– అమెరికాను అడుక్కుతినే స్థాయికి దిగజార్చిన ట్రంప్
అమెరికాను అడుక్కతినే స్థాయికి దిగజార్చేస్తాడు ట్రంప్. వెర్రి మొర్రి మాటలు, పిచ్చి చేష్టలతో అగ్రరాజ్యం నవ్వులపాలౌతున్నది. కెనడా, మెక్సికో తిరుగుబాటుతో అమెరికాలోని పరిశ్రమలు మూత, రైతుల హాహాకారాలు. వెనిజువెలా పెద్ద గుదిబండగా మారబోతున్నది. ప్రపంచ రాజకీయాలు కొత్త బాట పట్టబోతున్నాయి
భవిష్యత్ చైనా, భారత్, దేశాలదే కాబోతుంది. కోతికి కొబ్బరి చిప్ప దొరకడం, అమెరికన్ అధ్యక్ష పదవి డోనాల్డ్ ట్రంప్ చేతికి చిక్కడం ఒకటిగానే వుంది. తన పిచ్చి చేష్టలతో, వెర్రి మొర్రి ఆలోచనలతో ప్రపంచం యావత్తును చిందర వందర చేసి పారేస్తున్నాడు. ఆ క్రమంలో అమెరికా కూడా అడుక్క తిని బ్రతకవలసిన స్థాయికి చేరిపోయేట్లు వుంది. ట్రంప్ మాటలలో కానీ, చేతలలో కానీ, చేష్టలలో కానీ, నిర్ణయాలలో కానీ అణువంత హేతుబద్ధత కన్పించడం లేదు.
చీకట్లో రాళ్లు విసిరినట్లుగా విధానపర నిర్ణయాలు తీసుకొంటున్నాడు. వాటి ప్రభావం ఎక్కడ, ఎంత దూరం ప్రసరిస్తుందో ఆలోచన కూడా చేయడం లేదు.
తానొక దేశాధ్యక్షుడనని, ఆ హోదాకు కొన్ని బాధ్యతలు వుంటాయన్న స్పృహ ఈషన్మాత్రం లేదు. అమెరికా తుమ్మితే ప్రపంచం మొత్తానికి ముక్కు కారే పరిస్థితులున్నాయి కాబట్టి, ఏ నిర్ణయం తీసుకొన్నా ఆలోచించి తీసుకోవాలన్న విచక్షణ లేదు. పిచ్చాస్పత్రిలో గొలుసులు వేసి కట్టేయవలసిన మానసిక స్థితి కల్గిన వాడిని, అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టిన అమెరికా పౌరుల వివేకం ఎంత గొప్పదో కదా అన్పిస్తున్నది. తన మాట వినని దేశాల మీద పన్నుల మోత మోగిస్తే, ఆ దేశాలన్నీ తన కాళ్ల దగ్గర సాగిలపడతాయని ఆశపడ్డాడు ట్రంప్.
భారతదేశం మీద కూడా 50 శాతం పన్నులు విధించాడు. కానీ చివరకు ఏమైంది? అమెరికన్ పౌరులు ఆ అదనపు పన్నుల భారం మోయవలసి వస్తున్నది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయి, ఆ దేశ ప్రజలు అల్లాడి పోతున్నారు.
పొరుగు దేశాలపై దుందుడుకు తనం
కెనడా, మెక్సికోలు పొరుగు దేశాలు. ఎన్నో ఏళ్లుగా ఒకటే దేశం అన్నంత సన్నిహితంగా మసలుకొంటున్నారు. కెనడా నుంచి అమెరికాకు రాకపోకలకు ఆంక్షలు లేవు. స్వేచ్ఛగా వచ్చి, పోవచ్చు. వ్యాపారంలో అడ్డంకులు లేవు. అమెరికాలో తయారయ్యే కార్లు, ఇతర యంత్ర పరికరాలకు మెక్సికో, కెనడా నుంచి విడి భాగాలు వస్తాయి. ఉన్నట్లుండి, కెనడా దేశాన్ని అమెరికాలో కలిపేస్తున్నాను, 51వ రాష్ట్రంగా మారుస్తాను అన్నాడు ట్రంప్.
