– అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణ
– రాజధాని రెండోదశలో ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి
– ఫెసిలిటేటర్, రెగ్యులెటర్ గా ప్రభుత్వం
రాజధాని అమరావతి నగర మాస్టర్ ప్లాన్ రెండవ దశ పూలింగ్ జరిగే గ్రామాలకు విస్తరించడంతోపాటు, ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు పూర్తిస్థాయి ప్రణాళిక తయారు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలిచారు. దీనికోసం రూపొందించిన నోట్‌లో అనేక కీలక అంశాలు పొందుపరిచారు.
అమరావతి రాజధాని నగర మాస్టర్లోను రెండోదశలో 20,494 ఎకరాలకు విస్తరించడంతో పాటు దానికి అనుసంధానంగా 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలు కలిపి సుమారు ఒక లక్షా 77 వేల ఎకరాలకు నిర్మాణ ప్రణాళికను రూపొందించాలని ఈ నోట్లో ప్రతిపాదించారు. ఇప్పటికే తొలి దశలో సమీకరించిన 53 వేల ఎకరాలతో కలిపి 2.30 లక్షల ఎకరాలకు మాస్టర్ ప్లాన్ చేరనుంది.
అయితే, రెండవ విడతకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ నోట్లో ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని స్పష్టంగా పేర్కొన్న ప్రభుత్వం దానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తోంది. స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక పద్ధతుల్లో అభివృద్ధి చేసేలా ఈ ప్రణాళికను తయారు చేయనుంది. ఇటీవల రెండోదశ పూలింగు ప్రారంభం సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తూర్పున జాతీయ రహదారి, ఉత్తరాన కృష్ణానది. పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డు వరకూ మాస్టర్లోను విస్తరిస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే సీఆర్డీఏ అధికారులు రంగం సిద్ధం చేశారు. రెండోదశ పూలింగు భూముల అభివృద్దిలో ప్రైవేటు వ్యక్తులను, సంస్థలు, డెవలపర్లను భాగస్వామ్యం చేయనున్నారు.
అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడం, పూర్తి చేయడంతోపాటు ఆర్థికాభివృద్ధికి వీలుగా అనుబంధ నగరాలను మాస్టర్ ప్లాను వరిధిలో ఏర్పాటు చేయాలని, దీనికోసం అదనపు భూమికి ప్లాను విస్తరించడం అవసరమని ప్రతిపాదించారు. ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా, రెగ్యులేటర్ గా మాత్రమే వ్యవహరిస్తుంది. ప్లాను తయారీ, ఫైనాన్స్, అమలు అనే మూడు పద్ధతుల్లో భవిష్యత్ కార్యాచరణ ఉండనుంది. ప్రస్తుతానికి కొత్తగా తీసుకున్న ఏడు.
గ్రామాలకు గతంలో ఉన్న రాజధాని ప్లాన్ విస్తరించనున్నారు. దీనికోసం 43 గ్రామాల పరిధిలోని ఏర్పాటు చేసే ప్రాంతీయ ప్లానును కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. దీనివల్ల భూ యజమానులు తిరిగి పొందే ప్లాట్లకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే మాస్టర్ ప్లాన్ లో ఏడు గ్రామాల పరిధిలోని 82.9 చదరపు కిలోమీటర్లను కలుపుకుని మొత్తం 709.6 చదరపు కిలోమీటర్లకు విస్తరించనున్నారు. గుంటూరు దగ్గర్లోని డోకిపర్రు నుండి మొదలుకుని.. పెదకూరపాడు మండలంలో తాళ్లూరు గ్రామం, పెదకాకాని మండలంలో వేజెండ్ల, మంగళగిరి మండలంలో కాజ గ్రామం వరకూ మొత్తం ప్రాంతాన్ని మాస్టర్ ప్లాన్ పరిధిలోకి తీసుకురానున్నారు. ఆరునెలల్లో రెండుదశల్లో దీన్ని పూర్తి చేయాలని, సీఆర్డీఏ అవసరాల మేరకు విస్తరించడంతోపాటు అవసరమైతే అదనపు గ్రామాలకు ప్లానును పెంచేలా రూపకల్పన చేయనున్నారు. తొలి రెండు నెలల్లో ఏడు గ్రామాల్లో ప్లాను తయారీకి వీలుగా అన్ని రకాల సర్వేలు పూర్తి చేయడంతోపాటు గ్రీన్, బ్లూ ప్లాను రూపకల్పన చేయనున్నారు.
ఇన్నర్ రింగురోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు వీలుగా రవాణా నెట్వర్క్ ఏర్పాటు చేయడంతోపాటు, కొత్తగా ఏర్పాటు చేసే రైలు మార్గాన్ని అనుసంధానించనున్నారు. ఈ అభివృద్ధి ప్రణాళిక నిర్వహణ బాధ్యతను, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షించనుంది.
రెండోదశ పూలింగ్ సమగ్ర ప్లానుతోపాటు మిగిలిన 43 గ్రామాల నిర్మాణ ప్రణాళికకు సంబంధించి గుంటూరు జిల్లాలో 29 గ్రామాలుండగా, వల్నాడు జిల్లాలో 14 గ్రామాలు ఉన్నాయి.
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
9010099208