– ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అనే విధానం ఎందుకు పెట్టారు?
– రెండున్నర మూడు కోట్లలో అయ్యే పని దేశం మొత్తంలో.. ఒక్క తెలంగాణలో మాత్రం ఏడు కోట్లు ఎందుకు అవుతుంది?
– విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు
– చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుంది?
– గవర్నర్‌జీ.. బొగ్గు కుంభకోణంపై మీరు జోక్యం చేసుకోండి
– సిబిఐ కి ఇస్తారా? సిట్టింగ్ జడ్జికి ఇస్తారా? మీ ఇష్టం ఎవరికి ఇస్తారో ఇవ్వండి.
– రాష్ట్ర గవర్నర్ ని కలిసిన అనంతరం మీడియా తో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: మా పార్టీ తరఫున శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల బృందం, మా సీనియర్ నాయకుల బృందం అందరం కలిసి గవర్నర్ కు ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది.
సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభాపక్ష ఉపనాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు పత్రికా సమావేశం పెట్టి, ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. మీడియా కూడా మాకు సహకరించి, ఈ కుంభకోణాన్ని పూర్తిస్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతా ఉన్నాయి.
కేవలం మాట్లాడటమే కాదు, ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తిస్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసినం. దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ ని, దృష్టి మళ్లించడానికి, విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు.
ఇవాళ సిఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియా కి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ఈ కుంభకోణాన్ని, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే… చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయటపెట్టిన తర్వాత, ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు.
ఈ విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతున్నాడు సింగరేణితో. లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు కొడతా ఉన్నాడు. కానీ నేను వారికి గుర్తు చేస్తున్నా… ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తదో ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి.
పది కోట్ల రూపాయలు సింగరేణి నిధులు, సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి, మీరు ఫుట్ బాల్ ఆటకి వినియోగించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగూ ఫుట్ బాల్ ఆడుతున్నారు, కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్ బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి
ఒక్క స్కామ్ కి సంబంధించి ఇన్ని ఆధారాలు బయటపెడితే కూడా, ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటివరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదు. టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అంటే మీరు సైట్ మీదకి రావాలి, అక్కడికి వచ్చినట్టు సర్టిఫికెట్ తీసుకోవాలి అన్న నిబంధన పారదర్శకతకు పాతరవేసి ఎందుకు పెట్టారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం లేదు.
భారతదేశంలో ఎక్కడ ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టారు అంటే ఇంతవరకు సమాధానం రాదు. నిజంగానే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధన గనుక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సిఫారసు చేసి ఉంటే, ఆ రోజున్న బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. అన్ని టెండర్లను కూడా ట్రాన్స్పరెంట్ గా ఆనాడు మేము పిలిచినాం.
అందుకే ఆరోజు అన్ని మైనస్ టెండర్లు వచ్చినాయి. ఎస్టిమేటెడ్ కాస్ట్కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బు ఆదా చేస్తూ ఆరోజు జరిగిన మాట వాస్తవమా కాదా? టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అనే విధానం ఎందుకు పెట్టారు? ఎవరికి లాభం చేయడానికి? నిబంధన అప్పటినుంచి తొమ్మిది నెలల్లో ఎన్ని సంస్థలు ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు? మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయి? ఎన్ని లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికేట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది? ఒక వైట్ పేపర్ (శ్వేత పత్రం) ప్రచురించండి అని మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదు.
కొంతమందికే సెలెక్టివ్‌గా ఎందుకు ఇచ్చారు మీరు? కొంతమందికే సెలెక్టివ్‌గా మీరు ఎందుకు మరి కొంతమంది కాంట్రాక్ట్ సంస్థలనే ఎందుకు మీరు ఎన్నుకుంటున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇందులో రింగ్ మాస్టర్, సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా కాదా అని మేము అడిగితే, ఇంతవరకు సమాధానం రాదు, ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టత రాదు.
ఒక నైనీ టెండర్లే కాదు, నైనీ బొగ్గు గని టెండర్లే కాదు. అన్ని టెండర్లను పారదర్శకత ఉండాలి. నైనీలో కూడా గతంలో 2021లో, 2022లో రెండు సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే నిబంధన లేదు. మరి ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరమైంది?
సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయట పెట్టాం. భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్‌కు రెండున్నర నుంచి మూడు కోట్లలో ఇవాళ సోలార్ నిర్మాణం జరుగుతా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం ఏడు కోట్లు. రెండున్నర మూడు కోట్లలో అయ్యే పని దేశం మొత్తంలో, ఒక్క తెలంగాణలో మాత్రం ఏడు కోట్లు ఎందుకు అవుతున్నది? ఇది స్కామ్ కాదా సోలార్ పవర్‌లో అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదు.
ఎక్స్‌ప్లోజివ్స్ , జిలెటిన్ స్టిక్స్, 30 శాతం అదనంగా రేటు పెంచారు. డైరెక్టర్లు నిలదీస్తే బోర్డులో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప, కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనకకు తగ్గలేదు. ఈ అన్ని విషయాలు ఇవాళ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చం. కాంట్రాక్టర్లను బెదిరించి, కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ఇవాళ ప్రజా ధనాన్ని దోచుకుంటున్న తీరును వివరించడం జరిగింది
ఇవాళ గౌరవ గవర్నర్ గారిని అడిగాము. సార్ మీరైనా ఇన్వాల్వ్ కాండి లేదా కిషన్ రెడ్డి కి ఆదేశం ఇవ్వండి.. సిబిఐ కి ఇస్తారా? సిట్టింగ్ జడ్జికి ఇస్తారా? మీ ఇష్టం ఎవరికి ఇస్తారో ఇవ్వండి.
కానీ ప్రజా ధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థను, అటు సోలార్ పవర్‌లో కుంభకోణం, ఇటు సింగరేణి ఓబి గనుల్లో కుంభకోణం.. దీన్ని అడ్డుకోండి అని విన్నపం చేశాం.