– నీ పార్టీకి ప్రజలెప్పుడో పాడి కట్టేశారు
* పాదయాత్ర కంటే ముందు అసెంబ్లీకి రా…
* పులివెందుల సమస్యలపై మాట్లాడు
* జగన్ పై మంత్రి సవిత ఫైర్
* రాష్ట్రాభివృద్ధిలో మంత్రి లోకేశ్ అలుపెరగని కృషి
* అంబరాన్నంటిన మంత్రి లోకేశ్ జన్మదిన సంబరాలు
* పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి సవిత
తాడేపల్లి/అమరావతి : వైసీపీకి ప్రజలు ఎప్పుడో పాడి కట్టేశారని, జగన్ శవ యాత్ర చేసినా ప్రజలు పట్టించుకోరని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఎద్దేవా చేశారు. అరెస్టు భయంతో డైవర్షన్ రాజకీయాలకు కొత్త డ్రామా మొదలు పెట్టారని, పాదయాత్ర సంగతి తరవాత ముందు అసెంబ్లీకి వచ్చి పులివెందుల సమస్యలపై మాట్లాడాలని జగన్ కు మంత్రి హితవు పలికారు.
తాడేపల్లిలోని పాతూరు జంక్షన్ లో శుక్రవారం జరిగిన మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక టీడీపీ నాయకులతో కలిసి భారీ కేక్ కట్ చేసి ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధిలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పాత్ర అలుపెరగని కృషి చేస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడుల సేకరణలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధికి మంత్రి లోకేష్ అవిరళ కృషి చేస్తున్నారన్నారు.
దావోస్ సహా విదేశాల్లో పర్యటిస్తూ ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో రూ.25 లక్షల కోట్లకుపైగా నిధులు ఏపీకి రాబట్టారన్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రిగా లోకేష్ సేవలు అభినందనీయమన్నారు. పతనమైన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతూ, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.
సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం, తల్లికి వందనం పథకం అమలు చేసి అందరికీ విద్యను అందజేయడంలో విజయవంతమయ్యారన్నారు. 150కి పైగా కేసులు వేసినా, వాటన్నింటినీ అధిగమించి, మెగా డీఎస్సీ నిర్వహించి, 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారు. ఈ ఏడాది మరో డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతున్నారన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యామిత్ర కిట్లు అందజేశారన్నారు.
జగన్ రెడ్డి ఇంటర్ విద్యార్థులను ఆకలి దప్పులతో మాడిస్తే, వారి కడుపు నింపేలా మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేసిన ఘనత మంత్రి లోకేశ్ దేనన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెగా పేరెంట్స్ మీటింగ్ లు నిర్వహించి, విద్యా వ్యవస్థలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేశారన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో, మాక్ అసెంబ్లీ నిర్వహించారన్నారు.
జగన్ శవ యాత్ర చేసినా జనాలు రారు
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ వ్యవస్థలను అతలాకుతలం చేశారని మంత్రి సవిత మండిపడ్డారు. ఆయన అసమర్థ పాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ఈడీ విచారణలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్కడ నిజాలు బయటపెడతారేమోనని, అరెస్టు భయంతో జగన్ డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారన్నారు. పాదయాత్ర చేస్తానంటూ ప్రజలను డైవర్ట్ చేసే డ్రామాకు తెరతీశారన్నారు.
వైసీపీకి ప్రజలు ఎప్పుడో పాడి కట్టేశారన్నారు. ఆయనిప్పుడు శవ యాత్ర చేసినా ఎవరూ పట్టించుకోరన్నారు. పాదయాత్ర సంగతి తరవాత, ముందు అసెంబ్లీకి వచ్చి పులివెందుల నియోజక వర్గ సమస్యలపై మాట్లాడాలని జగన్ కు మంత్రి సవిత హితవు పలికారు. అనంతరం మహిళలకు మంత్రి సవిత చీరలు పంపిణీ చేశారు. మంత్రి లోకేష్ జన్మదిన సందర్భంగా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రాభివృద్ధికి మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి సవిత కొనియాడారు. తాడేపల్లిలోని నారా లోకేశ్ క్రీడా మైదానంలో టీడీపీ నాయకులు కోగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన మంత్రి లోకేశ్ జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
దేశంలో ఏపీని నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తన తండ్రి, సీఎం చంద్రబాబునాయుడు కంటే మంత్రి లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. జగన్ అసమర్థతో నాశమైన విద్య వ్యవస్థను గాడిలో పెడుతున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పనితీరును కొనియాడుతూ రూపొందించిన పాటను మంత్రి సవిత ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాల్లో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పేరేపి ఈశ్వరరావు, గుమ్మడి గోపాలకృష్ణ సహా టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్, టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధి కోమటి జయరాం, కుసుమ, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
చిగురు ఆశ్రమంలో…
ఉండవల్లిలోని కరకట్ట వద్ద ఉన్న చిగురు ఆశ్రమంలో అనాథ చిన్నారుల మధ్య మంత్రి లోకేష్ జన్మదిన వేడుకులను మంత్రి సవిత జరుపుకున్నారు. 43 కేజీల భారీ కేక్ ను చిన్నారులతో కలిసి మంత్రి సవిత కట్ చేశారు. పుస్తకాలు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో మంత్రి సవిత మమేకమయ్యారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులతో పాటు టీడీపీ నాయకులు సురేశ్, కొమ్మారెడ్డి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.