ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని ప్రయాణాలు కేవలం అధికారం కోసం జరుగుతాయి. కానీ మరికొన్ని ప్రయాణాలు ఒక జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, వ్యవస్థల్లో గూడుకట్టుకున్న భయాన్ని పారద్రోలడానికి పుడతాయి. మూడేళ్ల క్రితం కుప్పం గడ్డపై నారా లోకేశ్ ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్ర రెండో కోవకు చెందినది.
ఈ ప్రస్థాన నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆనాడు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను ఒక్కసారి నెమరువేసుకోవాలి. ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతున్న కాలమది. ప్రతిపక్ష గొంతు నొక్కడమే ధ్యేయంగా సాగిన పాలనలో, సామాన్య పౌరుడు కూడా మాట్లాడాలంటే భయపడే స్థితి. మాజీ మంత్రుల అక్రమ అరెస్టుల నుంచి, క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు వేలమందిపై అక్రమ కేసులు బనాయించి నేతలను ఖైదీలుగా జైలుపాలు చేసిన, ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీని తలపించే పాలనను మనం చూశాం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, బలవంతపు ఏకగ్రీవాలు, అభ్యర్థుల కిడ్నాప్‌లు చూసి ప్రజాస్వామ్యవాదులు విస్తుపోయారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అర్ధరాత్రి అరెస్టులు, ప్రశ్నిస్తే వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. చివరికి సభలు పెట్టి చుట్టూ కందకాలు త్రవ్వి, పోలీసులను మోహరించి, పథకాలు కట్ అవుతాయన్న భయంతో జనాన్ని బలవంతంగా తరలించి సభా ప్రాంగణాల్లో బంధించే దుస్థితి నెలకొంది.
వ్యవస్థలను కుప్పకూల్చారు. ప్రయాణీకులను గోతుల్లో పడేశారు. ఆంధ్రాను అగాధంలో పడేసి పాలకుడే పరదాలు కట్టుకొని తిరిగే విచిత్ర, విషాద విధ్వంసమయమది.
అలాంటి భయోత్పాత పరిస్థితుల మధ్య… “యువగళమై, మీ గొంతుకగా వస్తున్నాను” అంటూ లోకేశ్ బయలుదేరారు. 3,132 కిలోమీటర్ల ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్నవి కేవలం ఎండ, వానలు మాత్రమే కాదు.. అడుగుడుగునా అడ్డంకులు, మైకులు లాక్కోవడాలు, ఆంక్షల కంచెలు. కానీ, ఆ అడ్డంకులే ఆయనలోని పట్టుదలను పెంచాయి.
లోకేష్ పాదయాత్రలో కొన్ని దృశ్యాలు నేటికీ కళ్ల ముందు కదలాడుతుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తనను చూడటానికి వచ్చిన ఒక వృద్ధురాలిని హత్తుకుని ఆమె ఆకలి బాధ విన్నప్పుడు… నిరుద్యోగంతో కుమిలిపోతున్న యువతకు కాళ్లకు బొబ్బలు భరిస్తూ భరోసా ఇచ్చినప్పుడు… ‘యువగళం’ ఒక రాజకీయ యాత్రగా కాకుండా ఒక భావోద్వేగ ఉద్యమంగా మారింది.
ప్రజల కోసం ఆయన ముందుకు సాగిన తీరు రాజకీయాలకు అతీతంగా అందరినీ కదిలించింది. అతనిని ఆపడానికి ఆఖరికి అతని తండ్రి అరెస్టు మాత్రమే పరిష్కారం అని పాలకులు భావించి, అనుకున్నంత పని చేశారు. కానీ, ఆ విపత్కర పరిస్థితుల్లోనూ లోకేశ్ చూపిన ధైర్యం తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరి పోసింది. ఆ పాదయాత్ర దాని నవమాసాల విజయం కంటే మరింత బలంగా ప్రజల మనసుల్లో నిలిచింది.
లోకేష్ తనపై ఉన్న విమర్శలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక అత్యంత పరిణతి చెందిన ప్రజా నాయకుడిగా ఎదిగారు. అన్యాయం చేసిన వారిని వదిలేది లేదని ‘రెడ్ బుక్’ ద్వారా హెచ్చరిస్తూనే, మరోవైపు అభివృద్ధికి కావలసిన స్పష్టమైన విజన్‌ను ప్రజల ముందుంచారు. పోలీసుల వేధింపులతో కుంగిపోయిన కార్యకర్తలకు “నేను ముందుంటా, మీరు రండి” అని ధైర్యం ఇచ్చి, వారిని పోరాట పటిమ గల సైనికులుగా మార్చారు.
నేడు యువగళం ప్రారంభమై మూడేళ్లు పూర్తవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త దారిలో నడుస్తోంది. నాడు పడ్డ అడుగులు వృధా పోలేదు. లోకేశ్ చిందించిన ప్రతి చెమట చుక్క, ప్రజలు కార్చిన ప్రతి కన్నీటి చుక్క నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పునాదులయ్యాయి.
చరిత్ర గెలిచిన వారి గురించి మాత్రమే రాస్తుంది అంటారు, కానీ ‘యువగళం’ చరిత్రను ఎలా తిరగరాయాలో నేర్పిన ఒక గొప్ప పాఠం. అణచివేత ఎంత బలంగా ఉంటే, తిరుగుబాటు అంత ప్రచండంగా ఉంటుందని నిరూపించిన ఈ ప్రస్థానం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. “నాయుడు గారి తరువాత ?” అని ఊహించుకోడానికే భయపడే రాష్ట్రానికి, పార్టీకి.. “హమ్మయ్య లోకేష్ దొరికాడు” అనే నిశ్చింతను ఆ ప్రయాణం ప్రసాదించింది.