– కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు
విజయవాడ: వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక, ఉపాధి, పరిశ్రమల ప్రాంతీయ సదస్సు రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నోవాటెల్ హోటల్ లో నిర్వహించారు.. ఈ సదస్సును కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ జాయింట్ సెక్రటరీ డా. మహేంద్ర కుమార్, అడిషనల్ సెక్రటరీ అజయ్ శర్మ, జాయింట్ సెక్రటరీ అసుతోష్ ఏటీ. పెడ్నెకర్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రాంతీయ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం కార్మిక చట్టాల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంచడంతోపాటు అసంఘటిత రంగ కార్మికుల కోసం అమలు చేస్తున్న చట్టాల పురోగతిని సమీక్షించడం జరిగింది. ఈ-శ్రమ్ ద్వారా కార్మికుల డేటాబేస్ నమోదు, వారికి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందేలా చర్యలు తీసుకోవడం, రాష్ట్రాల్లో కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టి, నైపుణ్యాభివృద్ధి పై చర్చించారు.
వ్యాపార సౌలభ్యం (Ease of Doing Business), పరిశ్రమల స్థాపనకు అవసరమైన నిబంధనలను సరళతరం చేయడం, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడం పై చర్చ జరిగింది. కొత్తగా ప్రతిపాదించిన నాలుగు లేబర్ కోడ్ల అమలుపై రాష్ట్రాల సన్నద్ధతను తెలుసుకోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒకే వేదికపై సమస్యలను చర్చించడం, స్థానిక అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక విధానాలలో మార్పులు చేయడం పై సమాలోచనలు చేశారు. ప్రాంతీయ సదస్సులో ఏపీ, కర్నాటక, తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, పాండిచ్చెరి రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు.
ఏపీ నుంచి రాష్ట్రం నుంచి కార్మిక శాఖ కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు, కమిషనర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు ప్రెజెంటేషన్ చేశారు. రాష్ట్రంలో కొత్త లేబర్ కోడ్లను మెరుగైన రీతిలో అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. అంతేకాకుండా విప్లవాత్మకమైన ఐటీ, డిజిటల్ సంస్కరణలు చేపడుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ తెలిపారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా పారదర్శకత, వేగవంతమైన సేవలే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ అన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు 32.66 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయన్నారు. డిజిటల్ వర్క్ ఫ్లో ద్వారా 34,000 కు పైగా పారదర్శకంగా తనిఖీలు నిర్వహించామన్నారు. 14 పాత చట్టాలను కలిపి ఒకే ఏకీకృత పోర్టల్ ద్వారా రిటర్న్స్ దాఖలు చేసే సౌకర్యం కల్పించామన్నారు. దీనివల్ల యజమానులకు వ్యయం, పనిభారం తగ్గుతుందన్నారు.
ఐఆర్ కోడ్–2020 ప్రకారం ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్లను పూర్తిగా ఆటోమేటెడ్ ఆన్లైన్ విధానంలోకి మారుస్తున్నామన్నారు. మొబైల్ యాప్ ద్వారా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కార్మికుల పనివేళల నమోదు, భవన నిర్మాణ కార్మికుల (BOCW) క్లెయిమ్స్, ఫిర్యాదుల పరిష్కారం అన్నీ ఎండ్-టు-ఎండ్ డిజిటల్ పద్ధతిలో జరుగుతాయన్నారు. ఈ-శ్రమ్, ఆధార్, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ డేటాబేస్‌లతో కార్మిక శాఖ వ్యవస్థను అనుసంధానిస్తున్నామన్నారు.
చైల్డ్ లేబర్, వెట్టి చాకిరి నిర్మూలనకు జీఐఎస్ (GIS) సాంకేతికతను వాడుతున్నామని, బాధితులకు తక్షణ పునరావాసం కల్పిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కార్మికులకు సేవలను వేగంవంతంగా అందించడం జరుతుందని కమిషనర్ గంధం చంద్రుడు తెలిపారు.
ప్రాంతీయ సదస్సులో ఆయా రాష్ట్రాల కార్మిక శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు, నూతనంగా తీసుకొచ్చిన కార్మిక కోడ్ చట్టాల విధి విధానాల అమలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు.