అబద్దం పేరు మార్చుకుంది. సుమారు వందేళ్ల తర్వాత అబద్దానికి ఈ పరిస్థితి వచ్చింది. వందేళ్ల క్రితం గోబెల్స్ వల్ల అబద్దానికి పేరు మార్చుకునే పరిస్థితి ఉత్పన్నం అయితే… ఇప్పుడు సాక్షి పత్రిక వల్ల మళ్లీ అబద్దానికి ఆ పరిస్థితి. జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలోని నాజీల ప్రభుత్వంలో ప్రాపగండా మంత్రిగా పని చేసిన పాల్ జోసెఫ్ గొబెల్స్ చేసిన తప్పుడు ప్రచారాన్ని చూసి ఆశ్చర్యపోయిన అబద్దం తన పేరు మార్చుకోవాలని భావించిందట.
ఓ బూటకపు అంశాన్ని పదే పదే చెబుతూ ఉంటే దాన్ని నిజం అని ప్రజలను భ్రమింప చేయవచ్చనేది గోబెల్స్ సిద్దాంతం. హిట్లర్ ను దేవుడిలా, జర్మనీ రక్షకుడిలా చిత్రీకరించడంలో నాడు గోబెల్స్ కీలక పాత్ర పోషించాడు. రేడియో, సినిమాలు, పత్రికలు, పోస్టర్లు ఇలా అన్నింటిలోనూ నియంత హిట్లర్ ను దైవాంశ సంభూతుడిలా గోబెల్స్ చిత్రీకరించాడు. అలాగే నాజీ సిద్దాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు గోబెల్స్. ఆ విధమైన ప్రచారంతో ఆ రోజుల్లో అబద్దం అనే మాట కనుమరుగై… గోబెల్స్ అనే మాట బాగా పాపులర్ అయింది.
అయితే దాదాపు వందేళ్ల తర్వాత అబద్దానికి మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురైనట్టు కన్పిస్తోంది. దీంతో మళ్లీ ఇప్పుడు అబద్దం తన పేరు మార్చుకోవాలని అనుకుంటోందట. ఓ బూటకాన్ని వంద సార్లు చెబితే నిజం అని ప్రజలు నమ్ముతారనే గోబెల్స్ సిద్దాంతాన్ని మించిన స్థాయిలో ఇప్పుడు సాక్షి పత్రిక కుట్రలతో అబద్దాలను వండి వార్చేస్తోంది.
నాడు హిట్లర్ వంటి నియంతను ఏ విధంగా దైవాంశ సంభూతుడిలా చిత్రీకరించే ప్రయత్నం చేశారో… ఇప్పుడు వినాశకారి జగన్ మోహన్ రెడ్డిని కూడా దైవ స్వరూపం అనే విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది సాక్షి. గత కొన్ని రోజులుగా ఆ పేపర్లో వస్తున్న కథనాలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. క్రెడిట్ చోరీ గురించి అదే పనిగా తప్పుడు కథనాలు వండి వారుస్తుంది.
దీనికి అనేక ఉదాహరణలు. గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్ పోర్టు, భూముల రీ-సర్వే, తిరుమల కల్తీ నెయ్యి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే వీటిన్నికంటే పీక్స్ వెలిగొండ ప్రాజెక్టు మీద సాక్షి రాసిన అబద్దపు కథనం. పనులు పూర్తి కాకుండా జాతికి అంకితం చేసింది చాలక… తానెప్పుడో పని పూర్తి చేస్తే.. ఇంకా నీళ్లవ్వరేంటంటూ బుకాయిస్తూ అబద్దపు కథనాన్ని అల్లింది.
వివరాలు చూస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా రూ. 3000 కోట్ల మేర పనులు చేపట్టాల్సి ఉందట. ఈ పనులు పూర్తి కాకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ఓ విడ్డూరమైతే… మేం నిర్మాణం పూర్తి చేసేశాం… ఇంకా పనులంటారేంటీ అనే రీతిలో కథనం వండడం మరింత విచిత్రంగా ఉందని కూటమి ప్రభుత్వం ఆశ్చర్యపోతోంది.
గతంలో అబద్దం ఆడితే గోడకట్టినట్టుండాలి… అతికినట్టుండాలి అనేవారు. కానీ ఇప్పుడు అబద్దం ఆడితే సాక్షిలో రాసినట్టుండాలి అనే కొత్త సామెత పుట్టుకొచ్చిందని అంటున్నారు. ఇంకొందరైతే అబద్దం అనే పదాన్ని వాడటం కంటే… సాక్షి అనే పదం వాడితే చాలునని చెప్పుకుంటున్నారు.
