– రాధాకృష్ణ…. నువ్వు రాసింది అబద్ధమని ఒప్పుకో
– లేదంటే ఇది నా వ్యక్తిత్వ హననంగా పరిగణించాల్సి వస్తుంది
– రాధాకృష్ణ ఎవరి సంతోషం కోసం, ఎవరిని ఆనంద పరచడం కోసం రాశాడో ఆయనకే తెలియాలి
– తప్పుడు రాతలతో సింగరేణి సంస్థకు కార్మికులకు నష్టం కలిగించడం శోచనీయం
– సృజన్ రెడ్డి కంపెనీకి ముఖ్యమంత్రికి సంబంధం లేదు
– ఆ కంపెనీ యాజమాని నాటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కుమార్తెనే
– సింగరేణి సంస్థ లో ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉంటున్న ఐదుగురు టీఆర్ఎస్ కు సంబంధించిన వారే
– కాంట్రాక్టు ఇచ్చేటప్పుడు సైట్ విజిట్ అనేది మేం పెట్టిన కొత్త నిబంధన కాదు
-కోలిండియా తో పాటు, ఎన్ఎండిసి, ఆయిల్ కంపెనీలు ఇతర ప్రధాన కంపెనీలలో ఇప్పటికే ఈ నిబంధన ఉంది
– హరీశ్ రావు లేఖ రాస్తే 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లు, కాంట్రాక్టుల పైన విచారణకు సిద్ధం
– ముఖ్యమంత్రి రాగానే నేను స్వయంగా ఆయనను ఒప్పించి విచారణకు ఆదేశాలు ఇప్పిస్తా
– ఉన్నత విలువలు కలిగి ఉన్న నా వ్యక్తిత్వంపై దాడి సమంజసం కాదు
– సింగరేణి పై గద్దలను, రాబందులను, పెద్దలను వాలనివ్వను
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: పెట్టుబడులు, కట్టు కథల విషపు రాతల రాధాకృష్ణ తనపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవి, వాస్తవ దూరమైనవని, కనుక రాధాకృష్ణ తాను రాసినవన్నీ అవాస్తవాలు అని స్వయంగా తిరిగి రాయాలని.. లేనట్లయితే ఆయన రాతలు వ్యక్తిత్వ హననం జరిగినదిగా భావించాల్సి ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు హెచ్చరించారు.
శనివారం ఉదయం జ్యోతిరావు పూలే భవన్ లో ఆయన ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఇటీవల తనపైన, సింగరేణి పైన వస్తున్న వార్తలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న కథనాలు తనను ఆవేదనకు గురిచేశాయన్నారు.
సింగరేణిలో టెండర్లు, వాటికి సంబంధించిన టెండర్లు కానీ వాటికి సంబంధించిన ఫైళ్లు గానీ తన వద్దకు గానీ రాష్ట్ర ప్రభుత్వం వద్దకు రావని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పారదర్శకంగా సేవలు అందించేందుకు సింగరేణి కాలరీస్ సంస్థకు ఒక బోర్డు ఉందని, అందులో సీనియర్ అధికారులు ఉంటారని, వారంతా ఒక స్వయంప్రతిపత్తి తో నిర్ణయాలు తీసుకుంటారని అని పేర్కొన్నారు. అన్ని నిర్ణయాలు సంస్థలో అమలులో ఉన్న విధివిధానాలు, నిబంధనల ప్రకారమే స్వతంత్రంగా తీసుకుంటారని, రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాకు కాంట్రాక్ట్ విషయంలో కాంట్రాక్టర్లు ముందుగా సైట్ విజిట్ చేయాలని, ఆ మేరకు గని అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందితేనే కాంట్రాక్టు లో బిడ్డింగ్ చేయడానికి అర్హత కల్పిస్తూ, తానేదో కొత్త నిబంధన పెట్టినట్లు రాధాకృష్ణ పేర్కొన్నారని, ఈ నిబంధన దేశంలో మరెక్కడా లేదని, కేవలం కొందరు భట్టి విక్రమార్కకు చెందిన వారికి కాంట్రాక్టు అప్పగించడానికే ఇలా చేశారంటూ కట్టు కథనాలను, పిట్ట కథలను అల్లి వార్త ప్రచురించారని విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన సైట్ విజిట్ చేయటం అనేది కేవలం సింగరేణిలో మాత్రమే ఉన్నది, తమ హయాంలో ప్రవేశ పెట్టింది అంత కన్నా కాదని రుజువులతో వివరించారు. 2018, 2021, 2023 లో కోలిండియా అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐఎల్ రూపొందించిన సింగరేణి టెండర్ డాక్యుమెంట్ లో, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్ఎండీసీ, ఐఐటీ, ఐఐఎం, ఫైనాన్స్ విభాగం, డిఫెన్స్ విభాగం, గుజరాత్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర చాలా కంపెనీల్లో చాలా ఏళ్లుగా ఉన్నట్లు, ఆయా కంపెనీలకు సంబంధించిన టెండర్ లేఖలను విలేకరులకు చూపించారు.
