ఓ.పీ. నయ్యర్ లేదా ఓంకార్ ప్రసాద్ నయ్యర్. భారతదేశంలోని ప్రముఖమైన చలన చిత్ర సంగీత దర్శకుల్లో ఒకరు. 1926- 2007ల కాలానికి చెందిన ఆయన్ను గుర్తుచేసుకుందాం రండి –
భారతదేశ చలనచిత్ర సంగీతదర్శకుల్లో గొప్పవారెందరో ఉన్నారు. వాళ్లల్లో దార్శనికులు, ఒరవడి సృష్టి కర్తలు (trend setters) కొందరే. ఓ.పీ. నయ్యర్ ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్ని పాటల మధ్యలోనైనా ఇది ఓ.పి. నయ్యర్ పాట అని తెలిసిపోతూ ఉంటుంది. విలక్షణమైన పాటల సృష్టికర్త ఆయన. ఒక ప్రత్యేకతతో ఉంటుంది ఆయన పాట. భారతదేశ సినిమా పాటల సంగీతాన్ని ఓ.పీ. నయ్యర్ సంగీతం పెద్ద ఎత్తున కదిలించింది.
ఇతర భాషల్లోని గొప్ప సంగీత దర్శకులు కూడా ఓ.పీ. నయ్యర్ ప్రభావంతో పాటలు చేశారు. శంకర్-జైకిషన్ తరువాత దేశాన్ని ఊపేసిన సంగీత దర్శకుడు నయ్యర్. సలిల్ చౌధరీ ట్రెండ్ సెట్టర్ అయినా, విద్వత్, ప్రజ్ఞ పరంగా నయ్యర్ కన్నా సలిల్ గొప్ప అయినా నయ్యర్ అంత జన ప్రసిద్ధి(popularity)ని పొందలేదు.
లాహోర్ లో పుట్టిన నయ్యర్ అక్కడే ఒక సంగీత కళాశాల్లో పియానో ఉపాధ్యాయుడుగా పని చేశారు. 1951లో హిందీ సినిమాల్లోకి వచ్చారు. 1952లో తొలి సినిమా ఆస్మాన్ చేశారు. ఆ సినిమా పరాజయం పొందింది. ఒక దశలో నయ్యర్ సినిమాల్ని వదిలి వెళ్లిపోదామనుకున్నారు. 1954లో వచ్చిన గురుదత్ సినిమా ఆర్‌పార్ ఓ.పీ.నయ్యర్ కు తొలి హిట్ సినిమా. 1956లో వచ్చిన సీ.ఐ.డీ. సినిమాతో ఒ.పీ.నయర్ సంగీతం దేశాన్ని ఒక ఊపు ఊపేసింది.
ఆ సినిమాలోని “ఒలెకే పెహలా పెహలా ప్యార్…”. పాట ఒక సంచలనాన్ని సృష్టించింది. ఆ పాట “ఓహో బస్తీ దొరసానీ…” అంటూ తెలుగులోనూ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. సీ.ఐ.డీ. సినిమాతో నయ్యర్ ఒక నక్షత్ర సంగీత దర్శకుడైపోయారు. రిత్మ్ (rhythm) కింగ్ గా పేరు పొందారు. ఓ.పీ. నయ్యర్ అన్న ముద్ర సినిమా సంగీతంలో ఏర్పడింది.
ఎన్నో విలువైన పాటల్ని చేశారు ఓ.పి. నయ్యర్. “బాబూజీ ధీరే చల్నా…” గీతా రాయ్ ఆర్‌పార్ సినిమాలో పాడిన ఈ పాటతో నయ్యర్ ముద్ర భారతదేశ సినిమాల్లో నమోదయింది. ఒక కొత్త ఒరవడికి అది ఆది. అదే సినిమాలో షంషాద్ బేగం పాడిన “కభిఆర్ కభి ప్యార్…” మరో విలక్షణమైన పాట. ఏక్ ముసాఫిర్ ఏక్‌హసీనా(1962) లో ఓ.పీ. నయ్యర్ చేసిన “మే ప్యార్ క రాహీ హున్…” ఒక ప్రత్యేకమైన పాట.
స్వతహాగా పియానో వాద్యకారుడు కావడంతో ఓ.పి.నయ్యర్ పాశ్చాత్య పోహళింపుతో పాటలు చేశారు. బహారే ఫిర్ భి ఆయేంగీ(1968) సినిమాలో మొహమ్మద్ రఫీ పాడిన “ఆప్ కే హసీన్ రుఖ్ … ” పాట నయ్యర్ చేసిన గొప్ప పాటల్లోనే గొప్ప పాట. మనదేశంలో వచ్చిన గొప్ప పియానో పాటల్లో ఒకటి అది. కశ్మీర్ కీ కలీ(1964) సినిమాలో రఫీ పాడిన “హాయ్ దునియా ఉసికీ జమానా…” పాటను నయ్యర్ శాస్త్రీయ సంగీత ఛాయతో ఉన్నతంగా చేశారు.
ఆ కశ్మీర్ కి కలీ సినిమాలో “ఇషారో ఇషారో ..” పాట నయ్యర్ ఒక గొప్ప సంగీత దర్శకుడు అన్న అవగాహననిస్తుంది. చివరి దశలో 1972లో ఇక్ బార్ ముస్క్‌రా దో సినిమాలో కిషోర్ కుమార్ పాడిన “ఇక్ బార్ ముస్క్ రా దో…” అన్న outlandish పాట చేశారు నయ్యర్. అంతవరకూ చేసిన సంగీతానికి భిన్నంగా వేఱే flavour తో చేశారు ఈ పాటను.
