– 70 రోజుల వరకు భద్రపరచేలా ఏర్పాట్లు
– పరీక్షలు జరిగే ప్రతి గదిలోని సీసీ కెమెరాలు
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
– రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను ప్రారంభించిన మంత్రి
విజయవాడ: వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను మరింత పెంచే దిశగా ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ‘రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో నిర్వహించే యూజీ, పీజీ మెడికల్ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలను సీసీ కెమెరాల ద్వారా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
గత అనుభవాల నేపథ్యంలో కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోని సీసీ కెమెరాలను నేరుగా యూనివర్సిటీలోని కమాండ్ కంట్రోల్ రూముతో అనుసంధానం చేశామని చెప్పారు. దీంతో విద్యార్థుల ప్రతి కదలిక కంప్యూటర్లలో నిక్షిప్తమవుతుందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కేంద్రం ప్రస్తుత పరీక్షల పర్యవేక్షణ విధానానికి అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని కోర్సులు కలిపి ఏడాదికి సుమారు 60 వేల మంది విద్యార్థులు యూనివర్సిటీ ద్వారా జరిగే పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. మొదటగా ఎంబీబీఎస్, పీజీ పరీక్షలను పర్యవేక్షించగా, దశలవారీగా డెంటల్, ఆయుర్వేద, హోమియో, నర్సింగ్ తదితర కోర్సుల పరీక్షలనూ ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం ఐదు వైద్య కళాశాలల్లో పరీక్షల పర్యవేక్షణ ప్రారంభించామని, క్రమంగా కళాశాలల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ఈ సెంటర్ వల్ల పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటారని, మానవ వనరుల వినియోగం కూడా సమర్థంగా జరుగుతుందని మంత్రి అన్నారు.
70 రోజులు భద్రపరిచే రికార్డింగ్
పరీక్షల సమయంలో విద్యార్థుల కదలికల దృశ్యాలు కమాండ్ కంట్రోల్ రూములోని కంప్యూటర్లలో 70 రోజుల వరకు భద్రపరచేలా ఏర్పాట్లు చేశారు. రికార్డింగ్ చెడిపోకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి వైద్య కళాశాలలో సగటున 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, కమాండ్ కంట్రోల్ రూములో ఆరు స్క్రీన్ల వీడియో వాల్, పది కంప్యూటర్లు ఉన్నాయి. సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఏఐ సాయంతో వెంటనే సమాచారం అందేలా వ్యవస్థ రూపొందించారు. ఇంటర్నెట్ అంతరాయం ఉన్న సమయంలోనూ పరీక్షల దృశ్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కార్యకలాపాలను ఓరిగో బిజ్ సొల్యూషన్స్ పర్యవేక్షించనుండగా, దూరాంక్ సంస్థ సాఫ్ట్‌వేర్ అందించింది. కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.30 లక్షలు ఖర్చు కాగా, రెండేళ్ల నిర్వహణకు రూ.1.5 కోట్లు వ్యయం అవుతుందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికా రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో యూనివర్సిటీ ద్వారా జరిగే అన్ని రకాల పరీక్షలను రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శ్రీకాంత్, ఏపీ వైద్య మండలి చైర్మన్ శ్రీహరిరావు పాల్గొన్నారు.