అమెరికా విస్తీర్ణం 98 లక్షల చదరపు కిలోమీటర్లయితే, కెనడా విస్తీర్ణం 99 లక్షల చదరపు కిలోమీటర్లు; అంటే అమెరికా కంటే పెద్ద దేశం. దాన్ని తమలో ఒక రాష్ట్రంగా కలుపుకొంటానని ట్రంప్ అన్నాడంటే, అతడి బుర్రలో ఉండేది బంక మన్ను మాత్రమే అని అర్ధం. ఫలితం ఏమైంది? అమెరికాతో తెగతెంపులకు సిద్ధమై పోయింది కెనడా. ఎన్నో దశాబ్దాలుగా ఆవు పక్కన దూడ వలె మెలగిన కెనడా, ఒక్కసారిగా అమెరికాను పక్కనపెట్టి, ఐరోపా, ఆసియా దేశాలతో వ్యాపార ఒప్పందాలు చేసుకొంటున్నది.
ట్రంప్ వలె వాగాడంబరం లేదు
కెనడా ప్రధాని మార్క్ కార్నే గుట్టు చప్పుడు కాకుండా చైనాతో, ఫ్రాన్స్ వంటి దేశాలతో ఒప్పందాలు చేశాడు. దెబ్బకు అమెరికా దిమ్మ తిరిగిపోయింది. అమెరికాలో సాగయ్యే మొక్కజొన్న పంటకు కావలసిన పొటాష్ ఎరువు 90 శాతం కెనడా నుంచి వస్తుంది. అది ఆగిపోవడంతో రైతులు హాహాకారాలు చేస్తున్నారు. అమెరికాలో తయారయ్యే కార్లు, యంత్ర పరికరాలకు 80 శాతం విడి భాగాలు కెనడా, మెక్సికోల నుంచి వస్తాయి. అవి ఆగిపోవడంతో అమెరికాలో కార్ల కంపెనీలు మూతపడి, వేలాది మందికి ఉద్యోగాలు వూడుతున్నాయి.
ఎలక్ట్రిక్ కార్లు, కంప్యూటర్ చిప్‌లు వంటి వాటికి కావలసిన అరుదైన మన్ను, కెనడా నుంచి సరఫరా అవుతుంది. అది ఆగిపోవడంతో అమెరికన్ పారిశ్రామిక రంగం సంక్షోభంలో పడిపోయింది. కెనడా ఆయిల్ మీద ఆధారపడిన అమెరికన్ రిఫైనరీలు మూతపడి పోతున్నాయి. కెనడా మీద యురేనియం కోసం ఆధారపడిన అమెరికన్ న్యూక్లియర్ కేంద్రాలు ప్రమాదంలో పడిపోతున్నాయి. అమెరికన్ అధికారులు లబోదిబో మంటున్నారు. సాక్షాత్తు ట్రంప్ కూడా కెనడా ప్రధానికి ఫోన్ చేశాడు.
కానీ మీతో మాకు బంధం వద్దు పొమ్మన్నేయడంతో ట్రంప్ ముఖం కరెంట్ షాక్ తగిలిన కాకి వలె మాడిపోయింది. కెనడా సరఫరా చేసే పదార్ధాలు, వస్తువులకు ప్రత్యామ్నాయం చూసుకోవడం అంత సులభం కాదు. అందుకు ఎన్నో ఏళ్లు సమయం పడుతుంది. అంతవరకు పరిశ్రమలు మూసుకోలేరు; ఉద్యోగాలు వదలుకోలేరు. మరొక ప్రక్క హఠాత్తుగా పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయో అమెరికన్ ప్రజలకు వివరించి చెప్పలేరు. ఏదో ఒక రహస్య ముహుర్తంలో కెనడా కాళ్ల మీద పడి రక్షమాం అని వేడుకోవడం తప్ప ట్రంప్‌కు వేరొక మార్గం లేదు.
గ్రీన్‌ల్యాండ్స్‌ను కొంటాడట
గ్రీన్‌ల్యాండ్స్ కొనేస్తానన్న ప్రకటన మరొక విదూషక చేష్ట. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం అది. అక్కడ అపారమైన ఖనిజాలు, పెట్రోల్ నిల్వలు వున్నాయి. దేశం చాలా పెద్దది. కానీ జనాభా 50వేల మంది మాత్రమే. వారికి స్వంత సైన్యం లేదు. వారిని నియంత్రించే డెన్మార్క్‌కు కూడా సైనిక బలం లేదు. ఆ అలుసుతో వాచాలత్వం ప్రదర్శిస్తున్నాడు ట్రంప్. కానీ దాని ప్రభావం నాటో కూటమి అస్తిత్వం మీద పడుతున్నది.
