్ని, కుటుంబాలను నాశనం చేస్తున్నారు.
ఈ విధమైన ప్రవర్తనలు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి ప్రమాదకరం. ఇవి యువతపై తప్పు ప్రభావం చూపుతాయి. మహిళలపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. నైతిక విలువలను కూల్చివేస్తాయి. కళ అనే పేరుతో అసభ్యతను ప్రోత్సహించడం సమాజ పురోగతికి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు.
కాబట్టి సినిమా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతిభకు, కృషికి, నైతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్త్రీని గౌరవంతో చూసే సంస్కృతి పెంపొందించాలి. చట్టాలు కఠినంగా అమలవ్వాలి, బాధితులకు ధైర్యం కల్పించాలి. అప్పుడే నిజమైన కళ వికసిస్తుంది, ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమవుతుంది.
స్త్రీ గౌరవమే సమాజ గౌరవం.ఆ గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. పొట్ట కూటి కోసం రికార్డింగ్ డాన్స్ చేసి మహిళలను పోలీసులు ఆపేస్తారు, రికార్డింగ్ డాన్సులు చేసే మహిళలు కొద్దిగా పొట్టి డ్రెస్సులు వేసుకొని డాన్సులు చేస్తారు. కొంచెం అశ్లీలతగా కనిపించినా, ప్రభుత్వం బ్యాన్ చేసింది. మరి సినిమా, టివి లో .. రికార్డింగ్ డాన్సులు చేసే వారి కన్నా దారుణం గా ఎక్స్పోజింగ్ చేస్తున్న మహిళలు పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?
రికార్డింగ్ డాన్సులు లు వేసుకుంటే అశ్లీలం. అదే సినిమా లో, టీవీ షో వేసుకుంటే స్త్రీ స్వేచ్ఛ. . ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల్లో మహిళా కమిషన్ తక్షణమే స్పందించాలి.. భారతదేశంలో పుట్టిన ప్రతి మహిళ కూడా సాంప్రదాయాన్ని గౌరవించాలి. ఇతర మతస్తుల్లో వస్త్రాధారణ లో మార్పు కోరడం లేదు. కానీ మన హిందూ స్త్రీలలోనే వస్త్రధారణలో అర్థ నగ్నంగా తిరగాలని ఆలోచన ఎందుకు ఉండాలి? మన సంప్రదాయాన్ని గౌరవించాలి కదా? స్త్రీకి నిండుగా ఎవరికి నచ్చిన దుస్తులు వారు వేసుకునే స్వేచ్ఛ ఉంది.
-వరలక్ష్మి
(హెవెన్ హోమ్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు)