– రేవంత్ అవినీతి పాలనను ఢిల్లీ స్ధాయిలో ఎండగడతాం
– ఎంపీ వద్దిరాజు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల టెండర్లలో చోటుచేసుకున్న అవినీతి,అక్రమాలను పార్లమెంటులో లేవనెత్తి కాంగ్రెస్ అసమర్థ పాలనను దేశం దృష్టికి మరోసారి తీసుకువస్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తీవ్ర నష్టాలలో ఉన్న సింగరేణి సంస్థను కేసీఆర్ తన పదేళ్ల పాలనలో సంస్కరించి లాభాల బాట పట్టించారన్నారు.
ఎంపీ రవిచంద్ర హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శుక్రవారం శాసనసభలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. సిట్ పేరిట బీఆర్ఎస్ అగ్ర నాయకులకు నోటీసులు జారీ చేస్తూ కార్తీక దీపం, చక్రవాకం టీవీ ఎపిసోడ్స్ మాదిరిగా పాలకులు డ్రామాలు చేస్తున్నారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగుతో పోలీసులకు తప్ప, పాలకులకు సంబంధం ఉండదని, దేశ భద్రత దృష్ట్యా ఇది వారి విధి నిర్వహణలో భాగం మాత్రమేనని చెప్పారు.
కాళేశ్వరం, గొర్రెల స్కాం,ఈ-ఫార్మూలా కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ నాయకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు “డైవర్షన్ పాలిటిక్స్”చేస్తూ నాటకాలాడుతున్నారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, కాంగ్రెస్ సర్కార్ అసమర్థతను అర్థం చేసుకుని ఛీదరించుకుంటున్నారని అన్నారు. రిజర్వేషన్స్ 42% పెంచుతామని మోసం చేసిన కాంగ్రెస్ పాలకులపై బీసీలు మంటతో ఉన్నారని, తగిన శాస్తి తప్పదని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బమ్మెర రాంమూర్తి, లింగంపల్లి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.