కోలిండియా కు అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐఎల్ వారు సింగరేణి సంస్థకు సూచించిన టెండర్ నిబంధనలలో సైట్ విజిట్ జరపడం తప్పనిసరి అని పేర్కొన్నదని సీఎంపీడీఐఎల్ నిబంధన మేరకే సింగరేణి సంస్థ 2018 నుంచి ఈ నిబంధనను పాటిస్తూ వస్తుందన్నారు. ఈ నిబంధన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పొందుపరిచారు అన్నది పూర్తి అవాస్తవమని పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన అని, తాము కొత్తగా రూపొందించింది కాదు అని స్పష్టం చేశారు.
సింగరేణిలో డీజిల్ సరఫరా ను కాంట్రాక్టర్లకే అప్పగించడం ద్వారా మరో కుంభకోణానికి తెరలేపారన్న హరీశ్ రావు ఆరోపణలను ఆయన ఖండించారు. డీజిల్ సరఫరా విధానంలో మార్పులు కూడా తమ హయాంలో జరగలేదని, 2022లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఈ విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. జీఎస్టీ విధాన మార్పులు, డీజిల్ దొంగతనాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంట్రాక్టల్లోనూ ఈ పద్ధతే అమలులో ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు.
సింగరేణి సంస్థ టెండర్లను ముఖ్యమంత్రి బావ మరిదికి కట్టబెడుతున్నట్లు ఒక కట్టు కథను ప్రచారం చేస్తున్నారని, వారు పేర్కొన్నట్లుగా సుజన్ రెడ్డి కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఎండి దీప్తి రెడ్డి. ఆమె టి.ఆర్.ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కుమార్తె. ఆమె భర్త, ఆయన అల్లుడే సుజన్ రెడ్డి అని వివరించారు.
అలాగే సింగరేణి వ్యాప్తంగా పలు కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న ఐదు ప్రముఖ కాంట్రాక్టర్లు కూడా టీఆర్ఎస్ నేతలకు బంధువులు లేదా సన్నిహితులు అని వివరించారు. హరీశ్ రావుకు కానీ ఇంకా ఎవరికైనా కానీ అనుమానాలు ఉన్నట్లయితే ,తనను కోరినట్లయితే వివరించేవాడిని అని పేర్కొన్నారు.
కేవలం నైనీ బ్లాక్ టెండర్ పైనే కాకుండా 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల టెండర్లపై కూడా విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారని ఆయన రాగానే తాను స్వయంగా ఆయనతో మాట్లాడి విచారణకు ఆదేశించేలా చూస్తానని పేర్కొన్నారు. అప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు.
“సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి. దీనిపై వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లడం రాష్ట్రానికి నష్టం చేస్తుంది” అని హెచ్చరించారు.“నేను రాజకీయాల్లోకి వచ్చినది ఆస్తులు దోచుకోవడానికి కాదు. ప్రజల ఆస్తులను కాపాడటానికే వచ్చాను. సింగరేణి కార్మికుల చెమటతో ఏర్పడిన ఈ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో రాబందులకు అప్పగించను” అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తాను మండుటెండలో పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహించి సింగరేణి గనులను సందర్శించానని, సింగరేణి కార్మికుల రక్తం, స్వేదముతో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, ఇటువంటి బొగ్గు సంపద పైన ఎటువంటి రాబందులు, గద్దలు, పెద్దలను వాలకుండా చూడడమే తన కర్తవ్యమన్నారు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత పదేళ్లలో కొత్త బొగ్గు గనుల అభివృద్ధిలో తగిన ప్రయత్నాలు జరగకపోవడం వల్ల భవిష్యత్తులో ఉత్పత్తి, ఆదాయం తగ్గి వేలాది కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో మార్పులు, గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పెరుగుతున్న నేపథ్యంలో, నాణ్యమైన బొగ్గు గనులను త్వరగా సొంతం చేసుకుని ఆపరేషన్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సింగరేణిని కేవలం బొగ్గుకే పరిమితం చేయకుండా క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, సింగరేణి మేనేజ్మెంట్ మరియు కార్మికులు పూర్తి కమిట్మెంట్తో సంస్థ భవిష్యత్తును కాపాడుతారని స్పష్టం చేశారు.
40 సంవత్సరాలుగా ఉన్నత విలువలతో తాను పనిచేస్తున్నాననీ, తన వ్యక్తిత్వ హననానికి రాధాకృష్ణ పూనుకున్నారని, అందుకే వాస్తవాలు వివరించానన్నారు. కనుక రాధాకృష్ణ తాను రాసిన రాతలు అవాస్తవమని, తిరిగి ప్రజలకు వివరించాలని, లేనట్లయితే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. తాను 40 సంవత్సరాలుగా కొన్ని ఉన్నత విలువలతో పనిచేస్తున్నానని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోనన్నారు.