నాటో సభ్యత్వం కలిగిన ఒక దేశంపై దాడి జరిగితే, నాటో సభ్య దేశాలన్నీ కలిసి కదలాలన్నది ఒప్పందం. అమెరికా కూడా నాటో సభ్యత్వ దేశమే. ఐరోపా మొత్తం అందులో వుంది. ట్రంప్ వంటి వెర్రివాడు చేసే వికృత చేష్టలకు ఐరోపా సమాజం మద్దతు ఇవ్వలేదు. గ్రీన్‌ల్యాండ్ రక్షణకు వారు ముందుకు వచ్చి తీరాలి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీరందరినీ దాటుకొని, గ్రీన్‌ల్యాండ్స్‌ను స్వాధీనం చేసుకోవడం ట్రంప్ తరం కాదు. కానీ ఆయన నోటి పొగరు వల్ల ప్రపంచ రాజకీయాలలో పెను మార్పులు వస్తున్నాయి. రష్యా, చైనా ఈ అవకాశాన్ని వాడుకొని తీరుతాయి.
అమెరికాకెంత బలం వుందో, అంతకు రెట్టింపు బలం చైనా వద్ద వుంది ఇప్పుడు. వారు పరిస్థితులను గమనిస్తున్నారు. అవకాశం దొరికితే ప్రపంచ పెత్తనం కోరుకొంటున్నారు. ఆ భయం ఐరోపా, ఆసియా దేశాలను కలవర పెడుతున్నది. అమెరికాను వదలిపెట్టి తామే ఒక మార్గం వెతుక్కోవాలన్న ఆలోచన ప్రపంచ దేశాలలో కలుగుతున్నది. ఈ పరిణామాల వల్ల నష్టపోయేది అమెరికా మాత్రమే. వారు ఒంటరిగా మిగలబోతారు. ఎంత పెద్ద ఆయుధ బలం వున్నా, ప్రపంచం ఐక్యంగా ఎదురు నిలబడితే, పిల్లి వలె తోక ముడవక తప్పదు.
మరో కథ..
వెనిజువెలాది వేరొక కథ. అక్కడ రాజకీయవాదుల అవివేకం వల్ల అత్యంత సంపన్న దేశం కాస్తా నిరుపేదగా మారిపోయింది. తినడానికి తిండిలేని దుర్గతి. అక్కడి పెట్రోల్ నిల్వలు దోచుకోవాలని ట్రంప్ దురాశ. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి, దేశాధ్యక్షుడిని ఎత్తుకెళ్లాడు. కానీ ట్రంప్ సాధించగలిగింది ఏదీ లేదు. వెనిజువెలా పెట్రోల్ బావులను తీసుకోమని ఆదేశిస్తే, ఏ అమెరికన్ కంపెనీ కూడా ముందుకు రావడం లేదు. అరాచక పరిస్థితులలో వ్యాపారం చేయడం అసాధ్యం కాబట్టే, అందరూ దూరంగా వెళ్లిపోతున్నారు. వెనిజువెలా మీద చేసిన దుస్సాహసం వల్ల అమెరికాకు కలిగే ప్రయోజనం శూన్యం.
కానీ ప్రపంచ దేశాల దృష్టిలో అదొక దుర్మార్గ దేశంగా ముద్ర పడిపోయింది. ఇదివరకటి వలె ఎవరూ దానికి సన్నిహితంగా మెలగలేని దౌర్భాగ్యాన్ని కొని తెచ్చుకొన్నాడు ట్రంప్. రెండవ ప్రపంచ యుద్ధం వరకు నియంతల ఏలుబడిలో సాగింది ప్రపంచం. అంతకు క్రితం బ్రిటీష్ వలస రాజ్య విధానం అమలు జరిగింది. రష్యా, అమెరికా ప్రచ్ఛన్న యుద్ధం చాలాకాలం నడిచింది. ప్రపంచం రెండు ధృవాలుగా చీలిపోయింది ఆ కాలంలో.
ఇప్పుడు ట్రంప్ చర్యల వల్ల ప్రపంచ రాజకీయాలలో ఒక కొత్త విధానం ఆవిర్భవించబోతున్నది. దాని స్వరూప, స్వభావాలు స్పష్టం కావడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ఈ నూతన ప్రపంచ రాజకీయంలో రష్యా, భారత్, చైనాలు కీలక భూమిక పోషించబోతున్నాయి.
– రవీంద్ర తీగల