గాయని ఆశాభోస్లే పరిణతి పొందిన గొప్పగాయనిగా పరిణమించింది నయ్యర్ సంగీతంలోనే. సజ్జాద్ హుసైన్ 1952లోనే సంగ్‌దిల్ సినిమాలో “దర్దూ భరీ కిసి…” అని పాడించి ఆశా ఒక మంచి గాయని అని లోకానికి తెలియపరిచినా “జరా సీ బాత్ కా…” అంటూ ముసాఫిర్ ఖనా (1955) సినిమాలో నయ్యర్ సంగీతంలో పలికిన ఆశా గానం అటుతరువాత ఎంతో రాణించింది. ఎన్నో పాటలుగా రాజిల్లింది.
సంగీతం పరంగా నయ్యర్ ఆశా కోసం అద్భుతాల్ని సృష్టించారు. మేరే సనమ్ (1965) సినిమాలో నయ్యర్ ఆశాతో “జాయియే ఆప్ కహా జాయేంగే…” అన్న అద్భుతాన్ని పాడించారు. నయ్యర్ అలా ఓ పాటను ఎలా చెయ్యగలిగారో? నయ్యర్ ఒక ఉన్నతమైన సంగీత దర్శకుడనడానికి ఆ పాటొక్కటే చాలు.
1966లో వచ్చిన యే రాత్ ఫిర్ న ఆఎగీ సినిమాలోని పాట “ఫిర్ మిలోగే కభీ ఇస్ బాత్…”
ఈ “ఫిర్ మిలోగే కభీ ఇస్ బాత్…” సాహితీ రూపం ప్రకారం గజల్. హిందీ సినిమాలో మదన్ మోహన్ చేసిన గజళ్లు గొప్పవి.
గజళ్లకు మదన్ మోహన్ ఉదాత్తంగా సంగీతం చేశారు. అంతే ఉదాత్తంగా రోషన్ (“జిందగీ భర్ నహీన్ భూలేగీ…” వంటివి), సీ. రామ్‌చంద్ర (“మొహబ్బత్ హీ న జో సమ్‌ఝే వో జాలిమ్ ప్యార్ క్యా జానే…” వంటివి) కూడా చేశారు.
“ఫిర్ మిలోగే కభీ ఇస్ బాత్…” అంటూ ఎస్.హెచ్. బీహారీ రాసిన గజల్‌ను ఎంతో ఉదాత్తంగా సంగీతబద్ధం చేశారు నయ్యర్. పాటను దాద్రా తాల్, యమన్ కల్యాణ్ రాగంలో చాల గొప్పగా చేశారు నయ్యర్. Low notesతో high notesను గొప్పగా అల్లి మన ఉల్లాలను కొల్లగొట్టారు నయ్యర్ ఈ పాటతో. గొప్ప aesthetic senseతో ఈ పాటను చేశారు నయ్యర్. మంచి వాద్య సంగీతంతో పాట అత్యంత మనోజ్ఞంగానూ, హృదయంగమంగానూ ఉంటుంది.
లతా మంగేశ్కర్‌తో ఒక్క పాట కూడా నయ్యర్ పాడించలేదు. లతతో పాడించకుండా రాణించగలిగిన ఒకే సంగీత దర్శకుడు నయ్యర్ మాత్రమే. నయ్యర్ మూడేళ్ల పాటు రఫీతో కూడా పాడించలేదు. ఆ తరువాత రఫీతో పాడించనందుకు బాధపడ్డారు. రఫీతో పాడించని కాలంలో మహేంద్రకపూర్ తో పాడించారు. అందువల్ల నయ్యర్ సంగీతం నాణ్యత తగ్గిన మాట వాస్తవం. ఈ వ్యాస రచయితతో ఒక సందర్భంలో తాను నయ్యర్ కు ఋణపడి ఉన్నానని మహేంద్రకపూర్ చెప్పారు.
దక్షిణభారతదేశంలోనూ, తెలుగులోనూ వచ్చిన కొన్ని పాటలపై ఓ.పీ.నయ్యర్ ప్రభావం ఉంది. తెలుగులో సంగీత దర్శకుడు సత్యం నయ్యర్ ప్రభావంతో పాటలు చేశారు. సత్యం చేసిన “ఏ దివిలో విరిసిన పారిజాతమో…” నయ్యర్ ప్రభావంతో చేసిన పాటే. ఎంతో గొప్ప సంగీతదర్శకుడైన ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్ నయ్యర్ ప్రభావంతో పాటలు చేశారు.
అందమాన్ కాదలి సినిమాలో విశ్వనాదన్ “అందమానై పారుంగళ్ అళ్షగు…” అన్న పాటను పూర్తిగా నయ్యర్ ప్రభావంతో చేశారు. సిఱై అన్న సినిమాలో “జాయియే ఆప్ కహా జాయేంగే…” పాట పల్లవిని దాదాపుగా అలాగే తీసుకుని “ఎనక్కు నీయుమ్ ఉనక్కు నానుమ్…” అన్న పాటను పీ. సుశీల చేత పాడించారు విశ్వనాదన్. మణిశర్మ చేసిన కొన్ని పాటలపై నయ్యర్ ప్రభావం తెలుస్తూ ఉంటుంది.
ఓ.పీ.నయ్యర్ 1988లో నీరాజనం తెలుగు సినిమాకు సంగీతం చేశారు. దీనికి ఉత్తమ సంగీత దర్శకుడుగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొహమ్మద్ రఫీ తరువాత భారతదేశంలోనే ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడని నయ్యర్ తేల్చి చెప్పడం విశేషం. మనం సంతోషించాల్సిన విషయం.
భారతదేశ సినిమా సంగీతంపై ఒక చెరగని ముద్ర ఓంకార్ ప్రసాద్ నయ్యర్ లేదా ఓ.పీ. నయ్యర్.

9444012279