ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్‌పై గవర్నర్‌కు డాక్టర్ శ్రవణ్ దాసోజు ఫిర్యాదు
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి.మనోహర్‌ను అక్రమంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు గవర్నర్, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. జనవరి 12న జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయని, ఇది భావప్రకటనా స్వేచ్ఛను అణచివేసే చర్యగా ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో తక్షణ జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. విశ్వవిద్యాలయాలు మేధో స్వేచ్ఛకు వేదికలుగా ఉండాల్సిన అవసరం ఉందని, పరిపాలనలోని లోపాలపై ప్రశ్నించినందుకే సీనియర్ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని డాక్టర్ శ్రవణ్ విమర్శించారు. విచారణ లేకుండా శిక్ష విధించడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని సమానత్వం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవన హక్కులను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మూడు డిమాండ్లు సమర్పించారు.
ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేయాలని, సంబంధిత రికార్డులపై విచారణ చేపట్టాలని, అలాగే విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. మేధో స్వేచ్ఛను కాపాడటం అందరి బాధ్యత అని డాక్టర్ శ్రవణ్ స్పష్టం చేశారు.